మదర్స్ డే సందర్భంగా అమ్మకు కానుకలూ, కార్డులూ ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి. భావోద్వేగాలను వ్యక్తం చేయాలనిపిస్తే చేయండి. కానీ అక్కడితో ఆగిపోవద్దు. ఆమె చేసే అదృశ్య సంరక్షణ శ్రమ విలువను, లోతును గుర్తించకపోతే మన దృష్టిలో ఏదో లోపం ఉన్నట్టే. మనలో మనిషితనం తాలూకు పార్శ్వం ఏదో లోపించినట్టే. గుర్తింపు ఒక్కటే చాలదు.. భారం పంచుకోవాలి. అమ్మ తన ఆశలూ, ఆకాంక్షలూ సాకారం చేసుకునేందుకు మద్దతు ఇవ్వాలి. ఆ దిశగా మన ఆలోచనలను చక్కదిద్దుకోవాలి. మే నెల రెండో ఆదివారం మదర్స్‌డే సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.
అనురాధ యంత్రంలా పని చేసింది. ఇంటికోసం తన ప్రతి రక్తపు బొట్టూ వెచ్చించింది. పిల్లలను అమెరికాలో సెటిల్ చేసింది. మంచి అమ్మ అనిపించుకుంది. అందరూ మెచ్చుకుంటుంటే సంతోషించింది. ఆమె సూపర్ మామ్. ఆమెకు వచ్చిన జబ్బు పేరు సూపర్ మామ్ సిండ్రోమ్. అమ్మతనం, ఆదర్శ గృహిణీత్వం కోసం ఆరాటపడితే వచ్చిన ఆ జబ్బు అనురాధను మింగేసింది. సుశీల అనే అమ్మాయి ఆ జబ్బు లక్షణాలు వినగానే ఇంటికి పరిగెత్తింది. ఆమెకు ‘వాళ్లమ్మను కౌగలించుకుని బోరున ఏడవాలనిపించింది. ఆవిణ్ణి రక్షించుకోవాలనిపించింది.’
పై కథ పేరు సూపర్ మామ్ సిండ్రోమ్. యూట్యూబ్‌లో వినొచ్చు. గూగుల్‌లో వెదికి పట్టుకుని చదవొచ్చు. మూడు దశకాల కిందట పి. సత్యవతి రాసిన ఈ కథ ఎంతోమంది అమ్మలను మన కళ్ల ముందుంచుతుంది. అమ్మపై అంతులేని భారం మోపే ‘సూపర్ మామ్’ భావన సమాజంలో గాఢంగా స్థిరపడిపోయింది. అమ్మ కీర్తనలకు సోషల్ మీడియాలో అంతే లేదు.

మదర్ హుడ్ పెనాల్టీ
బిడ్డ పుట్టిన తర్వాత స్త్రీ జీవితంలో ఒక్కసారిగా మార్పు వస్తుంది. సంరక్షణ బాధ్యతలన్నీ ప్రధానంగా ఆమెపైనే పడతాయి. ప్రసూతి సెలవులు లేని వారు ఉద్యోగాలు మానేస్తారు. మరికొందరు పని గంటలు తగ్గించుకుంటారు. ఫలితంగా జీతం తగ్గుతుంది. ఉద్యోగ జీవితంలో మందగమనం మొదలవుతుంది. ఇంటి పనులు, ఇతరులను చూసుకోవడం, తగినంత విశ్రాంతి లేకపోవడం, గుర్తింపు లేకపోవడం వల్ల అనేకమంది వాటి తాలూకు దిగులుతో నీరసించిపోతారు. అదే సమయంలో సూపర్ మామ్ కావాలనే కోరిక, ఉద్యోగ జీవితంలో తమను తాము నిరూపించుకోవాలనే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయి. ఈ రెండింటినీ సమన్వయం చేసుకోలేక అవస్థలు పడతారు. ఫలితంగా అనేక రకాల ఒత్తిళ్లు, సవాళ్లు, అనారోగ్యాలు. సామాజిక శాస్త్రవేత్తలు దీన్ని మదర్‌హుడ్ పెనాల్టీగా వ్యవహరిస్తారు.
