mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ముడి సరుకు భారమే 'ఉక్కు'ను ముంచేస్తోంది

5 రోజుల క్రితం

visakha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 14, 2026, 12:44 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

  • ఆర్‌ఐఎన్‌ఎల్‌ ‌తాజా నివేదికలో వెల్లడి

  • లాభాల్లోకి తెచ్చామని ‘కూటమి’ అవాస్తవ ప్రచారం

ప్రజాశక్తి- గ్రేటర్ విశాఖ బ్యూరో : విశాఖ ఉక్కుపై ముడి సరుకుల కొనుగోళ్ల భారం భారీగా పడుతోంది. ఇది కూడా ప్లాంట్ నష్టాలకు ఓ ప్రధాన కారణం. అయినా, పాలకులు సొంత గనుల కేటాయింపు విషయమై నోరు మెదపడం లేదు. ‘నేతి బీరకాయలో నేయి చందం’గా విశాఖ ఉక్కుపై రాష్ట్రంలోని టిడిపి కూటమి పార్టీల ప్రచార తీరు ఉంది. తాము అధికారంలోకి వచ్చాక విశాఖ ఉక్కును నష్టాల నుంచి రూ.50 కోట్ల లాభాల్లోకి తెచ్చామంటూ ఆ పార్టీల నేతలు చేస్తున్న ప్రచారం ఉత్తిదేనని వాస్తవాలు పట్టిచూపుతున్నాయి. 2025-26 మార్చి నాటికి ఆర్‌ఐఎన్‌ఎల్‌ అధికారిక నివేదిక ప్రకారమే రూ.1,800 కోట్ల మేర స్టీల్‌‌ప్లాంట్‌‌కు నష్టం వాటిల్లింది. స్టీల్ ప్లాంట్ కు 30 ఏళ్లుగా ఎన్ఎండిసి ఇనుప ఖనిజాన్ని సరఫరా చేస్తోంది. ఆ ఖనిజాన్ని మిట్టల్ ప్రయివేటు స్టీల్ ప్లాంట్ కు సరఫరా చేయాలని కేంద్రంలోని మోడీ సర్కారు 2025లో ఆదేశించింది. దీంతో, ముడి సరుకు కొరత వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను రానున్న కాలంలో మరింత వేధించనుంది. ఇప్పటికే టన్ను ఇనుప ఖనిజం కొనుగోలుపై రూ.5 వేలను అదనంగా ప్లాంట్ ఖర్చు పెట్టాల్సి వస్తోంది. మరోపక్క టోటల్‌ ‌మెయింటెనెన్స్‌ ‌కాంట్రాక్టు (టిఎంసి)కు 2,025లో ప్లాంట్ లోని కొన్ని విభాగాలను అప్పగించారు. ఈ టిఎంసి విధానం రాకముందు ప్లాంట్‌‌లోనే కోక్‌ ‌తయారయ్యేంది. టన్నుకు రూ.22 వేలు ఖర్చయ్యేది. ఇప్పుడు బయట నుంచి కొనడంతో రూ.30 వేలు అవుతోంది. ఫలితంగా టన్నుకు రూ.8 వేల అదనపు భారాన్ని ప్లాంట్ భరించాల్సి వస్తోంది.

