ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఇటీవల ప్రతిపాదిత గ్రేట్ నికోబార్ ప్రాజెక్టును సందర్శించి 'ఇదో పెద్ద కుంభకోణం. గిరిజన వారసత్వానికి, ప్రకృతికి వ్యతిరేకంగా చేపడుతున్న నేరం’ అని విమర్శించడంతో మరలా ఈ ప్రాజెక్టు వార్తలకెక్కింది. సహజంగానే మోడీ ప్రభుత్వం తనకు అలవాటైన రీతిలో 'వ్యూహాత్మక జాతీయ భద్రతను, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టును చేపడుతున్నామని చెప్పుకొచ్చింది. సదరు ప్రాజెక్టు పత్రికల పతాక శీర్షికలలో ఇవాళ మెరిసి రేపు మాసిపోవచ్చు. కానీ దీని మూలంగా సంభవించే పర్యావరణ విధ్వంసం మీద ప్రజాక్షేత్రంలో మరోసారి చర్చ మొదలైంది.
ప్రాజెక్టు వివరాలు...
మలక్కా జలసంధికి అనుసంధానంగా తూర్పు - పడమరల దిక్కుగా రవాణా నౌకాయానం పెంపొందించడానికి అనువుగా గ్రేట్ నికోబార్ దీవి దాపున ఉన్న గలాతియా పాయ దగ్గర ట్రాన్షిప్‌మెంట్ ఓడరేవు నిర్మాణం, ప్రస్తుతం 8000 మంది జనాభా నివసిస్తున్న ప్రాంతాన్ని మూడున్నర లక్షల మంది నివసించేందుకు అనువుగా ఒక టౌన్‌షిప్‌గా మలచడం, ఏటా పది లక్షల మంది ప్రయాణీకులు రాకపోకలు సాగించేందుకు అనువుగా గ్రీన్‌ఫీల్ట్ అంతర్జాతీయ విమాన్రాశయ నిర్మాణం, ఓడల నిర్మాణం - మరమ్మతుల కేంద్రం నెలకొల్పడం, పర్యాటకానికి అనువుగా మౌలిక వసతులు కల్పించడం - ఇవన్నీ గ్రేట్ నికోబార్ ప్రాజెక్టులో భాగం. ఇందుకు రూ.81,000 కోట్ల నుండి రూ. లక్ష కోట్ల వరకు ఖర్చు అవుతుందని ప్రాథమిక అంచనా.
దీనికన్నా ముందు అండమాన్ నికోబార్, లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతాల్లో చెరొక ఐదు దీవులలో పర్యావరణహిత పర్యాటక ప్రాజెక్టులు చేపట్టాలని 2019 లోనే నీతి ఆయోగ్ ప్రతిపాదించింది. అయితే కార్పొరేట్ వర్గాల నుండి ఆశించిన స్పందన లేకపోవడంతో ట్రాన్షిప్‌మెంట్ ఓడరేవు ప్రతిపాదన తెర మీదకు వచ్చింది.
గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ( జి.యన్.ఐ ) చేపట్టబోయే దీవి మొత్తం వైశాల్యం 960 చదరపు కిలోమీటర్లు. కాగా, ఇందులో 166 చదరపు కిలో మీటర్లను అందునా 130 చదరపు కిలోమీటర్ల దట్టమైన అటవీ ప్రాంతాన్ని పూర్తిగా ధ్వంసం చేసి మరీ చేపట్టనున్నారు. ఈ ప్రాంతంలో షోంపెన్ తెగ గిరిజనులు నివసిస్తున్నారు.
