నిషేదం ఉన్నా జోరుగా బిటి పత్తి విక్రయాలు
ఉమ్మడి కర్నూలు జిల్లాలో గుట్టుగా అమ్మకాలు
ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి : ఖరీఫ్ సాగుకు రైతులు సిద్ధమవుతున్న వేళ ఉమ్మడి కర్నూలు జిల్లాలో నిషేధిత గ్లైసెల్ బిటి పత్తి విత్తనాల విక్రయాలు జోరందుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ విత్తనాల సాగు, ఉత్పత్తి, మార్కెటింగ్‌పై నిషేధం విధించినప్పటికీ జిల్లాలో మాత్రం గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారం సాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే విత్తన ప్యాకెట్లు పెద్ద ఎత్తున చేరగా, కొందరు అక్రమార్కులు రైతులను లక్ష్యంగా చేసుకుని రహస్యంగా విక్రయాలు కొనసాగిస్తున్నారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణం ప్రతి ఏడాది పెరుగుతోంది. కర్నూలు జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 5,86,022 ఎకరాలు కాగా గత ఖరీఫ్‌లో రికార్డు స్థాయిలో 7,00,215 ఎకరాలు, నంద్యాల జిల్లాలో 20వేల ఎకరాల వరకూ పత్తి సాగు జరిగింది. ఉమ్మడి జిల్లాలో 50 వేల నుంచి 75 వేల ఎకరాల వరకు నిషేద గ్లైసెల్ బిటి పత్తి సాగు జరిగే అవకాశముందని వ్యవసాయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తం పత్తి సాగులో ఈ నిషేధిత విత్తనాల వాటా 10 నుంచి 15 శాతం వరకు ఉంటోందని సమాచారం. అధిక వర్షాలు కురిసినప్పుడు పొలాల్లో కలుపు ఎక్కువగా పెరిగితే కూలీలు, ట్రాక్టర్లతో తొలగించడం కష్టసాధ్యమవుతోంది. దీంతో పత్తి పంట ఎదుగుదల, పూత, కాయలపై ప్రభావం పడుతూ దిగుబడులు తగ్గుతున్నాయని రైతులు చెబుతున్నారు. గ్లైసెల్ బిటి విత్తనాలు సాగు చేసిన పొలాల్లో మాత్రం ప్రత్యేక రసాయనాలు పిచికారీ చేసి కలుపును సులభంగా నియంత్రించవచ్చనే కారణంతో రైతులు వీటిపై ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ విధానం పర్యావరణానికి, భూసారానికి హానికరమని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ విత్తనాల ఉత్పత్తి, విక్రయాలపై నిషేధం విధించింది. విత్తన తయారీకి కేంద్రంగా ఉమ్మడి కర్నూలు జిల్లా బిటి పత్తి విత్తనాల తయారీకి కేంద్రంగా మారినట్లు తెలుస్తోంది. ఇక్కడ విత్తనాలను ఉత్పత్తి చేసి శుద్ధి చేసిన అనంతరం తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు సమాచారం. లైసెన్సు పొందిన విత్తనాల తరహాలోనే ఈ నిషేధిత విత్తనాల వ్యాపారం సాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల వ్యవసాయశాఖ అధికారులు ఉమ్మడి జిల్లాలోని పత్తి విత్తన శుద్ధి కేంద్రాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఉన్న 45 సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లలో హెచ్‌టిటీ కిట్లతో పరీక్షలు నిర్వహించగా గ్లైసెల్ బిటి విత్తనాల ఆనవాళ్లు బయటపడినట్లు సమాచారం. సీజన్ ప్రారంభానికి ముందే గ్రామాల్లో కొందరిని ఎంపిక చేసుకుని రైతులకు విత్తనాలు విక్రయిస్తున్నట్లు సమాచారం. 750 గ్రాముల విత్తన ప్యాకెట్‌ను రూ.800 నుంచి రూ.1,000 వరకు విక్రయిస్తున్నారు. లూజు విత్తనాల పేరుతో ఈ నిషేధిత పత్తి విత్తనాలను విక్రయిస్తున్నారని రైతులు చెబుతున్నారు. నకిలీ, నిషేధిత విత్తనాల విక్రయాలకు అడ్డుకట్ట వేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వ్యవసాయశాఖ అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అక్రమ విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ధృవీకరించిన విత్తనాలనే ఉపయోగించాలి : బాలవర్ధిరాజు, ఎడిఎ, ఆదోని
హెట్‌టి కాటన్ అంటే గ్లైఫోసిన్ వంటి కలుపు మందులను తట్టుకునే విధంగా మార్పు చేసిన పత్తి రకం. అనుమతి లేని ఈ రకం విత్తనాల విక్రయం, సాగు చేయడం నిషేధం. వర్షాభావం లేదా అధిక వేడి సమయంలో దిగుబడి తగ్గే అవకాశం ఉంది. ధృవీకరించిన విత్తనాలనే ఉపయోగించాలి. ఎవరైనా నిషేధిత విత్తనాలకు విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే స్థానిక వ్యవసాయ అధికారులకు సమాచారం అందించాలి.
నిషేద విత్తనాల విక్రయాలను అరికట్టాలి :- జి రామకృష్ణ, రైతు సంఘం కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి
సీజన్ కు ముందుగానే వ్యవసాయ శాఖ అధికారుల పర్యవేక్షణ పెంచాలి. కర్నూలు జిల్లాలోని కొన్ని కేంద్రాల నుంచి లూజు విత్తనాలు వస్తున్నాయి. జిల్లాలో జోరుగా విక్రయాలు సాగుతున్నాయి. ఆ విషయాన్ని జాయింట్ కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లాం. వ్యవసాయ శాఖ అధికారులు నియంత్రణ చర్యలు చేపడుతున్నామని చెబుతున్నా ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. అధికారులు పటిష్ట చర్యలు చేపట్టి నిషేద బిటి పత్తి విత్తనాల అమ్మకాలను అరికట్టాలి.









కామెంట్‌లు (0)