బ్రెజిల్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ దేశాలకు చెందిన నిపుణులు పలు అంతర్జాతీయ అధ్యయనాలను సమీక్షించిన తర్వాత మాతృత్వం కారణంగా మహిళలు ఎదుర్కొనే కష్టనష్టాలపై వెలిబుచ్చిన భావన కూడా ఇదే. పిల్లలు లేని వాళ్లను, పని చేసేందుకు సదా సిద్ధపడే స్త్రీలను ఆదర్శంగా చూపించే పని ప్రదేశాల్లో తల్లులకు అవమానకరమైన అనుభవాలు ఎదురవుతున్నాయి. అవకాశాలు తగ్గుతున్నాయి. ఆఫీసు తర్వాత జరిగే మీటింగులకూ పిలవడం లేదు. మాతృత్వాన్ని ఒక రకమైన కెరీర్ ఆత్మహత్యగా భావిస్తున్నారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (ఎల్ఎస్ఈ) ‘ది ఇన్‌క్లూజన్ ఇనిషియేటివ్’ పరిశోధకులు క్యాపిటల్ మార్కెట్లోని అమ్మలపై జరిపిన అధ్యయనంలో ఇలాంటి అనుభవాలే వినిపించాయి. గత సంవత్సరం మాతృ దినోత్సవం సందర్భంగా రాసిన ఒక వ్యాసంలో థ్యూనిస్సెస్ అనే ఎకనమిస్ట్ ఈ విషయాలను వివరించారు. పరిశోధనాధికారిగా సమ్మిళిత విధానాల ద్వారా తల్లులకు మద్దతు ఇవ్వడం గురించి ఆమె కొన్ని సూచనలు చేశారు. ‘మంచి తల్లి’ భావనను విస్తరించాలి. వర్గం, జాతి, లైంగికతతో నిమిత్తం లేకుండా అమ్మలందర్నీ సమానంగా గౌరవించాలి. పిల్లల పెంపకం అమ్మలది మాత్రమే కాదు. నాన్నలు, కుటుంబసభ్యులు, కార్యాలయాలు కలిసి బాధ్యత పంచుకోవాలి అన్నారామె. ఐక్యరాజ్యసమితి (ఐరాస) వంటి సంస్థల నుంచి మహిళా ఉద్యమాలు, కార్మిక సంఘాల వరకూ ఇలాంటి సూచనలు వినిపిస్తున్నాయి. కానీ వాతావరణంలో అంతగా మార్పు కానరావడం లేదు.
అమ్మ.. ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక
‘అవసరం ఉన్నవారికి మనం అందించే సంరక్షణ- అది కుటుంబాల్లోనైనా, సమాజాల్లోనైనా, దేశాల్లోనైనా – మనల్ని మనుషులుగా నిలబెడుతుంది. కానీ ఆ పనికి మనం తగిన విలువ ఇవ్వడం లేదు. మనం నివసించే ప్రపంచాన్ని అర్థం చేసుకునే విధానంలోనూ, మన వ్యవహారాలను నిర్వహించే తీరులోనూ ఉన్న లోతైన లోపాన్ని ఇది బయటపెడుతోంది’ అని వ్యాఖ్యానిస్తారు ఐరాస మహిళా విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిమా బహౌస్.
సంరక్షణ (కేర్ వర్క్) ప్రాధాన్యాన్ని పై వ్యాఖ్య స్పష్టపరుస్తోంది. అమ్మను గౌరవించడమంటే- ఆమెను గుర్తించడం. ఆమె చేసే రకరకాల సంరక్షణ పనులు ఎంత విలువైనవో అర్థం చేసుకోవడం. ‘సంరక్షణ’ లోతును గ్రహించడం. అమ్మ తన శ్రమతో పిల్లల జీవితానికి పునాదులు వేస్తుంది. కుటుంబ సభ్యులకు వండి పెట్టడం సహా అనేక పనులు చేస్తుంది. బాధల్లో, దుఃఖాల్లో పాలుపంచుకుని ఓదార్చుతుంది. తన జ్ఞానం, అనుభవాలను పంచుకుంటూ పిల్లల ఆలోచనల్లో స్పష్టతకు కూడా సాయపడుతుంది. రోగులు, వృద్ధులు, ప్రత్యేక అవసరాలు ఉన్నవారిని చూసుకుంటుంది. మన కుటుంబాల్లో ఇవన్నీ సహజ బాధ్యతలుగా, ప్రేమతో చేసే సేవలుగా కనిపిస్తాయి. కానీ వీటి వల్లే కుటుంబ సభ్యులు బయటకి వెళ్లి పని చేయగలుగుతారు. సంపాదించగలుగుతారు. సంరక్షణ పని-ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. మహిళల వేతనం లేని సంరక్షణ పనికి ద్రవ్య విలువ కడితే, కొన్ని దేశాల్లో అది జీడీపీలో 40 శాతానికి మించి ఉంటుందని ఐరాస పేర్కొంటోంది. ఇది తయారీ లేదా రవాణా వంటి మొత్తం రంగాల వాటాను కూడా మించవచ్చు.
