వినియోగం తగ్గింపే లక్ష్యం
యూరియా, డిఎపిలకు కోటా
సీజన్‌లో 20 రోజుల వ్యవధితో మూడు విడతల్లో అమ్మకం
రైతులకు స్మార్ట్ ఫోన్, నెట్ అవసరం
నిబంధనలు ఉల్లంఘిస్తే అధికారులు, డీలర్లపై కేసులు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : త్వరలో ప్రారంభం కానున్న ఖరీఫ్‌లో యూరియా, డిఎపి ఎరువుల అమ్మకాలకు రాష్ట్ర టిడిపి కూటమి ప్రభుత్వం ‘ఎపి అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మోనిటరింగ్ సిస్టం (ఎపిఎఐఎంఎస్)’ పేరిట యాప్‌ను సిద్ధం చేసింది. సదరు యాప్‌లో రైతు ధ్రువీకరణ జరిగితేనే ఎరువులు అమ్మాలని హోల్‌సేల్, రిటైల్ డీలర్లను, సహకార సొసైటీలను ఆదేశించింది. వ్యవసాయ భూములన్నింటికీ ఎరువుల పంపిణీ జరుగుతుందంటూనే.. యాప్‌లో రైతుల ధ్రువీకరణకు పలు నిబంధనలు విధించింది. గతేడాది (2025) ఖరీఫ్ సీజన్‌లో ఇ-క్రాప్‌లో సాగు నమోదైన రైతుల ప్రాతిపదికన రైతులకు ఎరువులిస్తారు. ఏ పంటకు ఎంత విస్తీర్ణానికి ఎంత పరిమాణంలో ఎరువులు అవసరమో గణిస్తారు. ఆ మొత్తాన్నీ ఒకేసారి కాకుండా సీజన్‌లో మూడు విడతల్లో అమ్ముతారు. ఒక విడతకు ఇంకో విడతకు మధ్య కనీసం 20 రోజుల వ్యవధి ఉండాలి. ఆ లోపు అమ్మరు. రెండెకరాలకు గరిష్టంగా నాలుగు యూరియా, నాలుగు డిఎపి బస్తాలిస్తారు. వాటినీ మూడు తడవల్లో అమ్ముతారు. వెబ్‌ల్యాండ్ రికార్డులలో భూమి వివరాలు లేకపోతే మండల వ్యవసాయాధికారి (ఎంఎఒ) ద్వారా రైతుల ధ్రువీకరణ జరుగుతుంది. కౌలు రైతులకు కూడా ఎరువులు ఇస్తామంటున్నా వారికి సిసిఆర్‌సి, సిఒసిలు ఉండాలి. అవి లేకపోతే ఎంఎఒ అథంటికేషన్ ఇవ్వాలి. రైతులు తమ మొబైల్ ఫోన్లలో యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఫోన్ తీసుకొని రైతు సేవాకేంద్రం (ఆర్‌ఎస్‌కె) వద్దకెళ్లి భూమి వివరాలు తెలిపి నిరుడు ఇ-క్రాప్‌లో నమోదయ్యారో లేదో చూపించి, ఆ ఏరియాలో ప్రభుత్వం వద్ద నమోదు చేసుకున్న ఎరువుల డీలర్ల మ్యాపింగ్ చేయించాలి. రైతులు ఆ ధృవీకరణ చూపితేనే డీలర్లు నిర్ణయించిన కోటా మేరకు ఎరువులు అమ్మాలి. ఈ నిబంధన సహకార సొసైటీలకు కూడా వర్తిస్తుంది. యాప్ ధృవీకరణ లేకపోతే డీలర్లు రైతులకు ఎరువులు అమ్మకూడదు. యాప్‌లో ధ్రువీకరణ లేకుండా ఎరువులు అమ్మిన డీలర్లపైనా, అందుకు బాధ్యులైన అధికారులపైనా క్రిమినల్ కేసులు, శాఖాపరమైన విచారణ, లైసెన్స్‌ల రద్దు వంటి కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయశాఖ కమిషనర్ మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 7,800 మంది డీలర్లతో, అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి హెచ్చరించినట్లు సమాచారం. యాప్ ధ్రువీకరణతో పాటు ఇప్పటికే ఉన్న ఆధార్, డిబిటి సరేసరి. రైతులకు తప్పనిసరిగా స్మార్ట్‌ఫోన్, నెట్ బ్యాలెన్స్ ఉండాలి. సబ్సిడీలను తగ్గించుకునే లక్ష్యంతో రైతులతో యూరియా, డిఎపి వినియోగాన్ని నియంత్రించేందుకు కేంద్రం ఆదేశాల మేరకే యాప్‌ను తీసుకొచ్చామని, ఎట్టి పరిస్థితుల్లోనూ గతం కంటే వాడకం తగ్గాలని కమిషనర్ నిర్దేశించినట్లు తెలిసింది. ఈ ఏడాది ఎరువుల పంపిణీకి ప్రత్యేకంగా రైతులకు గుర్తింపు కార్డులిస్తామని తొలుత ప్రభుత్వం పేర్కొంది. కాగా ఈ కార్డుల పైలెట్ ప్రాజెక్టు (ప్రయోగాత్మకంగా) కాకినాడ, కృష్ణా జిల్లాల్లో అమలవుతుందని, తతిమ్మా రాష్ట్రం మొత్తం యాప్ ద్వారా ఎరువుల పంపిణీ జరుగుతుందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. సోమవారం నుంచి యాప్ అమల్లోకి వస్తుందని సమాచారం.









కామెంట్‌లు (0)