ప్రజాశక్తి-కాకినాడ :
తీరప్రాంత పర్యావరణ పరిరక్షణతో పాటు మత్స్యకారులు, వెనుకబడిన వర్గాలు, ముఖ్యంగా మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. మంగళవారం కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధ్యక్షతన జిల్లా అటవీ అధికారి ఎన్. రామచంద్రరావు, రెవెన్యూ, మత్స్య, డీఆర్డీఏ తదితర శాఖల అధికారులతో జిల్లా స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ మరియు ఐక్యరాజ్యసమితి అభివృద్ధి సంయుక్త సహకారంతో, హరిత వాతావరణ నిధి(జీసీఎఫ్) నిధులతో కొరింగ వన్యప్రాణి అభయారణ్యం, దాని పరిసర తీరప్రాంత గ్రామాల పరిధిలో చేపడుతున్న వివిధ వాతావరణ అనుకూల అభివృద్ధి పనుల పురోగతిని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. ఈ ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నుండి సాధించిన ఫలితాలను అధికారులు వివరించగా, కాకినాడ జిల్లాలో మడ అడవుల పునరుద్ధరణ, జీవనోపాధి రంగాలలో గణనీయమైన ప్రగతి నమోదైనట్లు జిల్లా అటవీ శాఖాధికారి ఎన.రామచంద్రరావు జిల్లా కలెక్టర్ కు వివరించారు. గతంలో వందలాది హెక్టార్ల విస్తీర్ణంలో విజయవంతంగా మడ అడవుల పెంపకం పూర్తి చేయబడిందని, అలాగే వందలాది మంది లబ్ధిదారులకు చేపల విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై, సముద్ర నాచు పెంపకంపై ప్రత్యక్ష ప్రదర్శనలతో కూడిన శిక్షణ విజయవంతంగా అందించామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జీసీఎఫ్ కు సంబంధించి 2026 కార్యాచరణ ప్రణాళిక లక్ష్యాల ప్రకారం పనిచేయాలన్నారు. ఇందులో భాగంగా మడ అడవుల విస్తరణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఈ ఏడాది నూతనంగా మరో 115 హెక్టార్లలో మడ అడవుల పెంపకం చేపట్టడంతో పాటు గతంలో పునరుద్ధరించిన 180.58 హెక్టార్ల అడవులను సంరక్షించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. అదేవిధంగా నూతన యూనిట్ల స్థాపనలో భాగంగా స్థానిక మహిళలు, వెనుకబడిన వర్గాల ఉపాధి కోసం రంగు చేపల పెంపకం, సముద్ర నాచు సాగు, పీతల పెంపకం యూనిట్లను జిల్లాలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. వీటితో పాటు మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు వాతావరణ అనుకూల జీవనోపాధిపై ప్రత్యేక శిక్షణలు, స్థానిక ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన సదస్సులు, సామాజిక సంప్రదింపులు నిర్వహించాలని జిల్లా సూచించారు.
భవిష్యత్తులో అనుమతులు రాగానే సముద్రపు పంజరాలలో చేపల పెంపకం, సమగ్ర తెగుళ్ల నివారణ ప్రదర్శనలు, సమగ్ర నేల సంరక్షణ నిర్వహణ, చిరుధాన్యాల సాగు విస్తరణ, తోటపని మొక్కల పెంపకం వంటి మరిన్ని వినూత్న కార్యక్రమాలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అక్వేరియం ఇతర మోడల్ యూనిట్లకు సంబంధించి అవసరమైన డీపీఆర్లు, ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు.
సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి డా.టి.తిప్పేనాయక్, కాకినాడ, పెద్దాపురం ఆర్డీవోలు ఎస్ మల్లి బాబు, పి.కృష్ణారావు, మత్స్య శాఖ అధికారి కె.కృష్ణారావు, డీఆర్డీఏ ఏపీడీ జిలానీ, పాడా ఏపీడి వశంత మాధవి, ఫారెస్ట్ రేంజ్ అధికారులు, వర ప్రసాద్, శ్రీదీప్తి; జీసీఎఫ్ జిల్లా సమన్వయకర్త ఎల్.శ్రీహర్ష ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.









కామెంట్‌లు (0)