ఐరాస అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా (సగటున) మహిళలు రోజుకు సుమారు నాలుగు గంటలకు పైగా సంరక్షణ పనిలో గడుపుతున్నారు. ఇదే పనికి పురుషులు కేటాయించే సమయం సుమారు రెండు గంటల కంటే తక్కువే. ఇంటిపని భారం వల్ల మహిళలకు చదువు కోవడానికి, మంచి ఉద్యోగాల్లో చేరడానికి, విశ్రాంతి తీసుకోవడానికి, సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనడానికి తగినంత సమయం దొరకడం లేదు. పని వయసున్న మహిళల్లో దాదాపు 45 శాతం మంది కుటుంబ సంరక్షణ బాధ్యతల కారణంగా కార్మిక మార్కెట్లోకి రావడం లేదు. పురుషుల్లో మాత్రం ఇది చాలా స్వల్ప స్థాయిలోనే (సుమారు 5 శాతం) ఉంది.
కేర్ వర్క్ అనేది మహిళలకు మాత్రమే పరిమితమైనది కాదు. పురుషులు సహా అందరూ బాధ్యతలను పంచుకోవాల్సిన అవసరం ఉందని 2023 ప్రపంచ తండ్రుల స్థితిగతుల నివేదిక సూచిస్తోంది. కొన్ని దేశాల్లో పురుషులు కేర్ వర్క్‌ను తమ బాధ్యతగా గుర్తించే ధోరణులు కనిపిస్తున్నాయని తెలిపింది.

ఇంటిపని విలువైనదే…
సంరక్షణ పనులు అనేకం. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) ప్రకారం వంట చేయడం పరోక్ష సంరక్షణ పని. పిల్లల కోసం, వయసు పైబడిన వాళ్లు లేదా వ్యాధుల బారినపడిన భాగస్వాముల కోసం పోషకాహారం తయారు చేయడం ప్రత్యక్ష సంరక్షణ కిందికి వస్తుంది. మన జీవితాలకు, కుటుంబాలకు, ఎకానమీకి పునాదులు వేసే ఈ పనులను గుర్తించకపోవడమే కాదు, ఇవి చేయకపోతే విడాకులు ఇవ్వడానికీ సిద్ధమవుతున్నారు కొందరు పురుషులు. అలాంటి వివాదమే ఒకటి ఇటీవల సుప్రీంకోర్టు ముందుకొచ్చింది. వంటపని, ఇంటిపని వంటి బాధ్యతలను ఒకరిపై మాత్రమే మోపడం సరికాదని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. భర్త చెప్పినట్టుగా వంట చేయకపోవడం క్రూరత్వంగా పరిగణించలేమని తేల్చారు.
సంరక్షణ పనిలోని విభిన్న కోణాలను గుర్తిస్తూ 2006లో బ్రిటన్ అత్యున్నత న్యాయస్థానం హౌస్ ఆఫ్ లార్డ్స్ రెండు కీలక తీర్పులు ఇచ్చింది. గృహిణి శ్రమకు, ఉద్యోగం చేసే భర్త శ్రమకు విలువ పరంగా తేడా లేదని స్పష్టం చేసింది. ఈ కేసులో పెళ్లికి ముందు మెలిస్సా నెల జీతం రూ.70 లక్షలు. పెళ్లి తర్వాత ఉద్యోగం మానేసింది. భర్త అలన్ ఆమెతో ఉన్న మూడేళ్లలోనే తన ఆస్తిలో సగభాగం సంపాదించాడు. కోర్టు ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని తీర్పు చెప్పింది.