ఈ ప్రాజెక్టు నిర్మాణం మూలంగా జరగనున్న పర్యావరణ విధ్వంసం గురించి హిందూ దిన ప్రతిక, ఫ్రంట్‌లైన్ మ్యాగజైన్, సామాజిక మాధ్యమాల్లో విరివిగా వ్యాసాలు వెలువడ్డాయి. ఈ పరిణామాలను మొదటి నుండి పరిశీలిస్తూ వచ్చిన పంకజ్ సెక్షారియా ఒక పుస్తకం కూడా వెలువరించారు. పీపుల్స్ సైన్స్ ఫోరమ్, వామపక్ష పార్టీలు, ఇతర అనేక పౌర సంస్థలు ఈ ప్రాజెక్టుపై నెలకొని ఉన్న త్రీవ అభ్యంతరాలను ఎప్పటికప్పుడు వెలువరిస్తూనే ఉన్నాయి.
బిజెపి ప్రభుత్వం ఈ అభ్యంతరాలను, విమర్శలను ఖాతరు చెయ్యకపోవడమే కాకుండా ఈ ప్రాజెక్టు అనుమతుల కోసం ఆయా నియంత్రణా సంస్థల మీద ఒత్తిడి తీసుకొచ్చింది. ఈ ప్రాజెక్టు మూలంగా జరిగే పర్యావరణ విధ్వంసాన్ని తక్కువ చేసి చూపిస్తూ ప్రజలను పక్కదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నది. వ్యూహాత్మక జాతీయ భద్రతా కారణాల సాకుతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సదరు అభ్యంతరాలను కొట్టిపారేసింది. తాజాగా కలకత్తా హైకోర్టు ఈ ప్రాజెక్టుపై ప్రజాహిత వ్యాజ్యాన్ని స్వీకరించింది.
పర్యావరణ విధ్వంసం
సదరు ప్రాజెక్టు చేపట్టబోయే ద్వీపం సహా చుట్టు పక్కల ఉండే సమ్రుదతలం సహా మొత్తం 1037 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని నికోబార్ జీవావరణ రిజర్వు ప్రాంతంగా యునెస్కో గుర్తించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా 130 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలోని 8.65 లక్షల చెట్లను నరికి వేస్తారు. అయితే ఈ సంఖ్య 9.64 లక్షలని తాజాగా అంచనా వేశారు. కేంద్ర ప్రభుత్వం ఇందులో సగం ప్రాంతం అంటే 6500 హెక్టార్లలో మాత్రమే చెట్ల నరికివేత చేపడుతున్నామని బుకాయిస్తోంది. అండమాన్ నికోబార్ దీవుల గణాంకాల ఆధారంగా ప్రతిపాదిత ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా హీన పక్షంగా 32 లక్షల నుండి 58 లక్షల చెట్లు నరికివెయ్యబడతాయని శాస్త్రవేత్తలు లెక్కకట్టారు. అయితే ఈ లెక్కలను మోడీ ప్రభుత్వం తోసిపుచ్చుతున్నది. వాస్తవానికి ప్రభుత్వం దగ్గరా ఈ లెక్కలు లేవు. చెట్ల నరికివేత టెండర్‌లో భాగంగా చెట్ల లెక్కింపు ముందుగా చేపట్టాలనే నిబంధన చేర్చడమే ఇందుకు ప్రబల సాక్ష్యం. ఇందుకు ప్రతిగా ఉష్ణ మండల ప్రాంతమైన హర్యానాలో 97.3 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో ‘తల్లి పేరిట ఒక మొక్క’ పథకం పేరిట కొత్తగా అటవీప్రాంతం నెలకొల్పుతున్నామని సమర్ధించుకో చూడడం ఎంతటి హాస్యాస్పదమో మీరే గుర్తించండి.
