పని ఒత్తిడిలో ఉన్నా, సాయంత్రం చల్లని గాలిలో కబుర్లు చెబుతున్నా.. మన చేతులు తెలియకుండానే వెతికేది ఆ కరకరలాడే రుచులనే!. ఆహారపు అలవాట్లలో 'స్నాక్స్' అనేది కేవలం ఆకలిని తీర్చేది మాత్రమే కాదు. అది మన దైనందిన జీవితంలో ఆహారపు అలవాటు. భోజనానికి, అల్పాహారానికి మధ్యలో వచ్చే ఆ చిన్న విరామాన్ని అద్భుతమైన రుచులతో నింపేవే ఈ చిరుతిళ్లు. మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఈ స్నాక్స్ చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది. తేలికగా జీర్ణమయ్యే అటుకులు, ప్రోటీన్లు ఉండే వేయించిన పల్లీలు, చిరునవ్వుల్లా వికసించే పుట్నాలు, నోరూరించే మూంగ్ దాల్.. వీటన్నింటికీ కాస్త కారం, ఉప్పు తగిలిస్తే వచ్చే ఆ మజాయే వేరు! సాయంత్రం టీతో పాటు ఈ స్నాక్స్ తీసుకుంటే ఆ కిక్కే వేరు. మరి వాటిని ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.
జొన్న అటుకుల స్పెషల్ మిక్చర్
కావలసినవి: జొన్న అటుకులు- 2 కప్పులు, అటుకులు - కప్పు, శనగపప్పు- అర కప్పు, సన్న కారప్పూస- కప్పు, పల్లీలు- పావు కప్పు, ఎండుమిర్చి- 3 నుంచి 4, కరివేపాకు- 2 రెబ్బలు, పసుపు- చిటికెడు, ఉప్పు, కారం- రుచికి సరిపడా, నూనె-వేయించడానికి తగినంత.
తయారీ: బాండీలో నూనె వేడి చేసి, జొన్న అటుకులను, మూమూలు అటుకులను విడివిడిగా దోరగా వేయించి ఒక పెద్ద పాత్రలోకి తీసుకోవాలి. అదే నూనెలో పల్లీలు, శనగపప్పును వేసి, మంచి రంగు వచ్చేవరకూ వేయించి, అటుకుల పాత్రలో వేయాలి. పాత్రలో కొద్దిగా నూనె ఉంచి అందులో ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు వేసి వేయించాలి.ఇప్పుడు స్టవ్ ఆపేసి, ఆ తాలింపులో రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని అటుకుల పాత్రలో వేసి అన్నీ కలిసేలా కలపాలి. చివరగా సిద్ధంగా ఉన్న సన్న కారప్పూసను ఇందులో కలిపితే, ఎంతో రుచికరమైన జొన్న అటుకుల మిక్చర్ సిద్ధం!
మసూర్ దాల్ తో...
కావాల్సినవి: మసూర్ దాల్ – కప్పు, సన్న చక్రాలు – అర కప్పు, కారం పొడి – స్పూన్, జీలకర్ర – ½ స్పూన్, అల్లం వెల్లుల్లి కారం – స్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – చిటికెడు, కరివేపాకు – రెండు రెమ్మలు, నూనె – వేయించడానికి సరిపడా.
తయారీ: మసూర్ దాల్ పప్పును బాగా కడిగి 2–3 గంటలు నానబెట్టండి. తర్వాత నీళ్లు పూర్తిగా వంపేసి గుడ్డపై కొద్దిసేపు ఆరనివ్వండి. కడాయిలో నూనె వేడి చేసి, పప్పును కొద్దికొద్దిగా వేసి క్రిస్పీగా వేయించి, ఒక గిన్నెలో తీసుకుని అందులో, సన్న చక్రాలు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, పసుపు, దంచిన వెల్లుల్లి వేసి కలపండి. చివరగా వేయించిన కరివేపాకు కలిపితే సూపర్ టేస్ట్ వస్తుంది.
మరమరాలతో...
కావాల్సినవి : మరమరాలు – 3 కప్పులు, పల్లీలు – ½ కప్పు , టమోటా – ఒకటి, ఉల్లిపాయ – 1 చిన్నది, పచ్చిమిర్చి – 2, కరివేపాకు – రెండు రెమ్మలు, జీలకర్ర – ½ టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 3, కారం పొడి – స్పూన్ , పసుపు – చిటికెడు, ఉప్పు – తగినంత, నిమ్మరసం – స్పూన్, నూనె – 2 స్పూన్లు, కొత్తిమీర – కొద్దిగా
తయారీ: ముందుగా పాన్‌లో కొద్దిగా నూనె వేసి, పల్లీలు వేయించండి. పక్కన పెట్టండి. అదే పాన్‌లో జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి వేసి వేయించండి. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి కొద్దిగా వేగనివ్వండి. ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసిన టమోటా వేయాలి. అందులో పసుపు, కారం, ఉప్పు వేసి కలపండి. తర్వాత మరమరాలు, వేయించిన పల్లీలు వేసి బాగా కలపండి. చివరగా నిమ్మరసం, కొత్తిమీర వేసి కలిపితే మరమరాల స్నాక్ రెడీ. కాస్త క్రంచీగా కావాలంటే చివర్లో కొద్దిగా బూందీ వేసుకోవచ్చు.
పల్లీలు-పచ్చి శనగలతో..
కావాల్సినవి: నానబెట్టిన పచ్చిశనగ పప్పు – కప్పు, నానబెట్టిన శనగలు – కప్పు, పల్లీలు – ½ కప్పు , జీలకర్ర – స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 5 నుంచి 6 , కారం – స్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – చిటికెడు, కరివేపాకు – రెండు రెమ్మలు, నూనె – 1½ స్పూన్లు.
తయారీ : ముందుగా పచ్చిశనగపప్పు, శనగలు రాత్రంతా నానబెట్టాలి. ఉదయం వాటిని నీరు వంపేసి కుక్కర్‌లో ఒక విజిల్ వచ్చే వరకూ ఉడికించాలి. బాండీలో కొంచెం నూనె పోసి వేడి చేయాలి. అందులో పచ్చిశనగప్పు వేయించి పెట్టుకోవాలి. అదే పాన్‌లో కరివేపాకు వేయాలి. తర్వాత ఉడికిన పచ్చిశనగలు, శనగలు వేసి కలపాలి. తర్వాత పల్లీలు వేసి రెండు నిమిషాలు వేయించాలి. జీలకర్ర–వెల్లుల్లి కారం వేసి బాగా కలపాలి. అంతే పల్లీలు- శనగల స్నాక్స్ రెడీ. ఇవి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మహిళలకు ఎంతో మంచిది.









కామెంట్‌లు (0)