మన తెలుగువారికి ఆవకాయ అంటే కేవలం పచ్చడి మాత్రమే కాదు, అదొక ఎమోషన్. మామిడికాయల సీజన్ వచ్చిందంటే చాలు.. ఇళ్లన్నీ ఆవపిండి ఘాటుతో, కమ్మని ఆవకాయ వాసనతో నిండిపోతాయి. ఎన్ని కూరలు ఉన్నా.. ఆవకాయతో సాటి రావు. అందుకే ఏడాది పాటు నిల్వ ఉండేలా రకరకాల ఊరగాయలను తయారుచేసుకుంటారు. మాగాయ, ఆవకాయ, బెల్లం, అల్లం ఆవకాయ, ముక్కల పచ్చడి, పెసర ఆవకాయ, నువ్వుల ఆవకాయ వంటి వివిధ రకాల ఆవకాయలు పెట్టడంలో తెలుగింటి మహిళలు సిద్ధహస్తులు. ఈ రోజు స్పెషల్ పెసర, నువ్వుల, అల్లం వెల్లుల్లి కలిపి ఆవకాయల తయారీ విధానం తెలుసుకుందాం..

పెసరపప్పుతో..
కావాల్సినవి: మామిడి కాయలు-3, పెసర పిండి- కప్పు, కారం- రుచికి సరిపడా, దంచిన ఉప్పు-125 గ్రాములు, ఆవ పిండి-స్పూన్, పసుపు-చిటికెడు, నువ్వుల నూనె-350 గ్రాములు.
తయారీ : పెసరపప్పుని శుభ్రం చేసుకుని, ఎండలో పెట్టి, మిక్సీలో వేసి, మెత్తని పొడి చేసుకోవాలి. ఇలా పెసరపిండిని ఒక కప్పు రెడీ చేసుకోవాలి. మామిడికాయలను ముక్కలుగా కట్ చేసి, గిన్నెలో వేసుకుని, కొంచెం నూనె, పసుపు వేసి, కలిపి పక్కన ఉంచాలి. మరోగిన్నెలో పెసర పిండి, కారం, ఉప్పు, పసుపు, ఆవ పిండి వేసి, బాగా కలపాలి. ఈ మిశ్రమంలో నూనె పట్టించిన మామిడి ముక్కలు వేసి, బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక గాజు సీసాలో వేసుకుని, ముక్క మునిగేలా నూనె పోసుకుని మూత పెట్టుకోవాలి. ఈ పెసర ఆవకాయను రెండురోజుల పాటు ఊరనివ్వాలి. తర్వాత గరిటెతో బాగా కలిపి తినడానికి వేరే గిన్నెలోకి తీసుకోవాలి. తక్కువ మోతాదులో పెట్టుకునే పెసర ఆవకాయ ఎంతో రుచిగా ఉంటుంది. ఇడ్లీ, గారెలు, దోశెలు , రోటీలు, చపాతీల్లోకి పెసర ఆవకాయ సూపర్‌గా ఉంటుంది. దీనిని తయారుచేసిన తర్వాత కేవలం రెండు రోజులలో తినొచ్చు. ఈ పచ్చడి ఫ్రిజ్‌లో పెట్టుకుంటే అంతే తాజాగా ఏడాది పాటు నిల్వ ఉంటుంది.

నువ్వులతో..
కావాల్సినవి: మామిడికాయ ముక్కలు – కిలో, ఉప్పు- 200 గ్రాములు, వెల్లుల్లి రెబ్బలు- 20, మెంతులు- 20 గ్రాములు, ఆవాలు – 150 గ్రాములు, జీలక్రర- 50 గ్రాములు, పసుపు- రెండు స్పూన్లు, అరకేజీ – నువ్వులు.
తాలింపు కోసం: జీలకర్ర – 2 స్పూన్లు, ఆవాలు – 2 టీస్పూన్లు, నూనె – 300 గ్రాములు, వెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్‌స్పూన్లు.
తయారీ: మామిడికాయ ముక్కలు తడి లేకుండా తుడిచి పెట్టుకోవాలి. స్టవ్‌పై కడాయి పెట్టి, నువ్వులు వేసి, దోరగా ఫ్రై చేసి, ఒక ప్లేట్లోకి తీసుకొని, పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో జీలకర్ర, మెంతులు వేసి వేయించుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకొని, చల్లారనివ్వాలి. చల్లారిన నువ్వులు, జీలకర్ర, మెంతులు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పొడిని గిన్నెలోకి తీసుకొని, పక్కన పెట్టుకోవాలి. ఆవాలు విడిగా మిక్సీలో వేసి, మెత్తగా పొడి చేసుకోవాలి. మామిడికాయ ముక్కల్లో గ్రైండ్ చేసిన ఆవాల పొడి, నువ్వుల-జీలకర్ర పొడి, ఉప్పు, పసుపు, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా కలుపుకోవాలి. స్టవ్‌పై కడాయి పెట్టి, ఆయిల్ వేసి, వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, ఆవాలు వేసి వేయించాలి. తర్వాత కడాయి తీసి, పక్కన పెట్టుకోండి. ఆయిల్ కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇది చల్లారాక ముందుగా తయారుచేసుకున్న మామిడికాయ ముక్కల మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన నువ్వుల ఆవకాయ రెడీ!. ఈ నువ్వుల ఆవకాయ వేడివేడి అన్నంలో చాలా రుచిగా ఉంటుంది.

అల్లం వెల్లుల్లి పేస్ట్‌తో..
కావాల్సినవి: మామిడికాయ ముక్కలు – కేజీ, అల్లంముక్కలు- కప్పు, వెల్లుల్లి రెబ్బలు-కప్పు, కారం- 1/2 కప్పు, ఉప్పు: రుచికి సరిపడా, మెంతి పొడి- స్పూన్, ఆవపిండి-2 స్పూన్లు, పసుపు- 1/2 స్పూన్, నూనె- కప్పు (వేరుశనగ నూనె / నువ్వుల నూనె), పోపు దినుసులు: ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు.
తయారీ : అల్లం ముక్కలను, వెల్లుల్లి రెబ్బలను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొన్ని వెల్లుల్లి రెబ్బలను కూడా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఒక వెడల్పాటి గిన్నెలో మామిడికాయ ముక్కలు, కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, కారం, పసుపు, మెంతి పొడి, ఆవపిండి వేసి బాగా కలపాలి. తాలింపు కోసం బాండీలో నూనె వేడి చేసి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ, కరివేపాకు వేసి పోపు పెట్టాలి. దీనిలో అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి స్టవ్ ఆపేయాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత, ముందుగా కలిపి పెట్టుకున్న మామిడికాయల ముక్కల మిశ్రమంలో పోయాలి. ఈ పచ్చడి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. దీన్ని ఒక జాడీలోకి తీసుకోవాలి. ఈ పచ్చడి ఏడాది వరకూ తాజాగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని, కొద్దిగా నెయ్యి జోడించి తింటే.. అద్భుతంగా ఉంటుంది.









కామెంట్‌లు (0)