నేడు బెంగళూరు × గుజరాత్ మధ్య ఫైనల్ పోరు
రాత్రి 7.30గం||లకు
అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) సీజన్-2026 తుది సమరానికి సర్వం సిద్ధమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్(జిటి) జట్ల మధ్య టైటిల్ పోరు జరగనుంది. రెండు జట్లూ తమ రెండో ఐపీఎల్ టైటిల్‌కై అమీ తుమీ తేల్చుకోనున్నాయి. గుజరాత్, బెంగళూరు జట్లు ఈ మైదానంలో ఫైనల్లో తలపడడం ఇది తొలిసారి. 2022లో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి గుజరాత్ తొలి ఐపీఎల్ కప్‌ను ముద్దాడింది. మరోవైపు, సుదీర్ఘ కాలంగా అభిమానులను ఊరించిన ఆర్సీబీ, గత ఏడాది 2025లో పంజాబ్ కింగ్స్‌ను ఇదే మైదానంలో మట్టికరిపించి 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ తొలిసారి విజేతగా నిలిచింది. ఇప్పుడు ఇరు జట్లూ తమ రెండో ట్రోఫీని గెలుచుకుని లీగ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాలని భావిస్తున్నాయి.
ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు ఇప్పటివరకు మొత్తం 9 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో ఆర్సీబీ 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, గుజరాత్ టైటాన్స్ 4 మ్యాచ్‌ల్లో జయభేరి మోగించింది. రికార్డుల పరంగా బెంగళూరు జట్టుకు స్వల్ప ఆధిక్యం ఉన్నప్పటికీ, గుజరాత్ జట్టు ఏనాడూ వారికి సులువుగా మ్యాచ్‌లను వదిలిపెట్టలేదు. ఇరు జట్లలోనూ ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగల దిగ్గజ ఆటగాళ్లు ఉన్నారు. ఈ సీజన్ లీగ్ దశలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించింది. ఆడిన 14 మ్యాచ్‌లలో 9 విజయాలు, 5 ఓటములతో మొత్తం 18 పాయింట్లు సాధించింది. మెరుగైన నెట్ రన్ రేట్ (+0.783) కారణంగా పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుని నేరుగా క్వాలిఫయర్-1కు దూసుకెళ్లింది. యువ కెప్టెన్ రజత్ పాటిదార్ సారథ్యంలో జట్టు ఎంతో సమతుల్యంగా కనిపిస్తోంది. బ్యాటింగ్ విభాగంలో రజత్ పాటిదార్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ నిలకడగా పరుగులు సాధిస్తుండగా, బౌలింగ్‌లో సీనియర్ పేసర్ భువనేశ్వర్, హేజిల్‌వుడ్ ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నారు. క్వాలిఫయర్-1 లో గుజరాత్‌ను ఓడించి నేరుగా ఫైనల్‌కు చేరిన ఆర్సీబీ, ప్రస్తుత ఫామ్ ప్రకారం టైటిల్ గెలిచే బలమైన జట్టుగా బరిలోకి దిగుతోంది.
మరోవైపు శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ సైతం ఈ సీజన్ లీగ్ దశలో 14 మ్యాచ్‌లలో 9 విజయాలు, 5 ఓటములతో 18 పాయింట్లు సాధించి రన్ రేట్ ఆధారంగా రెండో స్థానంలో నిలిచింది. గుజరాత్ జట్టుకు వారి టాప్ ఆర్డర్ బ్యాటింగ్ ప్రధాన బలంగా మారింది.
కెప్టెన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్ అద్భుతమైన ఫామ్‌లో ఉంటూ పరుగుల వరద పారిస్తున్నారు. బౌలింగ్ విభాగంలో రబడా, సిరాజ్, రషీద్ ఖాన్ వంటి ప్రపంచ స్థాయి బౌలర్లు ఉన్నారు. క్వాలిఫయర్-1లో ఆర్సీబీ చేతిలో పరాజయం పాలైనప్పటికీ, పట్టువదలకుండా క్వాలిఫయర్-2 లో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి గుజరాత్ ఫైనల్లో అడుగుపెట్టింది.
ఇక గుజరాత్ టైటాన్స్ 2022లో టైటిల్ ను కైవసం చేసుకొని, 2024లో రన్నరప్ గా నిలిచింది. ఇక బెంగళూరు జట్టు 2025లో తొలిసారి టైటిల్ ను కైవసం చేసుకోగా.. మరో మూడుసార్లు (2009, 2011, 2016) రన్నరప్ గా నిలిచింది. దీంతో ఏ జట్టు టైటిల్ కొట్టినా.. రెండోసారి టైటిల్ ను ముద్దాడడం ఖాయం.
జట్లు(అంచనా)..
బెంగళూరు: రజత్ పటీదర్(కెప్టెన్), కోహ్లి, టిమ్ డేవిడ్, బేథెల్, షెఫర్డ్, హేజిల్ వుడ్, తుషారా, పడిక్కల్, జితేశ్ శర్మ(వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా, రసిక్ సలామ్ దర్/భువనేశ్వర్.
గుజరాత్: శుభ్ మన్(కెప్టెన్), సాయి సుదర్శన్, బట్లర్(వికెట్ కీపర్), కుమార్ కుషగ్ర, హోల్డర్, నిషాంత్ సింధు, తెవాటియా, సుందర్, రషీద్ ఖాన్, సిరాజ్, రబడా/ప్రసిధ్.









కామెంట్‌లు (0)