నగర కోలాహలానికి ఆమడ దూరంలో, పచ్చని చేల మధ్య ఒంటరిగా ఉన్న ఆ చిన్న పెంకుటింట్లో నిశ్శబ్దం గడ్డకట్టుకు పోయింది. అది ప్రశాంతతను ఇవ్వడం లేదు, సరికాదా ఒక అజ్ఞాత భీతిని గొల్పుతోంది. శ్రావణి కిటికీ పక్కన చెక్క కుర్చీలో కూర్చుని, అల్లంత దూరంలో ఉన్న వేపచెట్టు ఆకులను నిర్వేదంగా చూస్తోంది. గాలికి అవి అటూ, ఇటూ ఊగుతుంటే, తన గుండె కూడా అలాగే ఎందుకో తెలియని భయంతో కొట్టుకుంటోంది. పెళ్లయ్యి ఆరు నెలలు కూడా కాలేదు. అప్పుడే కార్తీక్ తన కళ్ల ముందు నుండి వేల మైళ్ల దూరంలో ఉన్న దుబాయ్ నగరం వెళ్ళిపోయాడు. వెళ్లేటప్పుడు కార్తీక్ ఆమె రెండు చేతులు తన చేతుల్లోకి తీసుకుని, కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తూ, ‘శ్రావణీ, మన కష్టాలు శాశ్వతం కాదు. ఈ ఒక్క ఏడాది నేను అక్కడ కష్టపడితే మన సొంతింటి కల నెరవేరుతుంది. నువ్వు అడిగిన ఆ మెరిసే బంగారు గాజులు, బోల్డన్ని చాక్లెట్స్, అమ్మకు కావాల్సిన మందులు.. అన్నీ నేనే స్వయంగా పట్టుకొస్తాను. నీ కళ్లలో ఎప్పుడూ ఆనందమే చూడాలని అనుకుంటున్నాను’ అని చెప్పిన మాటలు ఆమె చెవుల్లో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. కార్తీక్ వెళ్ళిన కొత్తలో అంతా ఒక కలలా గడిచిపోయింది. ప్రతిరోజూ వీడియో కాల్స్, రాబోయే భవిష్యత్తు గురించి తీపి కబుర్లు, వచ్చేటప్పుడు ఏమేమి తేవాలి అనే సరదా చర్చలు.. కానీ ఇప్పుడు ప్రపంచ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది.
టీవీ ఆన్ చేస్తే చాలు.. హృదయ విదారకమైన దృశ్యాలు. ఆకాశం నుండి కురుస్తున్న క్షిపణుల వర్షం, బాంబుల మోతలతో మధ్యప్రాచ్యం అట్టుడుకుతోంది. ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్ పై యుద్ధం చిలికి చిలికి గాలివానలా మారింది. ఆకాశమంతా పొగచూరిన నల్లటి మేఘాలు, నేలంతా పేలుళ్ల వల్ల ఏర్పడిన భారీ గుంతలు. కార్తీక్ పనిచేసేది దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం పక్కనే ఉన్న ఒక లాజిస్టిక్స్ కంటైనర్ యార్డ్. అది ఎంతటి వ్యూహాత్మక ప్రాంతమో, అంతటి ప్రమాదకరమైన చోటని శ్రావణికి ఇప్పుడు అర్థమవుతోంది. వార్తల్లో ‘దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా ఇరాన్ క్షిపణి దాడులు’ అని ఎర్రటి అక్షరాలతో స్క్రోలింగ్ రాగానే శ్రావణి గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది.
ఆ రాత్రి గదిలో అటూ ఇటూ తిరుగుతుండగా ఫోన్ మోగింది. వణుకుతున్న చేతులతో ఫోన్ తీసింది. స్క్రీన్ మీద ‘కార్తీక్’ అని పేరు చూడగానే ఆమె ప్రాణం లేచి వచ్చినట్లయింది. ‘శ్రావణీ.. వింటున్నావా? నా గొంతు వినిపిస్తోందా?’ అవతలి నుండి కార్తీక్ గొంతు వణుకుతోంది. ఏదో ఆయాసపడుతున్నట్లు వినిపిస్తోంది. వెనక ఏదో వింతైన, భయంకరమైన 'సైరన్' శబ్దం నిరంతరాయంగా మారుమోగుతోంది. అది ఎయిర్ రైడ్ సైరన్ అని ఆమెకు అర్థం కావడానికి ఎంతో సమయం పట్టలేదు.
