70 శాతం చెక్కులను వెనక్కి పంపిన వైనం
విషయం తెలుసుకొని వేలం కేంద్రాన్ని సందర్శించిన రైతు సంఘం నాయకులు
రైతులు ఇబ్బందులను పట్టించుకోని కూటమి ప్రభుత్వం : రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జజ్జర జయంత్ బాబు
ప్రజాశక్తి-మద్దిపాడు (ప్రకాశం) : కొనుగోలు వేలం కేంద్రానికి తీసుకొచ్చిన పొగాకు చెక్కులను నోబిడ్ ల వంకతో తిరిగి వెనక్కి పంపిస్తుండడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల పరిధిలోని వెల్లంపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని సోమవారం రైతులు నిలుపుదల చేశారు. ఈ సందర్భంగా చండ్రపాడు, గాడిపర్తివారిపాలెం గ్రామాలకు చెందిన దాదాపు 350కు పైగా పొగాకు చెక్కులను రైతులు వేలం కేంద్రానికి తీసుకొచ్చారు. నోబిడ్ ల వంకతో 70 శాతం చెక్కులను వెనక్కి పంపడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు కొనుగోలు కేంద్రాన్ని నిలుపుదల చేశారు. వెంటనే విషయం తెలుసుకున్న రైతు సంఘం నాయకులు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి జజ్జర జయంత్ బాబు మాట్లాడుతూ …. మార్కెట్లో పొగాకు సంక్షోభం ఉండడం, బయ్యర్ లు ఆసక్తి చూపకపోవడం, కర్నాటక మార్కెట్ ఇంకా క్లోజ్ చేయకపోవడంతో సరైన ధరలు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో వేలం కేంద్రానికి వచ్చిన పొగాకు చెక్కులు బాగాలేవన్న నెపంతో తూతూ మంత్రంగా కొనుగోలు చేసి మిగతా వాటిని వెనక్కి పంపిస్తున్నారని తెలిపారు. సరైన ధరలు లేకపోవడంతో రైతులకు బ్యారెన్ కు వచ్చి రూ.4 లక్షల వరకు నష్టం వాటిల్లే పరిస్థితి ఉందన్నారు. దీనివల్ల రైతులు అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. రైతుల సమస్యలను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆరోపించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఈనెల 18వ తేదీన పొగాకు రైతుల సమస్యల మీద ఒంగోలులోని రంగా భవనంలో సదస్సు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సదస్సుకు అధిక సంఖ్యలో పొగాకు రైతులు హాజరయ్యి భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు శ్రీకాంత్, కనపర్తి సుబ్బారావు, చెరుకూరి వాసు, రైతులు పాల్గొన్నారు.









కామెంట్లు (0)