మొత్తం 1.11 కోట్ల మంది కార్మికులకు మేలు
• జూన్ 1 నుంచి అమలు : సిఎం రేవంత్
ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో : కార్మికుల కనీస వేతనాలు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని కార్మికులను అన్ స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్ అనే నాలుగు కేటగిరీలుగా విభజించి వేతనాలను నిర్ధారించింది. కనీస వేతనాల పెంపుపై మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గురువారం హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జోన్-1లో అన్ స్కిల్డ్ కేటగిరీలో కనీస వేతనం రూ.12,750 నుంచి రూ.16 వేలకు, సెమీ స్కిల్డ్ కేటగిరీలో రూ. 13,152 నుంచి రూ. 17 వేలకు, స్కిల్డ్ కేటగిరీలో రూ. 13,772 నుంచి రూ. 18,500కు, హైలీ స్కిల్డ్ కేటగిరీలో రూ.14,607 నుంచి రూ.20 వేలకు వేతనాలు పెంచినట్లు వెల్లడించారు. కనీస వేతనాల పెంపు నిర్ణయం ద్వారా రాష్ట్రంలో 1.11 కోట్ల మందికి లబ్ది చేకూరనుందని చెప్పారు. జూన్ ఒకటి నుంచి ఈ నిర్ణయం అమలవుతుందని వివరించారు. రాష్ట్రంలోని ప్రాంతాలను మూడు జోన్‌లుగా విభజించామని తెలిపారు. జోన్-1లో మున్సిపల్ కార్పొరేషన్లు, జోన్-2లో మున్సిపాలిటీలు, జోన్-3లో గ్రామీణ ప్రాంతాలను తీసుకుని కనీస వేతనాలను నిర్ణయించామని వెల్లడించారు. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా కనీస వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకున్నామన్నారు.









కామెంట్‌లు (0)