వన్యప్రాణి జీవనానికి ప్రమాదం
ప్రతిపాదిత ప్రాజెక్టు ప్రాంతంలో నివసిస్తున్న అరుదైన జాతులకు చెందిన అనేక వన్యప్రాణుల జీవనం ప్రమాదంలో పడనున్నదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తునారు. చిత్తడి నేలలో నివసించే క్షీరదాలకూ నష్టమేనని వివరిస్తున్నారు. గలాతియా పాయ దగ్గర 1997లో ఏర్పాటు చేసిన వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని కేంద్ర పర్యావరణ, వాతావరణ మంత్రిత్వ శాఖ ప్రముఖ తాబేళ్ళ కేంద్రంగా గుర్తించింది. విషాదం ఏమిటంటే తాజాగా నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డు లైఫ్ దీన్ని డీ-నోటిఫై చేసింది. కేవలం మోడీ ప్రభుత్యం తలపెట్టిన ప్రాజెక్ట్ కు ఆటంకం కాగూడదనే ఈ దుర్మార్గానికి పాల్పడింది.
పర్యావరణ అనుమతులు సాధించడం కోసం మోడీ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రత్యామ్నాయాలు వన్యప్రాణి జీవనానికి గానీ అరుదైన క్షీరద ప్రాణులకు గానీ ఎలాంటి రక్షణా కల్పించలేవు.
ప్రతిపాదిత ప్రాజెక్టు నిర్మాణం కావించనున్న దీవి మొత్తం పగడపు దిబ్బలతో అలరారుతున్నది. వీటిని చుట్టు పక్కల దీవులకు తరలిస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పుకొస్తున్నది. కానీ ఇది ఆచరణ సాధ్యమయ్యేపని కాదని, స్వాభావికంగా ఏర్పడిన పగడపు దిబ్బలను మరోచోట అంటు కట్టడం సాధ్యం కాదని నిపుణులు వివరిస్తున్నారు. ఈ స్వాభావిక పగడపు దిబ్బల కారణంగానే ఈ దీవులు తీరప్రాంత నియంత్రణ జోన్ 1ఎ క్యాటగిరీ కిందకు వచ్చాయి. ఈ క్యాటగిరీ కిందకు వచ్చిన ప్రాంతంలో కనీసం అభివృద్ధి పనులు చేపట్టడానికి నిబంధనల ప్రకారం అనుమతులు రావడమే కష్టం. అలాంటిది మోడీ ప్రభుత్వం ఏకంగా ఓడరేవు నిర్మాణానికే అనుమతులు ఇచ్చేసింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంశాల్ని పరిగణనలోకి తీసుకోకుండా పర్యావరణ విఘాతానికి పాల్పడింది.
గిరిజన తెగలు
ఈ దీవులలో 1960 నాటి కన్నా ముందు నికోబార్, షోంపెన్ తెగ గిరిజనులు మాత్రమే నివసించేవారు. ఇందులో షోంపెన్ ఆదిమ తెగ ప్రజానీకం వేట మీద ఆధారపడి జీవించే వారు. నికోబార్ తెగ గిరిజనుల సాయంతో క్యాంప్ బెల్ బే ప్రాంతంలో సైన్యం నుండి రిటైరయిన కొన్ని కుటుంబాలు ఆవాసం ఏర్పాటు చేసుకున్నాయి. 2004లో సంభవించిన సునామీలో పై రెండు తెగల ప్రజానీకంలో అత్యధికులు మరణించారు. మిగిలినవారు ప్రస్తుతం క్యాంప్ బెల్ బే సమీపంలో ఏర్పాటు చేసిన సెటిల్మెంట్ కాలనీలో నివసిస్తున్నారు. అటవీ ప్రాంతంలో ఉన్న తమ పూర్వ నివాస ప్రాంతాలకు వెళ్ళనివ్వాల్సిందిగా కోరుతూ వీరు పెట్టుకున్న అర్జీలను అధికార యంత్రాంగం తోసిపుచ్చుతూ వస్తున్నది. తద్వారా వీరికి జీవనాధారాన్ని నిరాకరిస్తున్నది. ప్రస్తుతం కేంద్ర పభుత్వం చేపట్టబోయే ప్రాజెక్టు మూలంగా ఈ తెగల గిరిజనులు శాశ్వత నిర్వాసితులుగా మిగిలిపోనున్నారు. ఆదిమ తెగ గిరిజనులు, అండమాన్-నికోబార్ దీవుల ప్రత్యేక చట్టాలను అనుసరించి వీరికి ఉన్న రక్షణను ప్రభుత్వం నిరాకరిస్తున్నది. ప్రస్తుతం జీవనాధారంగా ఉన్న కొబ్బరి తోటల పెంపకం ప్రాంతాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం జి. యన్.ఐ ప్రాజెక్ట్ పేరిట ధ్వంసం చేయబోతున్నది. కేంద్ర గిరిజన మంత్రిత్వశాఖ మొదట ఇందుకు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కానీ ఇప్పుడు మౌనం వహిస్తున్నది. ఇన్ని సమస్యలున్నా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సదరు ప్రాజెక్టుకు ఎలా అనుమతులు ఇచ్చిందనేది అంతుబట్టని రహస్యంగా మిగిలిపోయింది.
