test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపాలకులకు పట్టని వ్యవసాయ కార్మికులు

09 మే, 2026

vya ka sam
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 10, 2026, 05:00 పూర్వాహ్నం | 5 నిమిషాల చదవడం

  • మే 11 నుంచి ఎ.పి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభ

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టిలో అభివృద్ధి, సంక్షేమాల మాటలకు అర్థం మారింది. సంపన్నుల అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వాల బాధ్యతగా భావిస్తున్నాయి. స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారులకు భూమి, నీరు, గాలి, భూగర్భ సంపద దోచిపెట్టడం కోసం పేదల నోళ్లు కొడుతున్నారు. ఊళ్ల నుండి ఖాళీ చేయిస్తున్నారు. గ్రామీణ కూలీలు ఏడాదికేడాది దుర్భర దారిద్య్రం, పేదరికంలో కూరుకుపోతున్నా పాలకులకు కనిపించడంలేదు. వారి గురించి పట్టించుకునే తీరిక లేదు. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 30వ మహాసభ మే 11, 12, 13 తేదీలలో అంబేద్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురంలో జరుగుతున్నది. 1934లో నెల్లూరు జిల్లా అలగానిపాడులో అమరజీవి పుచ్చలపల్లి సుందరయ్య ఏర్పాటు చేసిన వ్యవసాయ కార్మిక సంఘం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల సభ్యత్వం కలిగి గ్రామీణ పేదల కోసం పని చేసే అతి పెద్ద సంఘంగా అభివృద్ధి చెందింది. రానున్న కాలంలో విస్తృతమైన పోరాటాలు నిర్వహించడానికి ఈ మహాసభ సన్నద్ధమవుతున్నది.
స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఎకరం భూమి లేని పేదలు కోట్లలో వుంటే, వేళ్ళ మీద లెక్కబెట్టగలిగే కొద్దిమంది కార్పొరేట్‌లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల ఎకరాల భూములను అతి చౌకగా అప్పగిస్తున్నాయి. కార్పొరేట్లకు తలొగ్గి భూమిని సరుకుగా మార్చి పేదల భూములను కొల్లగొట్టడానికి భూ చట్టాలను నిర్వీర్యం చేస్తున్నాయి. కేంద్ర బిజెపి ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టాన్ని, అటవీ హక్కుల చట్టాన్ని బలహీనపరుస్తుంటే, మన రాష్ట్ర ప్రభుత్వం అసైన్డ్‌ చట్టాన్ని సవరించి పేదల భూములను సోలార్‌ కంపెనీలకు, పెత్తందారులకు రెగ్యులర్‌ చేస్తున్నది. రకరకాల పేర్లతో ఈ కంపెనీలకు కోటాను కోట్లు రాయితీలు ఇస్తున్న కేంద్రం కోట్లమంది ఆకలి తీరడానికి కొంతైనా తోడ్పడుతున్న ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసింది. ఈ విధానాలకు వ్యతిరేకంగా పేదలు ఆలోచించకుండా, సంఘటితం కాకుండా వుండేందుకు మత విద్వేషాలను రెచ్చగొట్టి పేదల మధ్య ఘర్షణలను పెంచుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మత ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. తిరుపతి లడ్డు మొదలుకొని తాజాగా ఆకివీడు వరకు జరిగిన అన్ని సంఘటనల్లో ప్రభుత్వ ప్రధాన నేతలు మత సామరస్యానికి భగం చేసే విధంగా వ్యవహరించారు. ఈ పరిస్థితిని ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్థలు ఉపయోగించుకుని వ్యవసాయ కార్మికుల్లో మతతత్వ భావాలను వ్యాప్తి చేసి లబ్ధి పొందాలని చూస్తున్నాయి.

