అమరావతి : చిరు వ్యాపారులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దొనేపూడి. కాశీనాథ్ పేర్కొన్నారు. బీసెంట్ రోడ్డులో హాకర్స్ కు టౌన్ ప్లానింగ్ అధికారులు ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోవాలని కోరుతూ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం దగ్గర ఆందోళన చేపట్టారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో డి.ఆర్.ఓకి, మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ చంద్రశేఖర్ కి (పి.జి.ఆర్.ఎస్) వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా దొనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ.. విజయవాడ నగరంలో 25 నుండి నుంచి 35 వేల వరకు హకర్స్ ఉన్నారని, వీరు వివిధ ప్రాంతాల్లో చిరు వ్యాపారాలు చేస్తూ జీవనం గడుపుతున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏ విధంగా వారి పొట్టకొట్టాలో ఆలోచిస్తుందని మండిపడ్డారు. విజయవాడ నగరంలో తీసుకొచ్చిన గ్రీన్ జోన్, రెడ్ జోన్, అంబర్ జోన్ ల విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జోన్ల విధానం వల్ల పేద వర్గాలు చేస్తున్న చిరు వ్యాపారాలు దెబ్బతినే పరిస్థితి నెలకొందని అన్నారు. ఇది అమలు జరిగితే వేల కుటుంబాలు రోడ్డున పడతాయాని అన్నారు. హాకర్ గుర్తింపు కార్డులు ఇచ్చి వారి జీవనోపాధి కాపాడాలని అన్నారు. నగర వ్యాప్తంగా రెన్యూవల్ అవ్వకుండా ఉన్న వారు వందల సంఖ్యలో ఉన్నారని అన్నారు. వీటితో పాటుగా 200 రూపాయలు డబ్బులు కూడా చెల్లించారని అన్నారు. ప్రభుత్వం ఎటువంటి ఉపాధి చూపించకపోయినా, ఎవరి మీద ఆధారపడకుండా, స్వయం ఉపాధితో తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని అన్నారు. వీరి ఉపాధిని దెబ్బతీసి నోటి దగ్గర కూడును లాగేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. మున్సిపల్ అధికారులు, పోలీసులు వేధింపులు పెరిగాయని, ట్రాఫిక్ కు ఇబ్బందనే పేరుతో అక్కడక్కడ హాకర్ల ను తొలగిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఉపాధి కల్పించకపోగా ఉన్న షాపులు, బండ్లను బలవంతంగా తొలగిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఫైన్లు వేసి కేసులు నమోదు చేస్తున్నారని అన్నారు. బడా పారిశ్రామిక వేత్తలకు లక్షల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు మాఫీ చేసిన మన ప్రభుత్వాలు హాకర్లకు కనీసం బ్యాంకు లోన్లు కూడా ఇవ్వటంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో హాకర్లు కొత్త గుర్తింపు కార్డులు, రెన్యూవల్ కోసం సచివాలయాల దగ్గర మనిషికి రూ.200లు చొప్పున కట్టినా వారికీ గుర్తింపు కార్డులు ఇవ్వలేదని అన్నారు. హాకర్లకు గుర్తింపు కార్డులు ఇచ్చి, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, వడ్డీలేని ఋణాలు ఇవ్వాలని, పోలీస్ అధికారుల వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా జీవనోపాధి పొందుతున్న చిరు వ్యాపారుల బతుకులతో చెలగాటం ఆడవద్దని, వారి ఉపాధిని దెబ్బతీసే చర్యలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పేదల బతుకులను కొట్టే ప్రయత్నాలు ఆపకపోతే సిఐటియు ఆధ్వర్యంలో తోపుడుబండ్ల వ్యాపారులు, చిరు వ్యాపారులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర కార్యదర్శి ఎం. సోమేశ్వరరావు, విజయవాడ హాకర్స్, తోపుడబండ్లు యూనియన్ అధ్యక్షులు భూలోకం, ప్రధాన కార్యదర్శి సి. హెచ్ మురళి, కోశాధికారి ఉదయకుమార్, ఆర్గనైజింగ్ కార్యదర్శి బి.లక్ష్మనరావు, నగర ఉపాధ్యక్షులు రమణ, మస్తాన్, స్రవంతి, బి. లక్ష్మి, శ్రీను, అప్పారావు, సూరమ్మ,గౌరీ, కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చిరు వ్యాపారులపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి : సిఐటియు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 08, 2026, 03:29 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)