‘కార్తీక్! ఎలా ఉన్నావు? టీవీలో వార్తలు చూస్తుంటే నాకు భయమేస్తుంది.. అసలు అక్కడ ఏం జరుగుతోంది? ఆ భయంకరమైన శబ్దాలేంటి కార్తీక్?’ శ్రావణి గొంతులో వణుకు ఆపుకోవడం ఆమె తరం కావడం లేదు.
‘భయపడకు శ్రావణీ.. ఇక్కడ ఆకాశం రంగు మారిపోతోంది. పగలులా వెలుతురు రావడం లేదు, క్షిపణుల పేలుళ్ల వల్ల కలిగే మంటల వెలుగు కనిపిస్తోంది. అమెరికా సైనిక స్థావరాల మీద ఇరాన్ హైపర్ సోనిక్ క్షిపణులు వదులుతోంది. మా షెడ్డు పక్కనే ఉన్న ఒక భారీ కంటైనర్ మీద క్షిపణి పడి పేలిపోయింది. ఆ ధాటికి మా గదుల కిటికీలు పగిలి, ముక్కలైపోయాయి. మేమంతా ఇప్పుడు కంపెనీ కింద ఉన్న భూగర్భ బంకర్లలో ఉన్నాం. ఇక్కడ గాలి ఆడటం లేదు శ్రావణీ, శ్వాస తీసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది. కింద ఉన్నా కూడా పైన పడే బాంబుల శబ్దానికి భూమి కంపిస్తోంది’ అక్కడ పరిస్థితిని వివరించాడు కార్తీక్.
శ్రావణి ఏడుస్తూ అరిచింది, ‘వచ్చేయ్ కార్తీక్! నీ కాళ్లు పట్టుకుంటాను, ఇప్పుడే ఏదో ఒక మార్గంలో వచ్చేయ్. మాకు ఆ కష్టార్జితం వద్దు, ఆ బంగారం వద్దు.. నువ్వు ప్రాణాలతో నా కళ్ల ముందుంటే చాలు. నువ్వు లేని ఈ లోకం నాకు శూన్యం కార్తీక్!’
‘విమానాలు లేవు శ్రావణీ.. ఎయిర్‌పోర్ట్ రన్ వే అంతా క్షిపణుల దెబ్బకు ధ్వంసమైంది. చుట్టూ మంటలు ఆవరించాయి. ఫోన్ సిగ్నల్ కూడా కట్ అవుతోంది. అమ్మను జాగ్రత్తగా చూసుకో.. నేనేమైనా అయితే...’ అని ఫోన్ కట్ అయిపోయింది. ఫోన్ ఆమె చేతిలో నుంచి జారి కింద పడింది. నిశ్శబ్దమైన గది ఆమె గుండెను చీల్చినట్లుగా అనిపించింది. ఆ తర్వాత మూడు రోజులు శ్రావణికి నరకం అంటే ఏంటో తెలిసింది. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫోన్ కలవడం లేదు. శ్రావణి తిండి తిని మూడు రోజులైంది. ఆమె కళ్లు లోతుకుపోయాయి. ముఖం కళావిహీనమైంది. అత్తమ్మను చూస్తూ, కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప ఏమీ చేయలేకపోతోంది. ఆ ఇంట్లో దీపం కూడా వెలగడం లేదు. వీధిలో కుక్క మొరిగినా, దూరాన లారీ వెళ్తున్న శబ్దం వచ్చినా.. అది పేలుడు ఏమో అని శ్రావణి అదిరిపడుతోంది. ఒకరోజు సాయంత్రం అత్తమ్మ శ్రావణి దగ్గరకు వచ్చి, ఆమె తల నిమురుతూ కూర్చుంది. అత్తమ్మ కళ్లు కూడా వాచిపోయి ఉన్నాయి.
‘అమ్మా శ్రావణీ.. కొంచెం అన్నం తిను తల్లి. నువ్వు ఇలా నీరసించిపోతే ఎలా?’ అంది దీనంగా.