ఇంకో కేసులో, రెండో బిడ్డ తర్వాత అధిక ఆదాయం వచ్చే న్యాయవాద వృత్తిని జూలియా వదిలిపెట్టాల్సి వచ్చింది. ఆమెకు భృతి నిర్ణయిస్తూ, కుటుంబం కోసం తన కెరీర్‌ను త్యాగం చేయడమే కాక భర్తకు వృత్తిపరంగా అండగా నిలిచిందని ధర్మాసనం పేర్కొంది. ఈ విధమైన భావోద్వేగ, కుటుంబ మద్దతు కూడా సంరక్షణ పనిలో భాగమే.
మాతృత్వం సామాజికాంశం
మాతృత్వం ఒక జీవశాస్త్ర ప్రక్రియ మాత్రమే కాదు. అది మహిళల ఆరోగ్యం, గౌరవం, హక్కులతో ముడిపడి ఉన్న సామాజికాంశం కూడా. ప్రతి మహిళకు సురక్షితమైన, గౌరవప్రదమైన ప్రసవం హక్కు ఉంది. కానీ ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రెండు నిమిషాలకూ ఒక మహిళ గర్భధారణ లేదా ప్రసవ సంబంధిత కారణాలతో ప్రాణాలు కోల్పోతున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్వో) చెబుతోంది. ఈ మరణాల్లో చాలావరకూ నివారించగలిగినవే అయినప్పటికీ, అసమాన ఆరోగ్య వ్యవస్థలు, పేదరికం, తగిన వైద్య సేవల లోపం కారణంగా ఈ పరిస్థితి కొనసాగుతూనే ఉంది.
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో గర్భధారణ (15.6 శాతం), ప్రసవానంతర (19.8 శాతం) దశల్లో మానసిక అనారోగ్యం బారినపడుతున్న మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ సమస్యలను పట్టించుకోకపోతే ఆత్మహత్యలకు దారి తీయవచ్చునని, మానసికంగా ఇబ్బంది పడుతున్న తల్లులు పిల్లల వికాసంపై కూడా ప్రతికూల ప్రభావం చూపవచ్చని డబ్ల్యుహెచ్వో హెచ్చరిస్తోంది. మాతృ మరణాల విషయంలో మానసిక అంశాలు కూడా కీలకంగా మారుతున్నాయని, ప్రసవానంతర డిప్రెషన్ (పీపీడీ) పై చర్చ అత్యవసరమని తమిళనాడులో జాతీయ ఆరోగ్య మిషన్‌కు చెందిన మాజీ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం, కేవలం రెండు నెలల్లోనే గర్భిణీ దశలో ఉన్న ఏడుగురు మహిళలు ఆత్మహత్య ఘటనలు నమోదయ్యాయి. పీపీడీ ప్రభావాన్ని తెలియచేసే సంబంధిత వివరాలతో ‘హిందూ’ 2024లో ఒక వార్త ప్రచురించింది.

మాతృ దినోత్సవ మూలాలు
‘ప్రపంచానికి తల్లిగా వ్యవహరిద్దాం.. మరో తల్లి గుండె పగలకుండా మన గొంతులు కలుపుదాం..’ ఇది అమెరికన్ మహిళ జూలియా వార్డ్ హౌ చేసిన యుద్ధ వ్యతిరేక ప్రకటన. దానికి అర్థం కొడుకుల చేతిలో ఖడ్గాలకు బదులు కరుణ ఉండాలని ఆమె పిలుపునిచ్చింది. అమెరికా అంతర్యుద్ధ విధ్వంసాన్ని దగ్గరగా చూసిన ఆమె, 1872లో శాంతి కోసం మాతృదినోత్సవాన్ని ప్రతిపాదించింది. ప్రతి సంవత్సరం జూన్‌లో ఈ కార్యక్రమం జరుపుకోవాలని కోరింది. జూలియా వార్డ్ హౌ ఒక సహానుభూతి గల తల్లి మాత్రమే కాదు.. ‘తల్లి భావన’ను వ్యక్తిగత పరిధి నుంచి సమాజ స్థాయికి విస్తరించిన శాంతి ఉద్యమకారిణి. అంతర్జాతీయ సమస్యలకు శాంతియుత పరిష్కారం కోసం అన్ని దేశాల తల్లులు ఏకం కావాలని ఆమె దాదాపు 150 ఏళ్ల క్రితమే పిలుపునిచ్చింది. శాంతి మార్గాలపై చర్చించేందుకు మహిళలు సమావేశమయ్యే రోజును ఆమె ఊహించింది. ఈ ఆలోచనల ప్రతిధ్వని ఇప్పటికీ వినిపిస్తోంది. అమెరికాకు చెందిన కోడ్ పింక్ సంస్థ శాంతి కోసం రకరకాల కార్యకలాపాలు చేపడుతోంది. 2026 మాతృ దినోత్సవ సందర్భంగా ‘ఆయుధాలను విడిచేయండి’ అనే నినాదంతో ప్రచారపత్రం విడుదల చేసింది. యుద్ధ వ్యతిరేక ఉద్యమంలో కుటుంబాలన్నింటినీ కలుపుకుని పోయే దిశగా కార్యకలాపాలు చేపడుతోంది. యుద్ధ బాధిత తల్లులకు మద్దతుగా నిలబడుతోంది. పాలస్తీనా, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ మహిళలను కూడా ఈ వేదిక మీదికి తీసుకురాగలిగింది కోడ్ పింక్.
