mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అప్పనంగా ఆర్‌‌టిసి అమ్మకం

11 జూన్, 2026

rtc
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 12, 2026, 01:22 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

@ప్రస్తుతం నాలుగు అప్పగింత
@ఆస్తుల అమ్మకంలో చిత్ర విచిత్ర విన్యాసాలు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఆస్తుల అమ్మకం ఖాతాలో ఎపిఎస్‌ఆర్‌‌టిసి కూడా చేరింది. ఇప్పటికే భూములు, మున్సిపల్ ఆస్తులు, ఎపిఐఐసి ఆస్తులు వరుసగా అమ్ముకుంటూ వస్తున్న ప్రభుత్వం ఆర్‌‌టిసిని కూడా పినాకిల్ మొబిలిటీ సొల్యూషన్స్ అనే సంస్థకు అప్పగించేసింది. రాష్ట్రంలో మొత్తం 12 డిపోలు అప్పగించేందుకు అన్ని ఏర్పాట్లూ చేసి ప్రస్తుతం నాలుగు డిపోలు ఇచ్చేసింది. అది కూడా ఆర్‌‌టిసి ఖర్చులతో విద్యుత్ బస్సులకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలు కల్పించి మరీ ఇచ్చేస్తోంది. దీనిపై ఆర్‌టిసి ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. ఆందోళనకు సిద్ధమయ్యాయి. మన ఇల్లు మన డబ్బులతో మనం కట్టుకుని ఉండేందుకు వేరే వాడికి ఉచితంగా ఇచ్చినట్లు ప్రస్తుత ఆర్‌‌టిసి పరిస్థితి ఉందని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు.
పిఎం ఇ-బస్ సేవా పథకం కింద ఆర్‌‌టిసికి 1,050 విద్యుత్ బస్సులను కేటాయించారు. తొలిదశలో 750 బస్సులు కొంటున్నారు. ఈ బస్సుల కొనుగోలు నిర్వహణ బాధ్యతను ఆర్‌‌టిసికి ఇవ్వకుండా ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించారు. బస్సుల కొనుగోలు ఖర్చులో కేంద్రం 60 శాతం కొనుగోలుదారుడు అంటే పినాకిల్ మొబిలిటీ సొల్యూషన్స్ సంస్థకు రాయితీ ఇస్తోంది. వీటిని తొలిదశలో 11 నగరాల్లో 12 ప్రదేశాల్లో నిర్వహించాలని నిర్ణయించారు. దీనికితోడు అప్పగించాలనుకున్న బస్ డిపోల్లో విద్యుత్ బస్సులకు అవసరమైన సదుపాయాలను సొంత ఖర్చుతో కల్పించి ఆర్‌‌టిసియే ఏజెన్సీకి అప్పగించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఇప్పటికే విద్యాధరపురం, గుంటూరు-2, నెల్లూరు-2, మంగళం డిపోలను పూర్తిగా అప్పగించారు. ఇవి కాకుండా గాజువాక, కాకినాడ, అనంతపురం, మంగళగిరి, కడప, కర్నూలు డిపోలు పాక్షికంగా ఇచ్చారు. త్వరలో వాటిని కూడా పూర్తిగా ఇచ్చేయనున్నారు. సింహపురి (నెల్లూరు), రాజమహేంద్రవరంలో కొత్త డిపోలు ఏర్పాటు చేసి ఇవ్వనున్నారు. కొత్తగా తీసుకునే బస్సుల్లో తొమ్మిది మీటర్లు, 12 మీటర్ల పొడవున్న బస్సులు ఉన్నాయి. తొమ్మిది మీటర్ల బస్సుకు కిలోమీటరుకు రూ.62.17 పైసలు, 12 మీటర్ల బస్సుకు రూ.72.55 పైసలు చెల్లించనున్నారు. ఇందులోనే బస్సు, డ్రైవర్, మెయింటెనెన్స్, ఛార్జింగ్, ఇన్సూరెన్స్ అన్నీ ఉన్నాయి. ముందుగా టికెట్ రెవెన్యూ ఆర్‌‌టిసికి వెళుతుంది. అక్కడ నుండి ప్రైవేటు ఏజెన్సీకి చెల్లింపులు జరుగుతాయి. వచ్చే మొత్తలో ఆర్‌‌టిసి రూ.24 తీసుకుంటుంది. బిల్డ్, ఓన్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్ పద్ధతిలో నిర్వహించే ఈ బస్సులకు సంబంధించిన ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ట్రాన్స్‌ఫార్మర్లు, మెయింటెనెన్స్ ఎక్విప్‌మెంట్, సివిల్ వర్క్స్ డ్రైవర్లు, కండక్టర్లు నియామకం, 12 ఏళ్లపాటు బస్సులు డిపోల ఆపరేషన్, మెయింటెనెన్స్ అన్నీ ఏజెన్సీ చూస్తుంది. అవి కూడా ఆర్‌‌టిసియే ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు. ఇందులో ప్రైవేటు ఏజెన్సీ వ్యాపారం చేసుకునేందుకు, లాభాలు పొందేందుకు మొత్తం సహాయ సహకారాలు ప్రభుత్వమే అందిస్తుంది.