శ్రావణి కళ్లలో నీళ్లు తిరిగాయి, ‘అత్తమ్మా.. అక్కడ కార్తీక్ ఏ స్థితిలో ఉన్నాడో తెలీదు. అసలు తిండి తింటున్నాడో? లేదో?, నీళ్లు దొరుకుతున్నాయో? లేదో? తెలీదు. ఇలాంటి స్థితిలో నేను ఈ అన్నం ఎలా తినగలను? అసలు ఆ యుద్ధం వాళ్లకేం ఇచ్చింది అత్తమ్మా? కొన్ని దేశాల అహంకారం, స్వార్థం కోసం సామాన్యుల జీవితాలను ఎందుకు బలి తీసుకుంటున్నారు?’ అని ఆవేదనతో అడిగింది.
అత్తమ్మ నిట్టూరుస్తూ, ‘వాడు చిన్నప్పటి నుండి చాలా ధైర్యవంతుడు. ఏదో ఒక దారి వెతుక్కుని వస్తాడు. మన నమ్మకమే వాడికి రక్ష’ అని ఓదార్చడానికి ప్రయత్నించింది. కానీ ఆమె కళ్ళలో కూడా బిడ్డకు ఏమవుతుందోనన్న భయం కనిపిస్తూనే ఉంది. ఊర్లో వాళ్ళు వస్తున్నారు.. ప్రతి ఒక్కరూ ఒక్కో మాట. ‘అయ్యో.. అక్కడ బాంబులు పడ్డాయట కదా, కార్తీక్ ఉన్న ఏరియాలోనే ఎక్కువ నష్టం జరిగిందట’ అని కొందరు, ‘అక్కడ విమానాలు కూలిపోయాయట, కమ్యూనికేషన్ వ్యవస్థ అంతా పోయింది’ అని మరికొందరు మాట్లాడుతుంటే.. ఆమెకు గుండెలో శూలం దింపినట్లు అనిపించేది.
దుబాయ్‌లోని ఆ కంటైనర్ యార్డ్ కింద ఉన్న బంకర్ లో పరిస్థితి వర్ణనాతీతం. అది ఒక భూగర్భ గది, యుద్ధ కాలంలో రక్షణ కోసం నిర్మించబడింది. ఆరు అడుగుల కింద ఉన్న ఆ ఇరుకైన గదిలో కార్తీక్ తో పాటూ యాభై మంది కార్మికులున్నారు. వారు వివిధ దేశాలకు చెందినవారు. వారందరిలోనూ మరణం అనే భయం మాత్రమే అందరినీ ఏకం చేసింది. పైన క్షిపణులు పడుతుంటే బంకర్ గోడలు భూకంపం వచ్చినట్లు కంపించిపోతున్నాయి. కాంక్రీట్ సీలింగ్ నుండి చిన్న చిన్న సున్నం ముక్కలు రాలి, కార్మికుల మీద పడుతున్నాయి. ఏ క్షణాన ఆ బంకర్ కూలిపోయి, సజీవ సమాధి అవుతామో అని ప్రతి ఒక్కరూ వణికి పోతున్నారు. కార్తీక్ ఒక మూలన కూర్చుని, తన జేబులో ఉన్న శ్రావణి ఫోటోను గట్టిగా పట్టుకున్నాడు. ఆ చీకటిలో ఆ ఫోటోనే అతనికి ఏకైక ధైర్యం. బంకర్ లో కరెంటు లేదు. ఉక్కపోతతో ఊపిరి అందడం లేదు. ఎయిర్ వెంటిలేటర్లు సరిగ్గా పనిచేయడం లేదు. కేవలం ఫోన్ టార్చ్ లైట్ల వెలుగులో ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు. ఆ వెలుగులో వారి కళ్లలో కనిపిస్తున్న భీతి ప్రపంచంలోని ఏ ఆయుధానికీ లేనంత పదునుగా ఉంది.