మాసాచుసెట్స్‌లోని బోస్టన్ కేంద్రంగా పనిచేస్తున్న లూయిస్ డి. బ్రౌన్ అనే సంస్థ విద్యార్థుల కోసం శాంతి పాఠ్య ప్రణాళికను అభివృద్ధి చేసింది. మదర్స్ డే రోజున పీస్ వాక్ నిర్వహించబోతున్నది. ఇజ్రాయెల్–పాలస్తీనా ప్రాంతంలో మదర్స్ కాల్ వంటి వేదికలు తల్లుల గొంతును ఒకచోట చేర్చే ప్రయత్నం చేస్తున్నాయి. కుర్దిష్ ప్రాంతంలోని పీస్ మదర్స్ వంటి ఉద్యమాలు కూడా శాంతి కోసం పోరాటం కొనసాగిస్తున్నాయి. కొన్నిచోట్ల భద్రతాపరమైన కారణాలను చూపి, ప్రత్యక్ష కార్యక్రమాలను అడ్డుకుంటున్నప్పటికీ శాంతి ఉద్యమాలు ముందుకు సాగుతున్నాయి. నగరాలవారీగా ప్రతీకాత్మక పాదయాత్రలు, ఆన్లైన్ సాలిడారిటీ కార్యక్రమాలు, స్థానిక స్థాయి సమావేశాల రూపంలో తల్లులు శాంతి సందేశాన్ని ముందుకు తీసుకెళుతున్నారు. ‘మా పిల్లలు మరొక తల్లి పిల్లలను చంపే ప్రపంచం మాకు వద్దు..’ అనే భావన—దేశాల సరిహద్దులను దాటి, తల్లులను ఒకే వేదికపైకి తీసుకొస్తోంది.

తల్లి ఆశయం.. కూతురి పోరాటం…
మదర్స్ డే వెనుక ఒక తల్లి–కూతురు కథ ఉంది. తల్లి పేరు ఆన్ రీవ్స్ జార్విస్. ఒక సామాజిక కార్యకర్త. ప్రజారోగ్యం, శుభ్రత, శిశు మరణాల నివారణ కోసం మదర్స్ డే వర్క్ క్లబ్‌లు ఏర్పాటుచేసింది. అమెరికన్ అంతర్యుద్ధం సమయంలో శాంతి, సయోధ్య కోసం పని చేసింది. తల్లులు సమాజానికి చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఒక ప్రత్యేక దినం ఉండాలనేది ఆమె ఆలోచన. ఆ తల్లి ఆశయానికి కార్యరూపం ఇచ్చింది కూతురు అన్నా జార్విస్. 1908లో తొలి మదర్స్ డే నిర్వహించింది. 1914లో దీన్ని అమెరికాలో జాతీయ సెలవు దినంగా గుర్తింపు పొందేలా చేసింది. అయితే, మదర్స్ డే- కానుకలూ, కార్డులూ, వ్యాపార ప్రచారాలకే పరిమితమవుతున్న తీరును ఆమె తీవ్రంగా వ్యతిరేకించింది. అమెరికాలో మదర్స్ డేని చట్టబద్ధంగా రద్దు చేయాలని కూడా తన చివరి రోజుల్లో తీవ్రంగా ప్రచారం చేసింది. ఈ దినం నుంచి లాభం పొందాలని ప్రయత్నించిన వారిపై దావాలు వేసింది. స్వచ్ఛంద కార్యక్రమాలతో ముడిపెట్టే ప్రయత్నాల్ని వ్యతిరేకించింది. ఈ పోరాటాల వల్ల ఆమె దాదాపు నిరుపేదగా మారి, చివరి సంవత్సరాలు ఒక సోదరితో కలిసి గడిపిందని చెబుతారు. ‘ముద్రించిన కార్డు కాదు, మనస్ఫూర్తిగా రాసిన ఉత్తరమే తల్లికి నిజమైన గౌరవం’ అన్న అన్నా జార్విస్ మాటలు ప్రసిద్ధి చెందాయి.
