- ఆందోళనలో రైతులు
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : ఓవైపు ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఇంకోవైపు మార్కెట్ ఒడిదుడుకులు, తాజాగా పెరిగిన మేత ధరలతో పౌల్ర్టీ రంగం మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా మారింది. కోళ్లకు మేత కోసం వినియోగించే మొక్కజొన్న, నూకలు, సోయా, తవుడు వంటి ధరలు గత రెండు నెలల్లో అసాధారణంగా పెరిగాయి. పది నుంచి 45 శాతం వరకూ పెరగటంతో పెట్టుబడిపై రైతులలో ఆందోళన నెలకొంది. కొత్తగా ఎవరూ బ్యాచ్‌లు వేయకపోవటంతో కోడి పిల్ల ధర రూ.50 నుంచి ప్రస్తుతం రూ.28కు పడిపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజులలో డిమాండ్‌కు తగినట్లుగా కోళ్ల సరఫరా లేక ధరలు పెరిగి సామాన్యులపై పెనుభారంగా మారే పరిస్థితులు రానున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పించిన ఈ రంగం అంపశయ్య మీదకు చేరుతోంది. గత నెలలో అధిక ఉష్ణోగ్రతల ఫలితంగా జిల్లాలో లక్షలాది కోళ్లు మృతి చెందాయి. దీనిని ప్రకృతి విపత్తుగా భావించి నష్టపరిహారం ఇవ్వాలని పౌల్ర్టీ రైతులు కోరుతున్నా ఇప్పటి వరకూ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనా లేదు. జిల్లాలో 50 వేల నుంచి లక్షకు పైబడి సామర్థ్యం కలిగిన కోళ్ల ఫారాలు 245 ఉన్నాయి. ఈ ఫారాల్లో 1.50 కోట్ల కోళ్లను పెంచుతుంటారు. అనపర్తి నియోజక వర్గంలో 70 లక్షల కోళ్లు, నిడదవోలు నియోజక వర్గంలో 50 లక్షల కోళ్లు, నల్లజర్ల, గోపాలపురం, కొవ్వూరు, కడియం నియోజకవర్గాల్లో మరో 30 లక్షల కోళ్ల పెంపకం జరుగుతుంది. గత ఏడాది ఈ రోజుల్లో జిల్లాలోని 265 షెడ్లలో 1.90 కోట్లు పెరిగేవి. గత ఏడాది బర్డ్‌ఫ్లూ, ఈ వేసవిలో అధిక ఉష్ణోగ్రతల ఫలితంగా సుమారు 30 నుంచి 40 లక్షల కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఈ ఏడాదిలో అత్యధిక మంది ఈ రంగాన్ని విడిచిపెట్టడంతో కొన్ని షెడ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. జిల్లా నుంచి కోల్‌కత్తా, ఒడిశా, అసోం, బీహార్, మధ్యప్రదేశ్‌తోపాటు ఈశాన్య రాష్ట్రాలకు కోడిగుడ్లు ఎగుమతులు జరుగుతుంటాయి. ప్రస్తుతం చికెన్ లైవ్ రైతు ధర రూ115 కాగా, గుడ్డు ధర రూ.5.95 పై ఉంది. గత వారం రోజులుగా లైవ్ చికెన్ ధరలో రూ.10, గుడ్డు ధరలో 10 పైసలు చొప్పున హెచ్చు తగ్గులు ఉంటున్నాయి. ప్రస్తుతం పెరిగిన ధరల ఆధారంగా గుడ్డు ఉత్పత్తికి రూ.6.00, కేజీ చికెన్‌కు రూ.130 చొప్పున పెట్టుబడి ఖర్చువుతోంది. ఈ ధరలు నిలకడగా ఉన్నా తమకు గిట్టుబాటు కాదని పౌల్ర్టీ రైతులు వాపోతున్నారు. ఆక్వా రంగానికి ఇచ్చినట్లు ఉచిత విద్యుత్ ఇవ్వాలని. కోళ్ల మేత సబ్సిడీతో పంపిణీ చేయాలని వారు కోరుతున్నారు.
మేత ధరల పెరుగుదలతో పెట్టుబడి ఖర్చులు పైపైకి
గతంలో కేజీకి రూ.108 పెట్టుబడి ఖర్చు అయ్యేది. ప్రస్తుతం పెరిగిన ధరల ప్రకారం కేజీకి సరాసరి రూ.12 ఖర్చు పెరగనుంది. ప్రస్తుతం మార్కెట్ రేటు రూ.115కు మించటం లేదు. ఈ లెక్కన రైతుకు కేజీకి రూ.5 చొప్పున నష్టం వచ్చే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కొత్త బ్యాచ్‌లు వేసేందుకు వెనకడుగు వేస్తున్నారు.
ప్రభుత్వం స్పందించాలి
అధిక ఉష్ణోగ్రతల కారణంగా గత నెలలో దాదాపుగా అన్ని పౌల్ర్టీల్లోనూ కోళ్లు మృత్యువాత పడ్డాయి. ప్రభుత్వం పరిహారం అందించాలి. మేత, విద్యుత్ సరఫరాలో సబ్సిడీ కల్పించి ఈ రంగాన్ని ఆదుకోవాలి.
-కె. చంద్రశేఖర్, పౌల్ట్రీ రైతు, గోపాలపురం, తూర్పుగోదావరి జిల్లా
మేత ధరలు ( టన్నులలో) ఏప్రిల్‌లోజూన్‌లో
మొక్కజొన్నరూ.18 వేలు రూ.23 వేలు
నూకలురూ.20 వేలురూ.22వేలు
సోయా రూ.40 వేలు రూ.75 వేలు
తవుడురూ.15 వేలు రూ.20 వేలు









కామెంట్‌లు (0)