కార్తీక్ పక్కనే ఉన్న ఓ కార్మికుడు తన భార్య, తన రెండేళ్ల కూతురి ఫోటో చూస్తూ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. ‘నేను మా పాప పుట్టినప్పుడు కూడా వెళ్లలేకపోయాను కార్తీక్!. ఇప్పుడు ఇలా చనిపోతే వాళ్లకి ఎవరు దిక్కు? ఈ కష్టార్జితం అంతా ఎవరి కోసం?’ అని అతను కన్నీళ్లు పెట్టుకున్నాడు. కార్తీక్ మనసంతా శ్రావణి మీదే ఉంది. ‘నేను వెళ్లకపోతే ఆమె ఎలా బతుకుతుంది? అమ్మకు ఎవరు ఆసరా? నేను తీసుకొస్తానన్న ఆ బంగారుగాజుల కంటే నా ప్రాణం ముఖ్యం అని ఆమెకు చెప్పలేకపోయానే’ అనే ప్రశ్నలు అతన్ని నిలువునా దహించి వేస్తున్నాయి. బంకర్ లో ఉన్న నీటి నిల్వలు అయిపోయాయి. ప్రతి శ్వాస ఒక యుద్ధంలా అనిపిస్తోంది. పైన ఎయిర్ పోర్ట్ లోని విమాన ఇంధనం ట్యాంకులకు మంటలు అంటుకోవడంతో గాలిలో నల్లటిపొగ నిండిపోయింది. ఆ వాసన బంకర్ లోపలికి కూడా వస్తోంది. బంకర్ లోపల గంటలు రోజుల్లా గడుస్తున్నాయి. బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. పైన వినిపించే ప్రతి పేలుడు శబ్దం బంకర్ గోడలను కుదిపేస్తోంది. గోడల నుండి రాలిపడుతున్న సిమెంట్ పొడి కార్తీక్ కళ్లలో పడుతున్నా, తుడుచుకునే ఓపిక కూడా అతనికి లేదు. బంకర్ లోని యాభై మంది కార్మికుల మధ్య నిశ్శబ్దం భయంకరంగా ఉంది. కేవలం ఒకరి శ్వాస చప్పుడు మరొకరికి వినిపిస్తోంది. దాహం వేసి గొంతు ఎండిపోతోంది. కార్తీక్ పక్కనే ఉన్న ఒక పాకిస్థానీ కార్మికుడు ‘మనం ఇక్కడే చనిపోతామా కార్తీక్?’ అని అమాయకంగా అడిగినప్పుడు, కార్తీక్ సమాధానం చెప్పలేకపోయాడు. ‘లేదు.. మనం వెళ్లాలి. మన కోసం ఇంట్లో ప్రాణాలు పెట్టుకుని, ఎదురుచూసే వాళ్ళున్నారు’ అని తనను తాను ధైర్యం చెప్పుకున్నాడు.
ఆ సమయంలోనే పైన ఒక భయంకర మైన పేలుడు జరిగింది. బంకర్ లో ఉన్న లైట్లు ఒక్కసారిగా వెలిగి ఆరిపోయాయి. ఏదో పెద్ద కట్టడం కూలిపోయిన శబ్దం. బంకర్ లోని వెంటిలేటర్స్ మూసుకుపోయాయి. ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. అందరూ హాహాకారాలు మొదలుపెట్టారు. కార్తీక్ వెంటనే లేచి, తన వద్ద ఉన్న ఒక ఇనుప రాడ్డుతో ఆ గాలి గొట్టాలను తెరిచే ప్రయత్నం చేశాడు. చేతులు రక్తం వోడుతున్నా వదలకుండా పోరాడాడు. చివరకు ఒక చిన్న రంధ్రం పడ, గాలి లోపలికి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ క్షణం కార్తీక్ అందరికీ ఒక ఆశాదీపంలా కనిపించాడు.
బయట ప్రపంచంలో, అంతర్జాతీయ దౌత్యవేత్తలు ఇరు దేశాలతో మాట్లాడి, ఒక ఆరు గంటల పాటు 'సీజ్ ఫైర్' (యుద్ధ విరామం) ప్రకటించేలా ఒత్తిడి తెచ్చారు. ఆ ఆరు గంటలే ఈ కార్మికులకు ప్రాణభిక్ష. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఆర్మీ ట్రక్కులతో బంకర్ల వద్దకు చేరుకున్నారు.
బంకర్ తలుపులు తెరుచుకున్నప్పుడు, కార్తీక్ కు ఆ వెలుతురు ఒక కొత్త పుట్టుకలా అనిపించింది. కానీ బయట పరిస్థితి చూసి అతను నిర్ఘాంతపోయాడు. తను పని చేసే కంటైనర్ యార్డ్ అంతా బూడిదకుప్పలా మారిపోయింది. తను దాచుకున్న బట్టల బ్యాగు, తన సర్టిఫికెట్లు, కొద్దిపాటి సొమ్ము.. అన్నీ అగ్నికి ఆహుతైపోయాయి. తన దగ్గర మిగిలింది కేవలం ఒంటి మీద ఉన్న మురికి చొక్కా, జేబులో ఉన్న శ్రావణి ఫోటో మాత్రమే.
