test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ట్రంప్‌ రూటే వేరు!

28 మే, 2026

trump
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 28, 2026, 07:15 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

విషయం ఏదైనా వెరైటీ రూట్‌ ట్రంప్‌ది. దాన్ని విపరీతం, విడ్డూరం ఏదైనా అనండి. ఈ సంగతి ప్రపంచమంతటికీ తెలుసు. కానైతే అదేదో అంతర్జాతీయ రాజకీయాలు ఆర్థిక వ్యాపార విషయాల వరకూ పరిమితం కాదట. స్వంత బాడీ విషయంలోనూ అంటే శరీర శాస్త్రంలోనూ అధ్యక్ష మహోదయులు అదే చేస్తారట. ప్రపంచంలోనే శక్తివంతమైందిగా చెప్పబడే అమెరికా అధ్యక్ష పీఠాధిపతి కోసం వాల్టర్‌ రీడ్‌ సైనిక వైద్య సహాయ కేంద్రం అంటూ ఒకటి వుంది. ఇక్కడే ఏటా ఓ సారి అధ్యక్షులవారు వైద్య చికిత్సలు, పరీక్షలు చేయించుకుంటారు. గుండె, ఊపిరితిత్తులు, దంత పరీక్షలు ఒకటేంటి టోటల్‌ బాడీ చెకప్‌ చేయించేసుకున్నాక మన ప్రెసిడెండ్‌ గారి దివ్య శరీరం గొప్పగా వుందని ప్రకటన వస్తుందట. అయితే ఏడాదికోసారి జరిగే ఈ తతంగం ట్రంప్‌ మలి దఫా పాలనలో ఒకటికి రెండు సార్లు జరగడమే మీడియాను ఆకర్షించింది. జూన్‌ 14 నాటికి ట్రంపేశ్వరుడు 80వ బర్త్‌డేకు రెడీ అయిపోతున్నారు. ఈయన రెండు దఫాల పాలన మధ్యలో వచ్చిపోయిన జో బైడెన్‌ మతిమరుపు, నిద్ర పోవడం వంటి వృద్ధాప్య లక్షణాలతో దొరికిపోవడమే కాదు, అభ్యర్థిత్వాన్ని కూడా అర్ధంతరంగా మార్చేయడం చూశాం. అరుదైన రీతిలో ట్రంప్‌ మరోసారి పదవి దక్కించుకు న్నారు. కానీ ఇప్పుడు ఆయనపై బైడెన్‌ కాలపు చూపులు తప్పడం లేదు. ఆ వయస్సుకు ఆయన హుషారుగా వుండటమేగాక దాన్ని ప్రదర్శించు కోవడానికి చాలా చిట్కాలకు పాల్పడుతుంటారు. ఆయన భేషుగ్గా వున్నారని వైట్‌హౌస్‌ ప్రకటిస్తుంటుంది. అయితే సైనిక చికిత్సా కేంద్రానికి మాత్రం ఏడాదికి రెండు మూడు సార్లు వార్షిక పరీక్షల పేరిట రావడమే సందేహాలు పెంచుతున్నా సమ్‌థింగ్‌ స్పెషల్‌ లాంటి 80వ పుట్టిన రోజుకు ఏ ప్రకటన వస్తుందోనని చూస్తున్నారు అమెరికన్లు. మీడియన్లు.

అమిత్‌ షానే అంటారా?

రాజును మించిన రాజభక్తి అంటూ ఒకటుంటుంది. ఈ మధ్య జనసేనాని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ రాజమండ్రిలో తమ పార్టీ వారితో అన్న మాటలు అదే గుర్తు చేస్తాయి. తనకూ, నాదెండ్ల మనోహర్‌కూ అమిత్‌షాతో జరిగిన చర్చలపై ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ చేసిన వ్యాఖ్యలకు ఆయన ఆగ్రహించడం, ఆ పార్టీవారు కేసులు పెట్టించడం తెలిసిందే. ఉపసంహరించు కున్నాక కేసులేంటని అందరూ ఖండించారు కూడా. అయితే పవన్‌ మాత్రం తనకు అంత కోపం ఎందుకు వచ్చిందో స్వయంగా వివరించారు. సర్దార్‌ పటేల్‌ తర్వాత అంత గొప్పవాడైన హోంమంత్రి అమిత్‌ షాను అనడమే తన కోపానికి కారణమైందట. అమిత్‌ షాపై రాజకీయంగా పాలనా పరంగా ఎన్నో విమర్శలున్నాయి. వుంటాయి కూడా.
తనకు షా పై భక్తి వుంటే వుండొచ్చుగాని మరెవరూ ఆయనపై ఎలాంటి ప్రతికూల వ్యాఖ్యలు చేస్తే కేసులు పెట్టిస్తానంటే ఎలా కుదురుతుంది? ఆ మాటకొస్తే స్వయంగా తన అన్నగారైన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో కలిపేశారని పవన్‌ ఎన్నిసార్లు ఆగ్రహించలేదు? ఎ.పి కి ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీ అంటూ ఇవ్వడం పాచిపోయిన లడ్డూ అని నిప్పులు చెరగలేదా? లౌకికవాదులందరినీ తిట్టిపోయ లేదా? ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయాలు వారికి వుంటాయి గాని అమిత్‌ షా గురించి ఎవరూ విమర్శనాత్మక వ్యాఖ్యలే చేయకూడదంటే ఎలా కుదురుతుంది? గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఆ నీటిని పరిశీలించిన ఉపముఖ్యమంత్రి వీటిలో స్నానం చేస్తే పుణ్యం కాదు రోగాలొస్తాయని అధికారులపై స్థానిక మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మాట మరెవరైనా అంటే సనాతనులు ఊరుకుంటారా? జై అమరావతి కాదు, జై ఆంధ్ర అనండని ఈ మధ్యనే మరో మాట చెప్పారు.
ఆ మాట మరెవరైనా అంటే కూటమి పెద్దలు సహించేవారా? కనుక రాజకీయాలలో, ప్రజా జీవితంలో ఎవరి కోణాలు వారికి వుంటాయి. భావాల, విధానాల ఘర్షణ వుంటుంది. ఫలానా సమాచారం తప్పు అని చెప్పడం వేరు, అసలు అంతటివారిని అనడమే అపరాధమైనట్టు ఆవేశపడిపోవడం వేరు కదా?

