అమరావతి : ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణలతో రద్దయిన నీట్ యూజీ 2026 పరీక్షను మళ్లీ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. జూన్ 21న, ఆదివారం ఈ పరీక్ష జరగనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శుక్రవారం వెల్లడించింది. ఈ మేరకు ఎన్‌టీఏ తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. రీఎగ్జామ్‌కు సంబంధించి అధికారిక మార్గాల్లో వచ్చే సమాచారాన్నే విశ్వసించాలని విద్యార్థులను ఎన్‌టీఏ కోరింది. హాల్‌టికెట్, ఇతరత్రా వివరాలను త్వరలోనే వెల్లడించనుంది.
రీ ఎగ్జామినేషన్ కు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ....
దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 3వ తేదీన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష-యూజీని (నీట్-యూజీ) నిర్వహించిన సంగతి తెలిసిందే. దేశంలోని 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో ఈ పరీక్ష జరిగింది. అయితే, ఈ పరీక్ష ప్రశ్నా పత్రాలు కొన్నిచోట్ల లీకయ్యాయని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో నాటి పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఎన్‌టీఏ ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న 23 లక్షల మంది మళ్లీ పరీక్ష రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా.. రీఎగ్జామినేషన్‌కు మరోసారి దరఖాస్తు చేసుకోనక్కర్లేదని, ఫీజు చెల్లించాల్సిన అవసరంగానీ లేదని ఎన్‌టీఏ స్పష్టం చేసింది.
కొనసాగుతోన్న సిబిఐ దర్యాప్తు ....
ఇదిలా ఉండగా.. నీట్ పేపర్ లీక్‌పై సిబిఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు కీలక నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. రాజస్థాన్‌లోని సికార్‌లో ఈ లీకేజీ వ్యవహారం బయటపడింది. సుమారు 410 ప్రశ్నలతో ఒక గెస్ పేపర్ పరీక్షకు ముందే విద్యార్థులకు అందగా.. అందులోని 120 కెమిస్ట్రీ ప్రశ్నలు పరీక్షలో వచ్చాయనే ఆరోపణలొచ్చాయి. ప్రశ్నల క్రమంతోపాటు ఆప్షన్లు కూడా ఒకే వరుసలో ఉండటంతో లీక్ జరిగినట్లు ప్రాథమికంగా నిర్థారించారు. మహారాష్ట్రలోని నాసిక్ నుంచి ప్రశ్నపత్నం లీక్ అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అక్కడి నుంచి రాజస్థాన్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, కేరళ సహా పలు రాష్ట్రాలకు చేరినట్లు దర్యాప్తులో తేలింది. ఈ పేపర్ కోసం విద్యార్థుల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం.









కామెంట్‌లు (0)