పారదర్శకత లోపం
వ్యూహాత్మక జాతీయ భద్రతా అవసరాల రీత్యా ఇక్కడ ట్రాన్షిప్‌మెంట్ ఓడరేవు నిర్మిస్తున్నామన్న సాకుతో కేంద్ర ప్రభుత్వం పౌర సమాజం అడిగిన సమాచారం ఇవ్వకుండా తొక్కిపెడుతున్నది.
ట్రాన్షిప్‌మెంట్ వ్యయం పేరిట ఏటా 200 మిలియన్ల డాలర్లు ఖర్చు చెయ్యాల్సి వస్తుంది. ఈ భారాన్ని వదిలించుకోవడానికే కేరళంలో విజింఝాం రేవు నిర్మాణం, కొచ్చి లోని వల్లరపాదమ్ టెర్మినల్ ను అభివృద్ధి చేస్తున్నామనీ ఆ వరుస లోనే జి.యన్.ఐ ప్రాజెక్ట్ చేపట్టామని మోడీ ప్రభుత్వం సమర్థించుకోవాలని చూస్తున్నది. అయితే ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలకు సంబంధించి ఎలాంటి వివరాలూ ఇవ్వడానికి సిద్ధపడడం లేదు. పారిశ్రామికంగా గానీ, వాణిజ్యపరంగా గానీ గణనీయమైన ఎలాంటి అవకాశాలూ లేని నికోబార్ దీవులలో చేపట్టే ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలు ఎప్పటికీ ప్రశార్థకంగా మిగిలి పోవాల్సిందేనా!
హిందూ మహాసముద్రంలో చైనా ఆధిపత్యం నిలవరించడానికి, ఆత్మరక్షణకు ఈ ప్రాజెక్టు అవసరమని మోడీ ప్రభుత్వం మరో ప్రచారం లంకించుకున్నది. కానీ ఇప్పటికే ఈ దీవులలో తగినంత స్థాయిలో మన సైన్యం, సైనిక స్థావరాలు మోహరించి ఉన్నాయి. సైనిక విమానాశ్రయమూ ఉన్నది. కావాలంటే దీనిని విస్తరించుకోవచ్చు. లేదూ 50 హెక్టార్లల్లో ఐ.యన్.యస్ బాజ్` నౌకాదళ స్థావరం ఏర్పాటు చేసుకున్నట్లు మరో స్థావరం ఏర్పాటు చేసుకోవచ్చు.
కానీ మోడీ ప్రభుత్వం 'రక్షణ`, ‘భద్రత`,` జాతీయ ప్రయోజనాలు` పేరిట భారీ పర్యావరణ విధ్వంసాన్ని సమర్థించుకో చూస్తున్నది. ఈ ప్రాజెక్టును విమర్శించేవారిపై రేపో మాపో ‘దేశ ద్రోహులు’ అనే ప్రచారం లంకించుకున్నా మనం ఆశ్చర్యపోనక్కరలేదు.
రఘు









కామెంట్‌లు (0)