test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఫేస్‌ యాప్‌ నిబంధనకు ఉపాధి కార్మికులు బలి

16 మే, 2026

upadi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 17, 2026, 01:49 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

టిప్పర్ దూసుకెళ్లడంతో నలుగురు మృతి

• విబి గ్రామ్‌ జిలోనూ ఇదే కీలకం • సన్నాహాల్లో భాగంగా కఠినంగా అమలు చేస్తున్న అధికారులు

ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి, కాకినాడ రూరల్
వారు రెక్కాడితే కానీ, డొక్కాడని నిరుపేదలు. బతకడానికి మరో మార్గం లేక, మండుటెండల్లోనూ ఉపాధి హామీ పనులకు వచ్చిన వారిని కేంద్ర ప్రభుత్వం నిర్బంధంగా అమలు చేస్తున్న ఫేస్‌‌యాప్‌‌ నిబంధన బలితీసుకుంది. ఫేస్‌‌యాప్‌‌లో హాజరు నమోదు చేయడానికి సిగ్నల్‌ ‌కోసం పనిప్రదేశం నుండి పక్కకు వెళ్లిన వారిపైనుండి టిప్పర్‌ ‌దూసుకెళ్లింది. దీంతో నలుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరణించిన వారు అందరూ మహిళా కార్మికులే. ప్రమాద ధాటికి మృత దేహాలు ఛిద్రమైపోయాయి. అనూహ్యంగా రెప్పపాటులో జరిగిన ఈ సంఘటనతో ఆ ప్రాంతమంతా ఉపాధి కూలీల ఆర్తనాదాలతో మార్రుమోగింది. హృదయ విదారకమైన ఈ సంఘటన కాకినాడ రూరల్‌ ‌మండలంలో జరిగింది. సిగ్నల్‌ ‌సమస్యల కారణంగా ఫేస్‌‌యాప్‌ ‌ద్వారా హాజరు నమోదు నిబంధనను ఇప్పటిదాకా పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదు. అయితే, ఉపాధిహామీ చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం విబి గ్రామ్‌ జిని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. . దీనిలో ఫేస్‌ యాప్‌ ‌నిబంధన అత్యంత కీలకం. సిగ్నల్‌ ‌వంటి సాంకేతిక అంశాలను ఏమ్రాతం పట్టించుకోకుండా దీనిని అమలు చేయాలని కేంద్రం ఆదేశిస్తోంది. జులై ఒకటవ తేది నుండి దేశ వ్యాప్తంగా అమలులోకి రానున్న విబి గ్రామ్‌ ‌జి సన్నాహక పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. దానిలో భాగంగానే ఫేస్‌ ‌యాప్‌ ‌ద్వారా హాజరు నిబంధనను రాష్ట్రంలో ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. దీంతో సిగ్నల్‌ ‌కోసం ఉపాధి కూలీలు పని ప్రాంతాల నుండి దూరంగా వెళ్ళాల్సివస్తోంది. తాజా ప్రమాదానికి కూడా అదే కారణం.

ఏం జరిగింది…?
కాకినాడ రూరల్ కొవ్వూరు బ్రిడ్జి పక్కన ఉపాధి పనుల్లో భాగంగా పంట కాలువ పూడికతీస్తున్నారు. ఈ పనులకు అదే మండలం చీడిగ గ్రామానికి చెందిన 40 మంది కార్మికులు రోజూ వస్తున్నారు. పని ప్రదేశంలో సిగ్నల్‌ ‌సరిగా లేకపోవడంతో వేయించుకోవడానికి వారిలో 20 మంది ఒక గ్రూపుగా అక్కడికి సమీపంలోని ఫ్లైఓవర్‌ పైకి వెళ్లారు. ఫేస్‌ ‌యాప్‌‌లో హాజరు వేసుకుని తిరిగివస్తున్న సమయంలో టిప్పర్‌ ‌వారిపై నుండి దూసుకెళ్లింది. దీంతో, అక్కడికక్కడే వాసంశెట్టి సత్యవతి (60), చెల్లూరి అన్నవరం (45), పాలిక కృష్ణవేణి (35), కాదా చిట్టమ్మ (45) అనే ఉపాధి కార్మికులు మరణించారు. మట్టపర్తి అరుణ కుమారి, పాలిక నాగమణి తీవ్రంగా గాయపడ్డారు. వారి ఇద్దరిని వెంటనే కాకినాడ జిజిహెచ్‌ ‌కు తరలించారు. ప్రస్తుతం వారు మృత్యువుతో పోరాడుతున్నారు. ​ప్రమాద తీవ్రతకు మృతదేహాలు ఎగిరిపడడంతో రోడ్డంతా రక్తపు మడుగుగా మారింది. సంఘటన చూసిన తోటి కార్మికులు, స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రమాద సమాచారం అందుకున్న ఇంద్రపాలెం స్టేషన్ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిజిహెచ్ కు తీసుకెళ్లారు.

కుటుంబాలను ఆదుకోవాలని ధర్నా
మృతి చెందిన, తీవ్రంగా గాయపడిన ఉపాధి కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, ఉపాధి కార్మికులకు ప్రాణసంకటంగా మారిన ఫేస్‌ యాప్‌ నిబంధనను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ కాకినాడ జిజిహెచ్‌ ‌మార్చురీ వద్ద మృతుల కుటుంబసభ్యులతో కలిసి ఎపి వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు ఆధ్వర్యాన ధర్నా జరిగింది. ధర్నా చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఒక దశలో వారిని చెల్లా చెదరు చేసి తరిమివేయడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దడాల సుబ్బారావు మాట్లాడుతూ ఉపాధి చట్టంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా చేర్చిన ఫేస్‌ ‌యాప్‌ నిబంధన వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, క్షతగాత్రులకు రూ.25 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ ‌చేశారు. మృతుల కుటుంబ సభ్యులను సమీకరించి నినాదాలు ఇస్తే పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారని, పోస్టుమార్టం అనంతరం నాలుగు మృతదేహాలను ప్రత్యేక వాహనాలలో తరలించుకుపోయారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎపి వ్యవసాయ కార్మిక సంఘం కాకినాడ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టేకుమూడి ఈశ్వరరావు, కెఎస్.శ్రీనివాస్, సిఐటియు నాయకులు సిహెచ్.అజయ్ కుమార్, టి.రాజా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్