వ్యవసాయ రంగంలో అనేక మార్పులు వచ్చాయి. యంత్రాల ప్రవేశం పెరగడంతో కూలీలకు పని దినాలు వేగంగా తగ్గిపోతున్నాయి. మరోవైపు గ్రామీణ నిరుద్యోగం పెరగడంతో పనిలో పోటీ పెరిగి 3 నుండి 4 శాతం కనీస వేతనాలు పడిపోయాయి. మహిళల వేతనాలు మరింత తగ్గాయి. వలసలు పెరిగిపోతున్నాయి. వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడంతో చిన్న, సన్నకారు రైతులు కొద్దిపాటి భూమి అమ్ముకొని కూలీలుగా మారుతున్నారు. 1970వ దశకంలో 100 మంది రైతులకు 33 మంది కూలీలు ఉంటే నేడు 100 మంది రైతులకు 121 మంది వుంటున్నారు. ఆహార భద్రత చట్టాన్ని కేంద్రం గాలికి వదిలేయడంతో 18 రకాల నిత్యావసర సరుకులు ఇవ్వాలన్న పేదల డిమాండ్‌ను పట్టించుకోవడంలేదు. ఎప్పటికప్పుడు పెరిగే నిత్యావసర సరుకుల ధరలు ప్రస్తుత ఇరాన్‌ యుద్ధ పరిస్థితుల్లో భారీగా పెరిగిపోతున్నాయి.

రాష్ట్రంలోని 50 శాతానికి పైగా గ్రామీణ దళితవాడలకు రక్షిత మంచినీరు, కనీస మౌలిక సౌకర్యాలు, 70 శాతం మందికి సొంత మరుగుదొడ్లు లేవు. చట్ట ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్‌లో కేటాయించాల్సిన ఎస్సీ ఎస్టీల సబ్‌ప్లాన్‌ నిధుల్లో కోత, మళ్ళింపు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. దళితులపై దాడులు, అత్యాచారాలు కొనసాగుతూనే వున్నాయి. తెలుగుదేశం కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్ధానాలు రెండు సంవత్సరాలు పూర్తవుతున్నా (20 లక్షల మంది యువతకు ఉపాధి లేదా నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి, మహిళలకు నెలకు రూ.1500 వంటివి) అమలు కాలేదు. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు, రుణ మాఫీ హామీ అమలుకు నోచుకోలేదు. డ్వాక్రా రుణాలు మంజూరు చేయడంలో రాజకీయ పక్షపాతం, సిబ్బంది అవినీతి పెరిగిపోయింది. ఒకవైపు ప్రభుత్వ నగదు బదిలీ పథకాలను కుదిస్తుండడం, మరోవైపు విద్య, వైద్యం ఖర్చులు పెరిగిపోతుండండంతో గ్రామీణ పేదలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. మైక్రోఫైనాన్స్‌ కంపెనీలు 20 నుండి 30 శాతం అధిక వడ్డీలతో పేదలను పీల్చుకు తింటున్నాయి. వారంతా ఈ సంస్థల ఒత్తిళ్ళను భరించలేక కూలీలు గ్రామాలను వదిలిపోవడమో, ఆత్మహత్యలు చేసుకోవడమో ఈ కాలంలో పెరిగింది. వీటి వల్ల పేదలకు ప్రభుత్వం నుండి అందాల్సిన ఆర్థిక సహాయం అందడంలేదు. పేదల కుటుంబాలను ఆర్థికంగా, ఆరోగ్యపరంగా తీవ్రంగా దెబ్బ తీస్తున్న మద్యం అమ్మకాలను నియంత్రించకపోగా, యువతలో గంజాయి, మాదకద్రవ్యాల వాడకం పెరిగింది. ఈ పరిస్థితుల్లో గత మూడేళ్లలో వ్యవసాయ కార్మిక సంఘం తన శక్తి మేరకు పేదలను ఐక్యం చేస్తూ, సమస్యలపై పోరాటాలు నిర్వహించింది .

