test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపరిహారం లేకుండానే భూములు స్వాధీనం

16 మే, 2026

bhogapuram
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 16, 2026, 11:13 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

– బైరెడ్డి పాలెం అప్రోచ్ రోడ్డు పనులను అడ్డుకున్న రైతులు
ప్రజాశక్తి-భోగాపురం : భోగాపురం ఎయిర్‌పోర్ట్ కోసం భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. భూములు కోల్పోయిన రైతులకు దక్కాల్సిన పరిహారం నేటికీ అందలేదు. పరిహారం కోసం శుక్రవారం బైరెడ్డిపాలెం అప్రోచ్ రోడ్డు పనులను రైతులు అడ్డుకున్నారు. వృద్ధ దంపతులైన ఇద్దరు రైతులు జెసిబి తొట్టెలో కూర్చొని నిరసన తెలపగా డ్రైవర్ వారిని తొట్టెతో పైకి లేపి పక్కన పెట్టడం వివాదాస్పదమైంది. ఈ ఘటనపై ఆర్‌‌డిఒకు ఫిర్యాదు చేశారు. భూసేకరణకు సంబంధించిన పరిహారం అంశాలు న్యాయపరమైన ప్రక్రియలో ఉన్నాయని, బాధితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ ఎస్. రామసుందర్ రెడ్డి తెలిపారు. భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. జాతీయ రహదారి నుంచి ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లేందుకు సవరవిల్లి పంచాయతీ ఉప్పాడపేట జంక్షన్ వద్ద ట్రంపెట్ నిర్మాణం కోసం 19.85 ఎకరాల భూమిని సేకరించారు. ట్రంపెట్ నుంచి ఎయిర్‌పోర్ట్‌కు అప్రోచ్ రోడ్డు నిర్మాణం కోసం మరో 60 ఎకరాల భూమిని రైతుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో 20.22 ఎకరాల భూమికి సంబంధించిన రూ.19. 89 కోట్ల పరిహారాన్ని కొంతమంది రైతుల ఖాతాల్లో జమ చేశారు. మిగతా భూ పరిహారాన్ని వివిధ కారణాల రీత్యా లారా (ల్యాండ్ అక్విజిషన్ రీ హేబిలిటేషన్ అథారిటీ) కోర్టులో జమ చేసినట్లు సమాచారం. ఇటీవల సవరవిల్లి, గూడెపువలస రెవెన్యూ పరిధిలోని కొంతమంది రైతులకు పరిహారం అందించినప్పటికీ, మిగతా రైతులకు నేటి వరకు చెల్లింపులు జరగలేదని బాధితులు చెబుతున్నారు. జులై లేదా ఆగస్టు నెలల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మొదటి దశ పనులు కూడా దాదాపు పూర్తి కావడంతో బైరెడ్డిపాలెం అప్రోచ్ రోడ్డు పనులను వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పోలీసు సిబ్బందిని వెంటపెట్టుకొని జెసిబిల సాయంతో భూములను స్వాధీనం చేసుకునేందుకు అధికారులు వెళ్లారు. విషయం తెలుసుకున్న రైతులు తమ భూములను చదును చేస్తున్న జెసిబిలకు అడ్డుగా నిలిచారు. గ్రామానికి చెందిన రైతులు బైరెడ్డి అప్పలనర్సయ్య, తోటమ్మ పనులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తూ జెసిబి తొట్టెలో కూర్చొని నిరసన తెలిపారు. దీంతో జెసిబి డ్రైవర్ ఆ తొట్టెతో పాటు వారిని పైకి లేపి పక్కన పెట్టాడు. దీంతో రైతులు పోలీసులపైనా, అధికారుల తీరుపైనా ఆర్‌డిఒకు ఫిర్యాదు చేశారు.

ఘటనపై చర్యలు తీసుకున్నాం : కలెక్టర్
బైరెడ్డిపాలెంలో ఎయిర్ పోర్టు అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనుల సందర్భంగా చోటుచేసుకున్న ఘటనపై జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. జెసిబి ఆపరేటర్‌ను పోలీస్ కస్టడీలోకి తీసుకున్నట్లు వెల్లడించారు. బాధిత రైతులతో ఆర్‌‌డిఒ మాట్లాడారని, పరిష్కారానికి త్వరగా చర్యలు తీసుంటామని చెప్పారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్