test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కాజ బ్లాక్‌‌లో ‘వేదాంత’ కలకలం

6 రోజుల క్రితం

కాజ బ్లాక్‌‌లో ‘వేదాంత’ కలకలం
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 01, 2026, 08:56 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

– తీరంలో 115 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఆయిల్‌, గ్యాస్‌ తవ్వకాలు
– కేంద్ర ప్రభుత్వ అనుమతులపై తీవ్ర విమర్శలు

ప్రజాశక్తి- కృష్ణా ప్రతినిధి : ప్రజల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండానే కృష్ణా జిల్లా కాజ బ్లాక్‌‌లో వేదాంత లిమిటెడ్‌ కంపెనీకి షేల్‌ ‌గ్యాస్‌ వెలికితీతకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. ఆయిల్‌, సహజ వాయువులను ‌హైడ్రాలిక్‌ ‌పాక్చరింగ్‌ ‌పద్ధతిలో వెలికితీసే క్రమంలో పర్యావరణం, భూగర్భ జలాలు కలుషితమై ప్రజారోగ్యంపైనా, వ్యవసాయ పంటలపైనా తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వేదాంత కంపెనీ లిమిటెడ్‌ ‌సంస్థ పర్యావరణంపై వేసిన అంచనా నివేదికలో అనేక అంశాలను దాచిపెట్టి అనుమతులు పొందిందనే ఆరోపణలు ఉన్నాయి. కాజ బ్లాక్‌లో వేదాంత కంపెనీ 114.93 చదరపు కిలోమీటర్ల పరిధిలో షేల్‌ ‌గ్యాస్‌ ‌వెలికితీతకు ప్రభుత్వం 2020 డిసెంబర్‌ 17‌న గూడూరు మండలం తరకటూరు హైస్కూల్‌‌లో ‌ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గింది. ఆ తర్వాత మొవ్వ మండలం కాజలో చేపట్టిన అభిప్రాయ సేకరణలోనూ స్థానిక ప్రజలు, పర్యావరణవేత్తలు, సిపిఎం, ప్రజాసంఘాల నేతలు షేల్‌ ‌గ్యాస్‌ ‌వెలికితీతను తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే, ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ఆయిల్‌, గ్యాస్‌ ‌వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం, పర్యావరణ, అటవీ శాఖలు వేదాంతకు తాజాగా అనుమతులు ఇచ్చాయి. రూ.650 కోట్ల పెట్టుబడులతో మొవ్వ మండలం కాజ, గూడూరు మండలం తరకటూరు, మచిలీపట్నం, కృత్తివెన్ను మండలాల్లోని పలు ప్రాంతాల్లో 20 బావులు ఏర్పాటు చేసి 30 మిలియన్‌ ‌మెట్రిక్‌ ‌స్టాండర్స్‌ ఆయిల్‌, సహజ వాయువులను ‌హైడ్రాలిక్‌ ప్యాక్చరింగ్‌ ‌పద్ధతిలో వెలికితీయనున్నట్లు వేదాంత లిమిటెడ్‌ నివేదికలో పేర్కొంది. ఒక్కో బావి 22.5 ఎకరాల విస్తీర్ణంలో తవ్వుతారు. బావులు, ఇతర అవసరాలకు 222.3 ఎకరాలు భూ కేటాయింపులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

అభ్యంతరాలు ఇలా
సహజ పద్ధతులకు భిన్నంగా సంక్లిష్టమైన ‌హైడ్రాలిక్‌ ‌పాక్చరింగ్‌ విధానంలో షేల్‌ ‌ఆయిల్‌, గ్యాస్‌ ‌నిక్షేపాలను వెలికితీస్తారు. 1.3 కిలోమీటర్ల లోతు వరకు నిలువుగా బావిని తవ్వుతారు. ఒకసారి ప్రాకింగ్‌ ‌చేయడానికి 1.5 నుంచి 3 కోట్ల లీటర్ల స్వచ్ఛమైన నీటిని వినియోగించాల్సి ఉంటుంది. ఒక షేల్‌ ‌గ్యాస్‌ ప్రాజెక్టు నడవాలంటే వంద నుంచి 300 బావులు తవ్వుతారు. దీనికి బోర్ల నుంచి అధికంగా నీటిని తోడి 800 రకాల రసాయనాలను కలిపి భూగర్భంలోకి పంపుతారు. అధికంగా నీటిని తోడటంతో సమీప ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటడంతోపాటు రసాయనాలతో కలుషితమవుతాయి. పరిసర ప్రాంతాల్లో ప్రజలకు తాగు నీటి సమస్యలు ఏర్పడతాయి. మిథేన్‌, బెంజిన్‌, కార్బన్‌‌డయాక్సయిడ్‌ ‌వాయువులు అధిక మోతాదులో విడుదలయ్యే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. బావులు ఏర్పాటు చేసిన పది కిలోమీటర్ల పరిధిలో వాతావరణ కాలుష్యం  తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ప్రజారోగ్యంపైన దుష్ప్రభావాన్ని గుర్తించి ప్రాన్స్‌, జర్మనీ, బెల్జియం దేశాల్లో ఈ విధానంలో నిక్షేపాల వెలికితీత నిషేధించాయి. బ్రిటన్‌‌లో మారిటోరియం విధించారు.

నిజాలు దాచిపెట్టింది
వేదాంత కంపెనీ పర్యావరణ ప్రభావ అంచనాలో చాలా అంశాలను దాచిపెట్టింది. నీటి వినియోగాన్ని, కాలుష్యాన్ని తక్కువగా చూపింది. రసాయనాలు భూగర్భంలోకి పంపి ఆయిల్‌, గ్యాస్‌ వెలికితీసే క్రమంలో వాతావరణంలో ప్రమాదకరమైన వాయువులు కలిసి భూతాపం పెరుగుతుంది. భూగర్భ జలాలు కలుషితమవుతాయి. తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం, గుండె సంబంధిత వ్యాధులతో పుట్టడం వంటివి జరుగుతాయని గుర్తించారు. భూగర్భ జలాలు కాలుషితమవ్వడంతో ఈ ప్రాంతంలో రెండు పంటలు పండే వేలాది ఎకరాల భూములు ఎందుకూ పనికిరాకుండా పోతాయి.
– కె.బాబూరావు, ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ‌కెమికల్‌ ‌టెక్నాలజీ చీఫ్‌ ‌సైంటిస్టు (రిటైర్డు), హైదరాబాద్‌

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్