మదర్స్.. ఈ కామర్స్
ప్రపంచ శాంతి ఆశయాల్లోంచి ఆవిర్భవించిన మదర్స్ డే-కాలక్రమంలో తన అసలు స్ఫూర్తిని కోల్పోయింది. వాణిజ్య వేడుకగా మారిపోయింది. మన దేశంలోనైనా, మరెక్కడైనా ఇది కానుకలు ఇవ్వాల్సిన రోజుగానే మిగిలిపోయింది. భావోద్వేగం, వినియోగతత్వం కలగలిపి వ్యాపారం చేసే ధోరణి కనిపిస్తోంది. మార్కెట్ విశ్లేషణల ప్రకారం, మదర్స్ డే బిలియన్ల డాలర్ల ఈ-కామర్స్ ఈవెంట్. ఈ సందర్భంగా ఆభరణాలు, కానుకలు, ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోళ్లు భారీగా పెరుగుతున్నాయి. అమెరికా మార్కెట్ పరిశోధనా సంస్థల వార్షిక సర్వే ప్రకారం, ఈ సంవత్సరం మదర్స్ డే సందర్భంగా వినియోగదారుల ఖర్చు రికార్డు స్థాయిలో 38 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.
తల్లి మానసిక ఆరోగ్యం వ్యక్తిగతమా? సామాజికమా?
ప్రసవానికి ముందు, తర్వాత తల్లి మానసిక ఆరోగ్యం దెబ్బతినడంపై కొంత చర్చ జరుగుతోంది. కానీ ఎందుకలా దెబ్బతింటోంది? బిడ్డను కనడంపై కుటుంబం పెట్టిన ఒత్తిడిని తలొగ్గాల్సి వచ్చినందుకా? ఆ కారణంగా తన ఆశలను చిదిమేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినందుకా? తన జీవితానికి ఒక గుర్తింపు ఇచ్చే చిన్న చిన్న అవకాశాలను సైతం వదులుకోవాల్సి వచ్చినందుకా? ఆలోచించారా ఎప్పుడైనా ఈ కోణంలో?
తల్లి మానసిక ఆరోగ్యాన్ని అత్యధికులు వ్యక్తిగత అంశంగానే చూస్తుంటారు. వాస్తవానికది కుటుంబం, సమాజం, ఆర్థిక పరిస్థితులు, ప్రభుత్వ వ్యవస్థ.. వీటన్నిటి ఒత్తిళ్ల ఫలితం. గర్భధారణ సమయంలో అవసరమైన సేవలు అందకపోవడం వల్ల స్త్రీల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. ఇది ఆర్టికల్ 21 కింద జీవనహక్కు ఉల్లంఘన అవుతుంది. ఈ దశలో తల్లి మనసును పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. మానసిక ఆరోగ్యం కూడా జీవనహక్కులో భాగమే. ఇవన్నీ మన న్యాయవ్యవస్థే చెప్పింది. సమాజం కోసం, కుటుంబం కోసం కష్టపడే అమ్మ జీవిత ప్రయాణంలో మనమంతా భాగస్వాములమవుదాం. అమ్మను, ఆమె ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.

– ఉదయలక్ష్మి వడ్లమూడి, ఇండిపెండెంట్ జర్నలిస్ట్









కామెంట్లు (0)