గిట్టుబాటు ధర, కొనుగోళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జోక్యమే కీలకం
నేడు పొగాకు బోర్డు కీలక సమావేశం
ప్రజాశక్తి-ఒంగోలుబ్యూరో : పొగాకు రైతులు పెద్ద ఎత్తున గుంటూరు బోర్డు కార్యాలయం వద్దకు తరలివచ్చారు. సంయుక్త కిసాన్‌మోర్చా నేతృత్వంలో అన్ని రైతుసంఘాల అండతో పొగాకు రైతులుపెద్ద ఎత్తున తరలిరావడంతో పొగాకు బోర్డు కూడా స్పందించక తప్పలేదు. ఛైర్మన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌తో రైతుసంఘాలనేతలు సంక్షోభంపై చర్చించారు. పలు ప్రతిపాదనలూ బోర్డు ముందుంచారు. ఈ నేపధ్యంలో బుధవారం నాడు పొగాకు బోర్డు కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో బోర్డు తీసుకునే నిర్ణయాలపైనే పొగాకు రైతుల భవితవ్యం ఆధారపడింది.
ప్రస్తుతం వేలంలో ధరల్లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పెట్టిన పెట్టుబడికి, వచ్చేధరలకూ లెక్కలు వేసుకుంటున్నారు. ఇపుడున్న ధరలు చివరి వరకూకొనసాగితే బ్యారన్‌కు రూ.4లక్షలు నష్టమని తేల్చారు. పెట్టిన పెట్టుబడులే రాకుంటే ఇక కుటుంబం ఎలా అని రైతులు వాపోతున్నారు. రెండు నెలలుగా ధరల కోసం ఎదురుచూశారు. ఫలితం లేక రోడ్డెక్కారు. బ్యారన్‌కు రూ.20లక్షలు పెట్టుబడి పెట్టారు. 10 ఎకరాలు సాగుకు అనుమతి ఉంది. ఎకరాకు సగటున ఎనిమిది క్వింటాళ్ల పొగాకు వస్తుంది. బ్యారన్‌కు 80 క్వింటాళ్లకు అనుమతి ఉంది. ప్రస్తుతం బ్రైట్ గ్రేడుకు సగటు ధర రూ.ఎస్‌ఎల్‌ఎస్‌లో 219 ఉండగా ఎస్‌బీఎస్‌లో218 ఉంది. లోగ్రేడు ఇంకా అమ్మకాలకు రాలేదు. మొత్తం పంటలో 50 క్వింటాళ్లు బ్రైట్ గ్రేడు వస్తుంది. మరో 30 క్వింటాళ్లు లో గ్రేడు వస్తుంది.దీనికి ఎంత ఇస్తారో కూడా తెలియదు.ఈ నేపధ్యంలో క్వింటాకు సగటున 200 సగటు ధర రావచ్చని అంచనా. అంటే ఈ ధరలు కొనసాగితే 80 క్వింటాళ్లకు రూ.16 లక్షలు రైతులకు వస్తుంది.ఇంకా రూ.4 లక్షలు నష్టమేనని చెబుతున్నారు. అందుకే రైతుసంఘాల నేతలు కొన్ని ప్రతిపాదనలు చేశారు. వాటిని బోర్డు సమావేశంలో చర్చించి కీలకంగా నిర్ణయాలు చేయడంతోపాటు అమలు చేయాలని రైతులు కోరుతున్నారు. నోబిడ్స్ తగ్గించాలి. కిలోకు గరిష్ట ధర రూ.360 కోరుతున్నారు.అపుడు సగటు ధర 275కు వస్తుందని భావిస్తున్నారు. వ్యాపారులు ఎగుమతులు లేవనే కారణంతో కొనుగోళ్లలో మాంద్యం సృష్టించారు. ధరల్లో కోతలు పెట్టారు.పైగా నోబిడ్స్ ఇటీవల సగానికిపైగా చూపారు.వీటిని తిరిగి ఇళ్లకు తీసుకుపోలేక రైతులు అవస్థలు పడుతున్నారు.
ఇక వేలంలో వ్యాపారులకు పోటీగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలనే ప్రతిపాదన కూడా రైతుసంఘాల నేతలు కోరారు.అందుకు బోర్డు ఛైర్మన్ కూడా సానుకూలంగా స్పందించారు. కేంద్రం నుంచి రూ.500 కోట్లు కేటాయించాలని తీర్మానం చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రప్రభుత్వంప్రాత ఏమిటనేదీ ఇంత వరకూ స్పష్టత లేదు. ఎందుకంటే వేలం కేంద్రాలకు కనీసం మంత్రులు కూడా వెళ్లలేదు. ఎమ్మెల్యేలకు అసలు పట్టలేదు. వేలం కేంద్రాల పరిధిలో బోర్డు అధికారుల పాత్ర వ్యాపారులపై చాలా పరిమితంగా ఉంది. వేలం నిర్వహణ తప్ప వ్యాపారులను ఒత్తిడి చేసి ధరలు పెరిగేలా వేలం కేంద్రాల పర్యవేక్షక అధికారులు చూడలేకపోతున్నారు. ఐటీసీ నేతృత్వంలో వ్యాపారులు కూటమిగా ఏర్పడి నిత్యం సీలింగు ధరలు అమలు చేస్తున్నారు. గరిష్ట ధర రూ.250 ఉండగా సగటు ధర రోజురోజుకూ పడిపోతోంది. ఈ తరుణంలో రాష్ట్రంలోనే పొగాకు 70శాతం ఉత్పత్తి ఉన్నందున ప్రభుత్వం కూడా స్పందించాల్సి ఉంది. రూ.500 కోట్లు కేటాయించి ఎస్టీసీ, పొగాకు ఉత్పత్తిదారుల సమాఖ్యలను రంగంలోకి దించి కొనుగోళ్లు చేయించాలని రైతులు కోరుతున్నారు.ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. సిఎం చంద్రబాబు దృష్టి సారించాలని పొగాకు రైతులు కోరుతున్నారు. కేంద్రంతోనూ రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపితే ఫలితం ఉంటుందని భావి స్తున్నారు. ఏదేమైనా పొగాకు రైతులు అందరూ నష్టాల్లో కూరుకుపోయే ప్రమాదం పొంచిఉంది. రైతులకు అన్ని రకాలుగా హామీలు ఇచ్చిన పొగాకు బోర్డు ఛైర్మన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌లు బుధవారం నాడు జరిగే సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుని రైతులు ఎలా ఆదుకుంటారో చూడాలి.









కామెంట్‌లు (0)