test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print EditionSingapore Open: ఛాంపియన్స్‌ ‘సాచి’

31 మే, 2026

Satwik and Chirag
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 31, 2026, 10:47 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

  • సింగపూర్‌ ఓపెన్‌ టైటిల్‌ సాత్విక్‌, చిరాగ్‌ వశం

  • ఫైనల్లో వరల్డ్‌ నెంబర్‌ 3 ఇండోనేషియా జోడీపై గెలుపు

  • రెండేళ్ల తర్వాత తొలి టైటిల్‌ నెగ్గిన భారత స్టార్స్‌

సింగపూర్‌ : భారత బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ స్టార్స్‌, వరల్డ్‌ నెంబర్‌ 4 సాత్విక్‌ సాయిరాజ్‌ రాంకిరెడ్డి, చిరాగ్‌ శెట్టి జోడీ సింగపూర్‌ ఓపెన్‌లో చరిత్ర సృష్టించింది. రెండేళ్ల పతక దాహానికి తెరదించిన సాత్విక్‌, చిరాగ్‌ సింగపూర్‌ ఓపెన్‌ సూపర్‌ 750 టోర్నమెంట్‌ విజేతగా, భారత తొలి డబుల్స్‌ జోడీగా నిలిచారు. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్‌ ఫైనల్లో వరల్డ్‌ నెంబర్‌ 3 ఇండోనేషియా షట్లర్లు ఫజర్‌ అల్ఫియన్‌, మహ్మద్‌ షోయబుల్‌ ఫిక్రిపై 18-21, 21-17, 21-16తో మూడు గేముల ఉత్కంఠ పోరులో సాత్విక్‌, చిరాగ్‌ పైచేయి సాధించారు. ఇండోనేషియా షట్లర్లతో ముఖాముఖి రికార్డు 1-2తో టైటిల్‌ పోరును షురూ చేసిన సాత్విక్‌, చిరాగ్‌ టైటిల్‌ కోసం ఒక గంట 13 నిమిషాల పాటు అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఉత్కంఠగా సాగిన తొలి గేమ్‌ను 18-21తో చేజార్చుకున్న సాత్విక్‌, చిరాగ్‌ ఆ తర్వాత వరుస గేముల్లో అదరగొట్టారు. లాంగ్‌ ర్యాలీలపై ఎక్కువ దృష్టి నిలిపిన సాత్విక్‌, చిరాగ్‌ ఇండోనేషియన్‌ జోడీపై పైచేయి సాధించారు. రెండో గేమ్‌లో 8-8తో సమవుజ్జీలుగా నిలిచిన తర్వాత వరుసగా మూడు పాయింట్లు సాధించిన సాత్విక్‌, చిరాగ్‌ 11-8తో విరామ సమయానికి ముందంజ వేశారు. ద్వితీయార్థంలో మరో మూడు పాయింట్లు సాధించి 14-8తో భారత జోడీ తిరుగులేని ఆధిక్యం దిశగా సాగింది. అదే జోరు కొనసాగిస్తూ 21-17తో రెండో గేమ్‌ను సొంతం చేసుకున్నారు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో 8-5, 11-5తో విరామ సమయానికి ముందంజ వేసిన సాత్విక్‌, చిరాగ్‌ స్వేచ్ఛగా స్మాష్‌లు ఆడారు. సెకండ్‌ హాఫ్‌లో ఇండోనేషియా షట్లర్లు పుంజుకునే ప్రయత్నం చేసినా.. ఏ దశలోనూ స్కోరు సమం చేయలేకపోయారు. 21-16తో మూడో గేమ్‌ను ఖాతాలో వేసుకున్న సాత్విక్‌, చిరాగ్‌.. సింగపూర్‌ ఓపెన్‌ సూపర్‌ 750 టైటిల్‌ను ముద్దాడారు. చివరగా 2024 థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో ఛాంపియన్స్‌గా నిలిచిన సాత్విక్‌, చిరాగ్‌ ఆ తర్వాత నాలుగు టోర్నమెంట్లలో ఫైనల్‌కు చేరినా రన్నరప్‌తోనే సరిపెట్టుకున్నారు. ఇటీవల గాయం నుంచి కోలుకుని థామస్‌ కప్‌ బరిలో నిలిచిన సాత్విక్‌, చిరాగ్‌ భారత జట్టు కాంస్య పతకం సాధించటంలో కీలక పాత్ర పోషించారు. థామస్‌ కప్‌ ఉత్సాహంతో థాయ్‌లాండ్‌ ఓపెన్‌ ఫైనల్‌కు చేరిన సాత్విక్‌, చిరాగ్‌ అక్కడ టైటిల్‌కు అడుగు దూరంలో ఆగిపోయినా.. సింగపూర్‌ ఓపెన్‌లో సూపర్‌ షోతో ఛాంపియన్స్‌గా నిలిచారు.

ఆల్‌ చైనీస్‌ మహిళల డబుల్స్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ లియు, టాన్‌పై 22-20, 21-19తో నాల్గో సీడ్‌ జియా, జాంగ్‌ గెలుపొందారు. మహిళల సింగిల్స్‌ ఫైనల్లో దక్షిణ కొరియా షట్లర్‌, వరల్డ్‌ నెంబర్‌ 1 ఆన్‌ సె యంగ్‌ 21-11, 17-21, 21-19తో అకానె యమగూచి (జపాన్‌)పై గెలుపొంది టైటిల్‌ సొంతం చేసుకుంది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫైనల్లో ఐదో సీడ్‌ డెన్మార్క్‌ జోడీ 17-21, 21-12, 21-12తో జపాన్‌ జంటపై గెలుపొంది టైటిల్ దక్కించుకున్నారు.

సాత్విక్, చిరాగ్ జోడీ విజయం కఠోర శ్రమకు నిదర్శనం : సిఎం చంద్రబాబు

కెఎఫ్‌ఎఫ్ సింగపూర్ బ్యాడ్మింటన్ ఓపెన్ – 2026 పురుషుల డబుల్స్ ఛాంపియన్‌షిప్‌లో చారిత్రాత్మక విజయం సాధించిన భారత స్టార్ జోడీ సాత్విక్‌ సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి‌కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. వీరి అద్భుత విజయాన్ని, ప్రదర్శనను ప్రశంసించారు. కఠోర శ్రమ, అంకితభావం, పట్టుదల అత్యుత్తమ ప్రతిభకు ఈ విజయం నిదర్శనమని సామాజిక మాధ్యమం ఎక్స్‌ ‌వేదికగా పేర్కొన్నారు. ప్రపంచ వేదికపై దేశానికి గర్వకారణంగా నిలుస్తూ, దేశవ్యాప్తంగా లక్షలాది యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని కొనియాడారు. ముఖ్యంగా రాష్ట్రానికి చెందిన స్టార్ షట్లర్ సాత్విక్‌ సాయిరాజ్ రాంకిరెడ్డి మరోసారి రాష్ట్రానికి గొప్ప పేరు తీసుకొచ్చారన్నారు. ఈ అసాధారణ విజయంతో రాష్ట్ర కీర్తిని అంతర్జాతీయ స్థాయిలో మరింత పెంచారని పేర్కొన్నారు. అలాగే మంత్రి నారా లోకేష్‌… ‌సాత్విక్‌ ‌సాయిరాజ్‌ ‌రాంకిరెడ్డి, చిరాగ్‌‌శెట్టికి అభినందనలు తెలియజేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్