అమీర్‌ ఖాన్‌ మరో కానుక

విభిన్న చిత్రాలు, చరిత్ర చిత్రాలలో నటించడం నిర్మించడం అమీర్‌ ఖాన్‌ ప్రత్యేకత. ఆయన లగాన్‌, తారే జమీన్‌ పర్‌, దంగల్‌ వంటివి ఎవరూ మర్చిపోరు. ఇటీవల ఆయన కొంత విరామం తీసుకున్నారు. తాజగా అమీరుడు మరో ఆసక్తికరమైన బయో పిక్‌లో కనిపిస్తారట. తొలి భారతీయ క్రికెట్‌ వీరుడు లాలా అమర్‌నాథ్‌ బయో పిక్‌ నిర్మాణంతో పాటు టైటిల్‌ పాత్ర పోషిస్తారట. అమర్‌నాథ్‌ 1933 లోనే భారత క్రికెట్‌ చరిత్రలో తొలి సెంచరీ కొట్టి సంచలనం సృష్టించారు. తర్వాత ఆ ఆట బాగా వ్యాపించడానికి కారకుల య్యారు. అందుకే ఆయనను క్రికెట్‌ ధృవతారగా చూస్తుంటారు. అమీర్‌ ఖాన్‌ వంటి విలక్షణ నటుడు ఈ పాత్ర ధరిస్తారంటే ఆసక్తి మరింత పెరుగుతుంది. పైగా లగాన్‌తో నాడు సంచలనం సృష్టించిన దర్శకుడు అశుతోష్‌ గోవార్కర్‌ దీనికీ నిర్దేశకుడు కావడం మరో విశేషం. ఈ చరిత్ర కథనాన్ని నేటి వాతావరణానికి తగినట్టు దీనికి రాజకీయాలు జోడించి దేశ విభజనతో ముడి పెట్టాలని చూస్తున్నారు. ఏమంటే 1952లో భారత పాకిస్తాన్‌ తొలి మ్యాచ్‌కు మన జట్టు కెప్టెన్‌ లాలా అమర్‌నాథే.

నేనె విజయుండను, నేనె చెలికాడను..

ఈ గోసాయి వేషాలు నీ కోసమే… అని పాడతారు అర్జున పాత్రధారి ఎన్టీఆర్‌ బభ్రూవాహన చిత్రంలో. నిలునిలుమా .. పాటలో. ఇప్పుడు తమిళనాడులో ముఖ్యమంత్రి విజయ్‌ కూడా ఆ పాటే పాడుతున్నాడు. అనూహ్యంగా విజయం సాధించిన ఆయన ఆటంకాలు దాటేసి ముఖ్యమంత్రి పీఠంపై కుదురుకున్నారు. కమ్యూనిస్టులతో సహా వివిధ పార్టీల మద్దతు మాత్రమేగాక అన్నా డిఎంకెలో సగానికి పైగా చీలి ఆయనకు మద్దతు తెల్పడంతో గొప్ప ఆధిక్యతతో బయిటపడ్డారు. అయితే వారిని మంత్రివర్గంలో చేర్చుకుని ఫిరాయింపులను ప్రోత్సహిస్తే ఊరుకోబోమని సిపిఎం హెచ్చరిక చేయడంతో ఆ ఆలోచన విరమించుకోక తప్పలేదు. దాంతో ఒకప్పటి కర్ణాటకలో ఎడ్యూరప్ప ఫార్ములా తీసుకుని నలుగురితో రాజీనామా చేయించారు. ఇంకా చాలా మంది రాజీనామా చేయడానికి సిద్ధంగా వున్నారట. ఉప ఎన్నికలలో ఎలాగూ తమ అధికార పక్షమే గెలుస్తుందని విజయ్‌ ధీమా. అదేగాక వేషధారణలోనూ కొత్త తరహా కోటుతో ట్రెండ్‌ తెచ్చారని మీడియా చెబుతున్నది. మహిళలకు, యువతకు సంబంధించిన పథకాలకు తొలి పీట వేశారు. అనుకున్న దానికన్నా విజయ్‌ బుద్ధిశాలి అని విమర్శకులు అంటుంటే కూలిపోవడం తథ్యం అని రెండు డిఎంకెలు శాపనార్థాలు పెడుతున్నాయి. ఈ మధ్యలో ఆయన ఢిల్లీ బయిలుదేరారు.. నేనే విజయుండను అంటూ. చూడాలి ఇక విధానాలు ఎలా నడిపిస్తారో.

-పీపీ

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్