ఉద్యమాలు …

పదహారు రకాల సమస్యలపై రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఉద్యమాలు, ఆందోళనలు నిర్వహించాము. భూమి, ఇళ్ళ స్థలాలు, నిర్వాసితులు, ఉపాధి హామీ, సామాజిక సమస్యలు, వైద్య, కనీస వేతనాలపై, స్థానిక సమస్యలు, స్మశాన సమస్యలు, పామాయిల్‌ కార్మికుల సమస్యలు, కరువు, సంక్షేమ బోర్డు, వర్థంతి సభలు, భారత రాజ్యాంగ పరిరక్షణ, సంఘీభావ, అఖిల భారత సమ్మె కార్యక్రమాలు నిర్వహించాం. 19 జిల్లాల్లో 112 మండలాల్లో 123 కేంద్రాలలో 32,474 ఎకరాలలో భూ సంబంధిత పోరాటాల ద్వారా పేదలు కొన్ని ఫలితాలు సాధించుకున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో ఉద్యమాలు కొనసాగుతున్నాయి. భూపోరాటాలతో పాటు వివిధ 32 ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం సేకరిస్తున్న బలవంతపు భూసేకరణకు వ్యతరేకంగా రైతులు, వ్యవసాయ కార్మికులకు పునరావాసం కల్పించాలని 18 జిల్లాలో 55 మండలాల్లో 177 గ్రామాల్లో 1,02,077 ఎకరాలలో పోరాటాలు జరుగుతున్నాయి.

పేదల భూరక్షణ కోసం సాధించుకున్న అసైన్డ్‌ చట్టాన్ని గత వైసిపి ప్రభుత్వం భూస్వాములకు అనుకూలంగా సవరణలు చేసి సుమారు 7 లక్షల ఎకరాలకు పైగా అనర్హులకు కట్టబెట్టింది. భూచట్టాలను మార్చి తిరిగి 7 లక్షల ఎకరాలు పేదలకు పంచుతామని అధికారంలోకి వచ్చిన టిడిపి కూటమి ప్రభుత్వం దీనికి విరుద్ధంగా దళితులకు, పేదలకు తీవ్రమైన ద్రోహం చేసింది. పేదల భూములు తిరిగి ఇవ్వకపోగా అసైన్డ్‌ చట్టాన్ని మరింత నిర్వీర్యం చేసి దళితుల భూములను సోలార్‌ కంపెనీలకు కట్టబెట్టడానికి చట్ట సవరణ చేసింది. రాష్ట్రంలో విజన్‌ 2047, పి4 పేరుతో లక్షలాది ఎకరాల పేదల భూములను బలవంతంగా లాక్కొని కార్పొరేట్లకు అప్పగిస్తున్నారు. ప్రశ్నించిన పేదలను, ప్రజాసంఘాల కార్యకర్తలను, వామపక్ష కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం తీవ్రమైన నిర్బంధం ప్రయోగిస్తోంది. ఏ చిన్న కార్యక్రమం చేసినా బైండోవర్‌ కేసులు పెడుతున్నది. అక్రమ భూసేకరణకు అడ్డుగా నిలిచిన అనకాపల్లి జిల్లా నాయకుడు అప్పలరాజును పి.డి చట్టం కింద అరెస్టు చేసి నిర్బంధించింది. కడప జిల్లా నాయకుడు పోలయ్యపై రౌడీషీటర్‌ కేసు నమోదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 16 జిల్లాల్లో వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు 703 మందిపై 142 కేసులు పెట్టారు.

