test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సర్వేలు చేయిస్తున్నాం జాగ్రత్త

1 రోజు క్రితం

tdp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 07, 2026, 12:34 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • - కార్యకర్తల శిక్షణ కార్యక్రమంలో టిడిపి అధినేత చంద్రబాబు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పార్టీ పదవులు మొదలుకుని టిక్కెట్ల కేటాయింపుల వరకు నిరంతరం సర్వేలు చేయిస్తున్నామని, జాగ్రత్తగా ఉండాలని టిడిపి నేతలకు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ప్రజలు, కార్యకర్తల అభిప్రాయాలకనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు. టిడిపి కార్యాలయంలో శిక్షణ పొందుతున్న క్లస్టర్ ఇన్‌‌ఛార్జులతో శనివారం కాఫీ కబుర్లు సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర, పార్టీ శ్రేయస్సు కోసం తప్పులు చేసిన వాళ్లని, తేడాగా ఉన్నవాళ్లని వదిలించుకుంటానని తెలిపారు. ఎన్నికల్లో కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఏం ప్రచారం చేశారో అవన్నీ ప్రభుత్వం చేస్తోందన్నారు. ప్రభుత్వం చేస్తోన్న మంచిని గడప గడపకు వెళ్లి చెప్పాలని ఆదేశించారు. ఆనాడు చెప్పిన వాటిని ఈనాడు నెరవేరుస్తున్నామనే విషయాన్ని ప్రజలకు గుర్తుచేయాలన్నారు. కార్యకర్తలను నాయకులుగా మలిచేందుకే శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ఇకపై పార్టీకి ఓటమి లేదని, రాకుండా ఆ స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. సంక్షేమం-అభివృద్ధి చేస్తున్నామని, ప్రజలకు స్వేచ్ఛను ఇచ్చామని చెప్పారు. మంగళగిరిలో పార్టీ గెలిచి చాలా కాలమైందని, లోకేష్ పోటీ చేసినా 2019లో ఓడిపోయారని గుర్తుచేశారు. 2024లో లోకేష్‌ అద్భుత విజయం సాధించారని చెప్పారు. ఇప్పుడు మంగళగిరిలో లోకేష్ చక్కగా పని చేస్తున్నారని, ఇప్పుడు మంగళగిరి టిడిపికి కంచుకోట అని వెల్లడించారు. యుద్ధాన్ని గెలిపించే బాధ్యత తనదని, తనతోపాటు అలుపెరగకుండా యుద్ధం చేసే బాధ్యత మీదేనని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి బూత్‌లోనూ గతానికి మించి ఓట్లు రావాలన్నారు. కార్యకర్తలను ఆదుకునేందుకు పార్టీ పరంగా చేయాల్సిందంతా చేస్తామని, అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు.
ప్రభుత్వం చేసే అభివృద్ధిని అందిపుచ్చుకునేలా కార్యకర్తలు ఆలోచించాలన్నారు. మద్యపానం నిషేధం, సిపిఎస్ రద్దు, జాబ్ క్యాలెండర్ అమలు వంటి హామీలిచ్చి మాట తప్పిందని వైసిపిని ఉద్దేశించి విమర్శించారు. చెప్పినవి చేయకపోగా తాము నిర్వహించిన డిఎస్‌‌సి-2025పై బురద జల్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకా హత్యపై ఎలా దుష్ప్రచారం చేసి లబ్ధి పొందారో.. డిఎస్‌‌సి విషయంలోనూ అలానే లబ్ధి పొందాలనుకున్నారని పేర్కొన్నారు. డిఎస్‌‌సి నిర్వహణపై ఆధారాలతో సహా కౌంటర్ ఇచ్చామని, దీంతో వైసిపి నేతలు డిఫెన్సులో పడ్డారని చెప్పారు. అధికారంలో ఉన్నామని, సహనం, ఓపిక అవసరమని సూచించారు. వైసిపి ఆగడాలు శృతి మించితే వదిలిపెట్టబోమని హెచ్చరించారు. కూటమితోనే వెళ్తామని, దీనికి అనుగుణంగా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో వ్యవహరించాలన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్