ప్రజాశక్తి- మైలవరం : మైలవరం మండలం వేపరాల గ్రామం సమీపంలోని పెన్నా నదిలో ఆదివారం జరిగిన విషాద ఘటనలో గల్లంతైన వెంగమ్మ (45) మృతదేహం సోమవారం ఉదయం లభ్యమైంది. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం రామాపురానికి చెందిన కళ్యాణ్ కుమార్ (25), అతని కుటుంబ సభ్యులు, బంధువులు నది వద్దకు వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు ఓ చిన్నారి నీటిలో పడింది. చిన్నారిని కాపాడేందుకు వెంగమ్మ నీటిలోకి దిగగా ఆమె కూడా ప్రవాహంలో చిక్కుకుంది. వారిని రక్షించేందుకు ప్రయత్నించిన కళ్యాణ్ కుమార్‌కు ఈత రాకపోవడంతో అతను కూడా మునిగిపోయాడు. ఘటన జరిగిన రోజే కళ్యాణ్ కుమార్ మృతదేహాన్ని స్థానికులు వెలికితీశారు. అయితే వెంగమ్మ ఆచూకీ లభించకపోవడంతో గాలింపు చర్యలు కొనసాగించారు. సోమవారం ఉదయం నదిలో మృతదేహం తేలియాడుతూ వెళ్తుండగా స్థానికులు గుర్తించి ఒడ్డుకు తీసుకొచ్చారు. అనంతరం అధికారులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని తదుపరి చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో రామాపురం, తొర్రివేముల గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్నారిని కాపాడే ప్రయత్నంలో ప్రాణత్యాగం చేసిన వెంగమ్మ, రక్షించేందుకు ప్రయత్నించి మృతి చెందిన కళ్యాణ్ కుమార్‌లకు స్థానికులు నివాళులు అర్పించారు.
పెన్నా నదిలో గల్లంతైన వెంగమ్మ మృతదేహం లభ్యం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 08, 2026, 04:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)