అభివృద్ధికి ఆమడ దూరంలో పల్లె జీవనం

అరవై శాతంగా ఉన్న గ్రామీణ ప్రజల జీవన విధానం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నట్లు పంచాయితీ అడ్వాన్స్‌మెంట్‌ ఇండెక్స్‌ నివేదిక వెల్లడించింది. కనీస వసతులకు నోచుకోని పేదలు గ్రామీణ ప్రాంతంలో 50 శాతం ఉన్నారని ఈ నివేదిక పేర్కొంది. ప్రధాని వికసిత్‌ భారత్‌, ముఖ్యమంత్రి స్వర్ణాంధ్రప్రదేశ్‌లో ఈ పేదలకు స్థానం లేదా? గ్రామాల పరిస్థితులను సర్వే చేసి ఏ ప్లస్‌, ఏ,బి,సి,డి గ్రేడ్లుగా కేటాయించారు. దేశమంతటా రెండున్నర లక్షలకు పైగా గ్రామ పంచాయతీల స్థితిగతులను విశ్లేషిస్తే ఒక్క పంచాయతీ కూడా ఏ ప్లస్‌ గ్రేడ్‌ సాధించలేకపోవడం వికసిత్‌ భారత్‌ డొల్లతనం స్పష్టమవుతుంది. రెండున్నర లక్షల పంచాయతీల్లో ఏ గ్రేడ్‌ సాధించినవి కేవలం 3635. అంటే 1.45 శాతం మాత్రమే. ఇందులో తెలంగాణ 624, ఎ.పి 591 గ్రామాలు మాత్రమే ఉన్నాయి. దేశవ్యాప్తంగా 1.23 లక్షల పంచాయతీలు సి గ్రేడ్‌కు పరిమితమైతే ఇంకా అద్వాన్నంగా మరో 13 వేల పంచాయతీలు అత్యంత దిగువన డి గ్రేడ్‌కు పరిమితమైనాయి. 19 శాతం ఇళ్ళకు కుళాయిలు లేవు. 30 శాతం గ్రామాలకు నడవడానికి సరైన దారి లేదు. 36 శాతం కుటుంబాలకు పారిశుధ్య వసతులు లేవు. 50 శాతం దళిత కుటుంబాలకు మరుగుదొడ్లు లేవు. 10 శాతానికి మించి గ్రామాలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేవు. కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో 80 శాతం వైద్యుల, పరికరాల కొరతతో కునారిల్లుతున్నాయి. వీటన్నిటికీ మించి సాగునీటి సౌకర్యం లేక గ్రామాలలో పనులు దొరకక పట్టణాలకు వలసలు పెరిగిపోతున్నాయని ఈ నివేదిక వెల్లడించింది.

ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో గ్రామీణ పేదలను సమీకరించడం, భూమి, ఇల్లు, ఉపాధి, నిర్వాసితుల హక్కులు, మౌలిక సౌకర్యాలు, స్మశాన స్థలాలు, ప్రభుత్వ విద్య, వైద్యం సాధించుకోవడానికి, సామాజిక వివక్ష, అణచివేత, మహిళలపై పెరుగుతున్న హింస, అత్యాచారాలకు వ్యతిరేకంగా ఎక్కడికక్కడ పోరాటాలను నిర్మించడం నేటి తక్షణ కర్తవ్యం. వివిధ వృత్తుల్లో వున్న పేదలందరినీ ఐక్యం చేయడం, మత సామరస్యాన్ని కాపాడుకోవడం, వికృత వ్యాపార సంస్కృతిని ఎదుర్కోవడం కోసం పండుగలు, ఉత్సవాలు, తిరుణాల లాంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొని ప్రజా సంస్కృతిని రక్షించుకోవాలి. అలాగే గ్రామీణ పెత్తందారుల, ధనిక వర్గాల దౌర్జన్యాలను ఎదుర్కొని నిలబడేలా స్థానిక నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం ఈ మహాసభ ముందున్న కర్తవ్యాలు. వీటి అమలుకు నిర్దిష్ట కార్యాచరణ రూపొందించుకునేందుకు వ్యవసాయ కార్మిక సంఘం ముప్పయ్యవ రాష్ట్ర మహాసభ జరుగుతున్నది.

-వ్యాసకర్త: వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్