న్యూఢిల్లీ : దేశ సరిహద్దు జిల్లాల్లో జనాభా మార్పులపై సమగ్ర అధ్యయనం చేయాలని ‘ఉన్నత స్థాయి కమిటీ’ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం ఆదేశించారు. శనివారం జనాభా మార్పు ఉన్నత స్థాయి కమిటీ సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ, సరిహద్దు ప్రాంతాల్లో, మెట్రో నగరాల్లో, పారిశ్రామిక పట్టణాల్లో పర్యటించాలని కమిటీని కోరారు. అక్రమ చొరబాట్లు, ఇతర అసహజ కారణాల వల్ల ఆయా ప్రాంతాల్లో వచ్చిన మార్పులను గురించి అంచనా వేయాలని కోరారు. అయితే గత నెలలో అక్రమ చొరబాట్లు, ఇతర అసహజ కారణాలతో దేశవ్యాప్తంగా జనాభాలో వచ్చిన మార్పులు గురించి అంచనా వేసి, ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలను సూచించేందుకు హోం శాఖ(ఎంహెచ్‌ఎ) నోటిఫికేషన్ ద్వారా ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నవ్‌లేకర్ నేతృత్వంలోని ఈ కమిటీలో జనాభా కమిషనర్‌తో పాటూ రిటైర్డ్ ఐఎఎస్ అధికారి దుర్గా శంకర్ మిశ్రా, మాజీ ఐపిఎస్ అధికారి బాలాజీ శ్రీవాత్సవ, డాక్టర్ షామిక రవి సభ్యులుగా వుంటారు. కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరీ (ఫారినర్స్-1) ఈ కమిటీలో సభ్య కార్యదర్శిగా వుంటారు. అయితే గత నెల్లో ఈ కమిటీ ఏర్పాటును ప్రకటిస్తూ షా, జనాభా మార్పులు అనేది చాలా తీవ్రమైన అంశమని, ఇది దేశ సార్వభౌమత్వానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదని, దేశ రక్షణకు, శాంతి భద్రతలకు కూడా సంబంధించిన అంశమని చెప్పారు. అలాగే దేశంలో నివసిస్తున్న అక్రమ వలసదారులను గుర్తించడం, నిర్బంధించడం, బహిష్కరించడం కోసం ఒక క్రమబద్ధమైన, శాశ్వత యంత్రాంగాన్ని ప్రతిపాదించడం ఈ కమిటీ కీలక బాధ్యతలలో ఒకటని తెలుస్తోంది. ముఖ్యంగా సున్నితమైన సరిహద్దు ప్రాంతాలు, గణనీయమైన జనాభా మార్పులు చోటుచేసుకుంటున్న ప్రాంతాలు, వలసలు అధికంగా ఉన్న ప్రాంతాలే లక్ష్యంగా ఈ కమిటీ పని చేయనుంది. అయితే ఈ కమిటీ చట్టబద్ధత, నిష్పక్షత గురించి పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎస్‌ఐఆర్‌ను ఉపయోగించి ఇటీవల జరిగిన ఎన్నికల్లో అనేక మంది ఓట్లను తొలగించిన సంగతి తెలిసిందే. అయితే కొత్తగా ఏర్పాటు చేసిన కమిటీ కూడా సిఫార్సుల పేరుతో వ్యతిరేకుల పౌరసత్వాన్ని, సంక్షేమాన్ని రద్దు చేస్తారనే అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు.
ఎదురయ్యే సవాళ్లు
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ అధ్యయనం ప్రధానంగా 'అక్రమ చొరబాట్లు', 'అసహజ జనాభా మార్పుల'ను గుర్తించడం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఈ ప్రక్రియలో మైనార్టీలు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అక్రమ వలసదారులను గుర్తించే క్రమంలో, తరతరాలుగా ఇక్కడే నివసిస్తున్న వారు కూడా తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సిన ఒత్తిడికి లోనయ్యే ప్రమాదం ఉంది. పాత పత్రాలు లేని పక్షంలో వారు వేధింపులకు గురయ్యే అవకాశం ఉంటుంది. అలాగే "అసహజ జనాభా మార్పులు" పేరుతో ఒక మతానికి చెందిన వారిని లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. ఇది సమాజంలో మైనార్టీల పట్ల అనుమానాలను పెంచి, సామాజిక ఐక్యతను దెబ్బతీసే ప్రమాదమూ లేకపోలేదు. ఇప్పటికే 'ఎస్‌ఐఆర్'ను ఉపయోగించి ఓట్ల తొలగింపు జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే గిరిజన ప్రాంతాల్లో జనాభా మార్పుల అధ్యయనం పేరుతో వారి ప్రత్యేక సామాజిక వ్యవస్థల్లో బయటి వ్యక్తుల జోక్యం పెరగవచ్చు. సరిహద్దు ప్రాంతాల్లో అనేక గిరిజన తెగలకు సరైన గుర్తింపు కార్డులు లేదా పత్రాలు ఉండవు. అధ్యయనం పేరుతో పత్రాల కోసం ఒత్తిడి చేస్తే, వారు అక్రమ వలసదారులుగా ముద్ర వేసే ప్రమాదమూ లేకపోలేదు. ఈ కమిటీ పర్యటనలు, అధ్యయనాల వల్ల సాధారణ పౌరులు కూడా అనుమానితులుగా చూడబడే అవకాశం ఉంది. దీంతో చిన్న పొరపాటు జరిగినా పౌరసత్వం పోతుందనే భయం వారిని వెంటాడుతుంది. దేశ భద్రత కోసం చొరబాట్లను అరికట్టడం అవసరమే అయినప్పటికీ, ఆ ప్రక్రియలో నిజమైన భారతీయులు బలి కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ కమిటీ నిష్పక్షపాతంగా వ్యవహరించకపోతే, అది దేశంలోని మైనారిటీలు, గిరిజనులు, వెనుకబడిన వర్గాల హక్కులకు తీరని నష్టం కలిగే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.









కామెంట్‌లు (0)