నిధుల కేటాయింపులో కిరికిరి
కొత్తగా కొనుగోలు చేసే బస్సులకు సంబంధించి సదుపాయాలన్నీ ఆర్‌‌టిసి కల్పించినా.. సబ్సిడీ మాత్రం కాంట్ర్టాక్టరుకు వెళుతుంది. అదే ఆర్‌‌టిసి.. నేరుగా కొనుగోలు చేసే సంస్థకే సబ్సిడీ వస్తుంది. కానీ ప్రభుత్వం బస్సులు కొనేందుకు వీల్లేదని ఆర్‌‌టిసి తెగేసి తేల్చిచెప్పింది. దీనివల్ల బస్సులతోపాటు, కేంద్రం ఇచ్చే సబ్సిడీ పోతుంది. 750 బస్సులకు రూ.40 లక్షల చొప్పున రూ.300 కోట్లు ఆర్‌‌టిసి కోల్పోతుంది. దీంతోపాటు రాష్ట్రంలో స్రీశక్తి పథకం అమల్లో భాగంగా ఆర్‌‌టిసికి ఏడాదికి రూ.300 కోట్లు ప్రబుత్వం చెల్లించాల్సి ఉంది. అయితే సీలింగ్ పెట్టి రూ.140 కోట్లు మాత్రమే చెల్లిస్తోంది. అదే మొత్తాన్ని ఆర్‌‌టిసికి చెల్లిస్తే అదనంగా వచ్చే రూ.160 కోట్లతోపాటు విద్యుత్ బస్సుల కొనుగోలు వల్ల వచ్చే సబ్సిడీ రూ.300 కోట్లు మొత్తం కలిపి ఏడాదిలోనే ఆర్‌‌టిసిలో 300 బస్సులకుపైగా అందుబాటులోకి వస్తాయి. ప్రైవేటు ఏజెన్సీకి ఇచ్చే 15 ఏళ్లలో ఏడాదికి రూ.150 కోట్లు స్రీశక్తి పథకం నిధులు మిగిలినా 2 వేల బస్సులకుపైగా ఆర్‌‌టిసి కొనొచ్చు. దీనివల్ల ఉపాధి అవకాశాలూ పెరుగుతాయి. సంస్థ కూడా ఆర్థికంగా నిలదొక్కుకుంటుంది. ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందుతాయి. కానీ ప్రభుత్వం మాత్రం విద్యుత్ బస్సుల నిర్వహణ ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి నిలువుగా ఆర్‌‌టిసి పీక నులిమేసింది. దీనివల్ల ప్రజా రవాణా వ్యవస్థ రూపంలో ప్రజలపై పెనుభారాలు పడనున్నాయి. ​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్