‘ప్రాణం ఉంటే చాలు నాయనా.. పదండి!’ అని ఒక ఆర్మీ అధికారి అనడంతో, కార్తీక్ వెనక్కి చూడకుండా ఆ ట్రక్కు ఎక్కాడు. ఒమన్ సరిహద్దుల దాకా సాగిన ఆ ప్రయాణం మృత్యువుతో చేసిన పోరాటం లాంటిది. దారి పొడవునా ధ్వంసమైన ట్యాంకులు, కాలిపోయిన మృతదేహాలు చూస్తుంటే యుద్ధం ఎంతటి క్రూరమైనదో అతనికి అర్థమైంది. విమానాశ్రయం చేరుకున్నాక, భారతీయ విమానం ఎక్కినప్పుడు, మళ్లీ బతుకు మీద ఆశ కలిగింది. కార్తీక్ కళ్లలో నీళ్లు తిరిగాయి.
ఇక్కడ గ్రామంలో.. శ్రావణి గదిలో కూర్చుని ఉంది. ఆమె కళ్లు వాచిపోయి, ముఖం నీరసించి ఉంది. గడిచిన నాలుగు రోజుల్లో ఆమె ఒక మాట కూడా మాట్లాడలేదు. అత్తమ్మ తెచ్చిన పాలు కూడా ముట్టుకోలేదు. అకస్మాత్తుగా వీధిలో ఒక ఆటో ఆగిన శబ్దం వినబడింది. శ్రావణి గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. అది తన కార్తీక్ వచ్చిందేనా? లేక మరేదైనా చేదు వార్తా? వణుకుతున్న కాళ్లతో బయటకు వచ్చింది. ఆటో నుండి దిగుతున్న కార్తీక్ ను చూసి ఆమెకు నమ్మశక్యం కాలేదు. చిరిగిపోయిన చొక్కా, గడ్డం పెరిగిన ముఖం, నీరసంతో వణుకుతున్న శరీరం.. కానీ అది తన కార్తీక్! ‘కార్తీక్!’ అని అరుస్తూ పరుగున వెళ్లి, అతడిని గట్టిగా హత్తుకుంది. ఆ హత్తుకోవడంలో ఒక ప్రాణం ఇంకో ప్రాణాన్ని వెతుక్కున్నంత ఆర్తి ఉంది. లోపలికి వెళ్లాక, అత్తమ్మ కార్తీక్ హత్తుకుని తల నిమిరింది. కార్తీక్ తల దించుకుని ఏడుస్తూ కూర్చున్నాడు. ‘శ్రావణీ.. నన్ను క్షమించు. నీకు గాజులు తెస్తానన్నాను. కానీ ఖాళీ చేతులతో వచ్చాను. నేను సంపాదించిన డబ్బు అంతా పేలుడులో కాలిపోయింది. ఆ కంపెనీ కూడా పోయింది. ఇప్పుడు నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు శ్రావణీ..’ అని వెక్కి వెక్కి ఏడ్చాడు.
శ్రావణి 'కార్తీక్.. నీవు ప్రాణాలతో తిరిగి వచ్చావు. ఈ లోకంలో నీ ప్రాణం కంటే వెలకట్టలేని బంగారం ఏదీ నాకు వద్దు. నువ్వు సంపాదించిన బంగారం పోతే పోయింది కార్తీక్.. నువ్వు నా పక్కన ఉంటే చాలు’ అంది.
‘శ్రావణీ.. యుద్ధం గెలిచామని ఆ దేశాలు అనుకోవచ్చు. కానీ ఈ రోజు మన ప్రేమ గెలిచింది. యుద్ధం నిజంగా ఓడిపోయింది!’ అన్నాడు కార్తీక్ ఆవేశంగా.
కొన్ని వారాల తర్వాత యుద్ధం ముగిసింది. శాంతి ఒప్పందాలు కుదిరాయి. కార్తీక్ మళ్ళీ ఉపాధి కోసం సిద్ధమయ్యాడు. కానీ ఈసారి అతను వెళ్తుంటే శ్రావణి కళ్లలో భయం లేదు. ఎందుకంటే మరణాన్ని జయించిన ప్రేమ తనకు తోడుంది.
డా. చిట్యాల రవీందర్
7798891795









కామెంట్‌లు (0)