న్యూఢిల్లీ : టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం మే నెలలో 9.68శాతానికి ఎగబాకింది. గత నెల ఈ సూచీ 8.26శాతంగా ఉంది. ధరలను అరికట్టడంలో మోడీ ప్రభుత్వం విఫలం కావడంతో ఏప్రిల్‌లో డబ్ల్యుపిఐ అమాంతం పెరిగి 42 నెలల గరిష్ట స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణ గణాంకాలను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సోమవారం విడుదల చేసింది. దీనిలో ఆధార సంవత్సరాన్ని గతంలో ఉన్న 2011-12 నుండి 2022-23కి సవరించారు.ఇంధనం, ఆహారం, తయారీ వస్తువుల ధరలు పెరగడంతో డబ్ల్యుపిఐ పెరిగినట్లు తెలిపింది.
ఇంధనం, విద్యుత్ విభాగంలో టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఏప్రిల్ లో 24.89శాతంగా ఉండగా, మే నెలలో 30.33శాతానికి పెరిగింది. ముడి చమురు విభాగంలో గత నెలలో 56.31శాతం ఉండగా, మే నెలలో 61.51శాతంగా నమోదైంది. ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 2.43శాతం ఉండగా, మే నెలలో అది 3.60 శాతానికి పెరిగింది. తయారీ ఉత్పత్తులలో ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లోని 6.68 శాతం నుండి మే నెలలో 7.48 శాతానికి పెరిగినట్లు గణాంకాలు వెల్లడించాయి. రిటైల్ లేదా వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం కూడా గత నెలలోని 3.48శాతంతో పోలిస్తే, మే నెలలో 3.93శాతానికి పెరిగి 16 నెలల గరిష్ఠ స్థాయికి చేరుకున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ తెలిపింది.
ద్రవ్యోల్బణాన్ని 4 శాతం అటు ఇటు 2 శాతం మార్జిన్ తో స్థిరంగా ఉండేలా చూడాలని కేంద్రం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బిఐ)ని ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ద్రవ్యోల్బణ అంచనాను ఆర్ బి ఐ ఈ నెల ప్రారంభంలో 4.6 శాతం నుండి 5.1 శాతానికి పెంచింది.








కామెంట్‌లు (0)