test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తడవకుండానే మోపెడు…!

3 రోజుల క్రితం

తడవకుండానే మోపెడు…!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 05, 2026, 12:43 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ఇకనుండి పట్టణాల్లో నీటి బిల్లు తీరు

  • కేంద్ర నిధుల కోసం ప్రజలపై పెనుభారం

  • ఇప్పటికే జిఓ విడుదల చేసిన ప్రభుత్వం

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ‘తడిసి ..మోపేడు..` ఈ సామెత వినే ఉంటారు కదా! అయితే, ఇకపై పట్టణాల్లో ప్రజలు చెల్లించే నీటి బిల్లు తడవకుండానే మోపెడు కానుంది. కేంద్రం నుండి వచ్చే నిధుల కోసం ప్రజానీకంపై పెనుభారం మోపడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోవడమే దీనికి కారణం. అమృత్ 2.0 షరతులలో భాగంగా ఇప్పటికే ఆ దిశలో అడుగులు వేసిన రాష్ట్ర ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం జారీ చేసిన 673వ నెంబర్ జిఓ దీనికో ఉదాహరణ. ఈ జిఓ ప్రకారం ఇప్పటి వరకూ వాడుకునే నీటికి మాత్రమే పన్నులు చెల్లించే విధానం అమలులో ఉన్న సంగతి తెలిసిందే. తాజా జిఓ ప్రకారంపంపిణీ కేంద్రం వద్ద నుండి వచ్చే ప్రతి చుక్క నీటికి ప్రజలు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే నీటి సరఫరాకు ఎంత ఖర్చు అయితే అంత మొత్తాన్ని ప్రజల నుండి వసూళ్లు చేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో సుమారు 25.6 లక్షల నీటి కుళాయి కనెక్షన్లు ఉన్నాయి. దీని ద్వారా ఏడాదికి దాదాపు రూ.350 కోట్ల నుండి రూ.450 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. ఇందులో వసూళ్లు 60 శాతం నుండి 75 శాతం ఉంటున్నాయి. ఇప్పటి వరకూ నీటిపన్నును గృహావసర, కమర్షియల్‌ అనే పద్దతుల్లో వసూలు చేస్తున్నారు. అలాగే నాన్‌ ‌రెవెన్యూ వాటర్‌‌ 30 శాతం ఉందని, దీన్ని 20 శాతం కంటే తక్కువకు తగ్గించాలనే ప్రతిపాదనను నూతన విధానంలో ముందుకు తీసుకువచ్చారు. దీనికోసం ఆడిట్‌ ‌కమిటీని ఏర్పాటు చేయనున్నారు. అన్ని నీటి వనరుల వద్ద, బల్క్ పంపిణీ కేంద్రాల వద్ద, ఇళ్ల వద్ద వంద శాతం నీటి మీటర్లను అమర్చనున్నారు. ఉత్పత్తి అయ్యే నీరు, సరఫరా అవుతున్న నీటిలో వృథా ఎంతశాతం ఉందో పరిశీలించి దాన్ని తగ్గించేందుకు నిరంతరం వాటర్‌ ఆడిట్ చేయాలని నిర్ణయించారు. ఇక నుండి కొత్తగా నిర్మించే భవనాలకు రెండు ట్యాపుల పద్దతిని అమలు చేయాలని సూచించారు. వీటిల్లో ఒకటి మంచినీరు, మరొకటి పునర్వినియోగనీరు కోసం వాడాలని సూచించారు. మొత్తం పట్టణ నీటి డిమాండ్‌లో 20 శాతం, పరిశ్రమల నీటి డిమాండ్‌లో 40 శాతం అవసరాలను శుద్ధి చేసిన నీటి ద్వారానే భర్తీ చేయనున్నారు. పునర్వినియోగ నీరు అంటే వాటర్‌ ట్రీట్‌ ‌మెంట్‌ ‌ప్లాంటు ఏర్పాటు చేసి దాని ద్వారా నీటిని శుద్ధి చేసి పంపిస్తారు. దీన్ని ఇళ్లలో ఇతర అవసరాలకు వాడాల్సి ఉంది. వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ‌ప్లాంటు ప్రైవేటు వ్యక్తులు నిర్వహణలో ఉంటాయి. వాటికయ్యే ఖర్చు మొత్తం ప్రజలే భరించాలి. పిపిపి నిర్వాహకులకు ఎక్కడైనా లోటు వస్తే దాన్ని కూడా ప్రభుత్వమే భర్తీచేసేలా నిబంధనలు రూపొందించారు. వృథా నీటిని రీసైకిల్ చేసి పారిశ్రామిక మరియు గృహ అవసరాలకు ఉపయోగించడం ద్వారా సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించనున్నారు. ఇందులో 24X7 నీటి సరఫరా, డ్రింక్ ఫ్రమ్ టాప్, స్మార్ట్ వాటర్ మీటరింగ్ ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం డిపాజిట్‌ ఎమౌంట్‌‌ను పెంచనున్నారు. ప్రభుత్వం ఆమోదించిన సంస్కరణల్లో నీటిని సరఫరా చేయడానికంటే విద్యుత్ బిల్లులు, పైప్‌లైన్ల నిర్వహణ ఖర్చులు చాలా రెట్లు ఎక్కువగా ఉంటున్నాయని వాటిని రాబట్టుకోవడం కీలకమని పొందుపరిచారు. మీటర్లు పెట్టడం ద్వారా ప్రతి ఏటా మున్సిపల్‌ ‌వాటర్‌ ‌ట్యాక్సు డిమాండు 10 నుండి 15 శాతం పెరుగనుంది. ఈ మొత్తం కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లనుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్