mh ad
బుధవారం, 17 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పిఒజెకెలో ఇంటర్నెట్ నిషేధం, ఆంక్షలను ఖండించిన ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్

2 గంటల క్రితం

Amnesty International condemns
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 17, 2026, 05:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఇస్లామాబాద్ : పాక్ ఆక్రమిత జమ్ము కాశ్మీర్ `(పిఒజెకె)లో కొనసాగుతున్న ఇంటర్నెట్ నిషేధం,  ఆంక్షలను ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఖండించింది. తక్షణమే ఈప్రాంతంలో ఇంటర్నెట్ ను పునరుద్ధరించాలని, ఆంక్షలను తొలగించాలని పిలుపునిచ్చింది. జమ్ముకాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జెకెజెఎఎసి) ఇచ్చిన నిరసన పిలుపుమేరకు అధికారులు జూన్ 5న ఇంటర్నెట్ ను నిషేధించిన సంగతి తెలిసిందే. బుధవారం (జూన్ 17) తో ఇంటర్నెట్ పై నిషేధం వరుసగా 12వ రోజుకి చేరిందని తెలిపింది. సుదీర్ఘ షట్ డౌన్ సమాచార వ్యాప్తికి అడ్డంకిగా మారిందని, ఆంక్షలతో నిత్యావసర సేవలకు కూడా అంతరాయం ఏర్పడుతోందని పేర్కొంది. అంతర్జాతీయ మానవ హక్కుల చట్టం ప్రకారం.. పూర్తి స్థాయి లేదా తాత్కాలిక ఇంటర్నెట్ నిషేధం అనైతిక చర్య అని, ఇది జీవించే హక్కు, సమాచార హక్కుని దెబ్బతీస్తుందని  స్పష్టం చేసింది. తక్షణమే పాకిస్థాన్ ప్రభుత్వం ఇంటర్నెట్ , మొబైల్ సేవలను పునరుద్ధరించాలని కోరింది. ఈ ప్రాంతంలోకి ప్రవేశించే కీలకమైన మార్గాలను దిగ్భందించినట్లు వచ్చిన నివేదికలపై కూడా ఆమ్నెస్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఆంక్షలు ఆహార పదార్థాలు, మందులతో పాటు నిత్యావసరాల సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగించాయని, దీంతో స్థానికుల సంక్షేమంపై ఆందోళనలు పెరిగాయని తెలిపింది. ఇటువంటి చర్యలు జీవించే హక్కు, ఆరోగ్య సంరక్షణ, స్వేచ్ఛగా సంచరించడం, సమాచారం పొందడం వంటి ప్రాథమిక హక్కులను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని పేర్కొంది. ఈ ఆంక్షలను తక్షణమే నిలిపివేయాలని పిలుపునిచ్చింది. దీర్ఘకాలిక ఆంక్షలు ఆర్థిక ఇబ్బందులను మరింత తీవ్రతరం చేస్తాయని హెచ్చరించింది. ఇప్పటికే గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంటున్న వర్గాలను ఇవి మరింత ప్రభావితం చేస్తాయని స్థానిక కార్యకర్తలు, పౌర సంఘాలు గతంలో ఆందోళన వ్యక్తం చేశాయని గుర్తు చేసింది. ఈ ప్రాంతంలో నిరాటంకంగా ప్రవేశించేందుకు అవసరమైన చర్యలను చేపట్టాలని, స్థానికుల ప్రాథమిక హక్కుల పరిరక్షణకు హామీ ఇవ్వాలని పాకిస్థాన్ ప్రభుత్వాన్ని కోరింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్