అక్రమాలకు నిలయం టిఎంసి!
బయట నుంచి కోక్‌ ‌కొనుగోలు చేసే అవకాశం ఇచ్చిన నాటినుంచి ప్లాంట్‌‌లో అక్రమాలకు కాంట్రాక్టర్లు పాల్పడుతున్నారు. నాసిరకం కోక్‌‌ను ప్లాంట్‌‌ లోకి తీసుకొస్తున్న క్రమంలో కార్మికులు అడ్డుపడిన ఘటనలు ఉన్నాయి. పోరాటాలు జరిగాయి. నాసిరకం కొనుగోళ్ల విషయంలో అప్పటి ప్లాంట్ సిఎండి అతుల్ బట్ ను తొలగించారు. రూ.వందల కోట్లు అక్రమాలు కోక్ కొనుగోలులో జరిగాయని కార్మికులు చెబుతున్నారు. పెల్లెట్స్‌ ‌ఖర్చు కూడా అధికంగానే ఉంటోంది. ప్లాంట్‌‌లోని సింటర్‌ ‌ప్లాంట్‌ ‌ఉత్పత్తి పడిపోయింది. దీంతో, బయట నుంచి పెల్లెట్స్‌ ‌కొంటున్నారు. సింటర్‌‌ ప్లాంట్‌లోనే తయారు చేస్తే టన్నుకు రూ.8 వేలు అవుతుం‌ది. బయట నుంచి రూ.12 వేలకు కొనడంతో టన్ను ఒక్కంటికీ అదనంగా రూ.4 వేలు భారం పడుతుండడం ప్లాంట్‌‌ను ఆర్థికంగా కృంగదీసింది. టన్ను ఇనుప ఖనిజంపై అదనంగా రూ.5 వేలు, కోక్‌‌పై రూ.8 వేలు, పెల్లెట్స్‌‌పై రూ.4 వేలు చొప్పున అదనపు ఖర్చు అవుతోంది. ఇవన్నీ ప్లాంట్ నష్టాలకు దారి తీస్తున్నాయి. ​ ప్లాంట్‌‌లో సుమారు 10 లక్షల నుంచి 12 లక్షల టన్నుల స్టీల్‌ ‌నిల్వలు ప్లాంట్‌‌లో అమ్ముడుపోని ఉక్కు (అన్‌ ‌ఫినిష్డ్‌ ‌స్టీల్‌) నిల్వలు ఐదు నెలలుగా పది లక్షల నుంచి 12 లక్షల టన్నులు ఉన్నాయి. ఇవి పూర్తి స్థాయి ఉక్కుగా మారి మార్కెట్లోకి వెళ్తే లాభాలు వస్తాయి. కానీ, అలా జరగడం లేదు. నిల్వ ఉన్న వాటిని లెక్కిస్తే సుమారు రూ.6 వేల కోట్లు డెడ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఉండిపోయింది. దీంతో, ప్లాంట్ నిర్వహణ కష్టంగా మారింది. ఉత్పత్తి వ్యయం పెరగడం వల్ల లాభాల్లేక 2025-26లో రూ.1,800 కోట్లు నష్టం వాటిల్లింది. ఉద్యోగులకు జీతాలు 2014 సెప్టెంబర్‌ ‌నుంచి సరిగా చెల్లించడం లేదు. విభాగాల్లో లక్ష్యాల మేర ఉత్పత్తి చేస్తేనే జీతాలిస్తామనే నిబంధన ప్లాంట్ లో అమలు చేస్తున్నారు. ఈ పద్ధతి దేశంలో మరెక్కడా లేదు. ఇలా ఉద్యోగులను విపరీత ఒత్తిడికి గురిచేస్తున్నారు. ప్లాంట్‌‌లోని తొమ్మిది వేల మంది ఉద్యోగులకు రూ.865 కోట్లు జీతాల బకాయిలు చెల్లించని స్థితి నేటికీ కొనసాగుతోంది. ముందు చూపులేని విధానాలతో ఉక్కును నష్టాల పాలుచేసి ప్రైవేట్‌ ‌వ్యక్తులకు అప్పజెప్పే కుట్రలు సాగుతున్నాయి.

 

22 మంది అధికారులపై వేటు

స్టీల్ ప్లాంట్ లో నాసిరకం ముడి సరుకు వ్యవహారంలో ఉక్కు యాజమాన్యం క్రమశిక్షణ చర్యల పేరిట అధికారులపై సస్పెన్షన్ల వేటు వేస్తోంది. భద్రతా లోపాలు, నాసిరకం ముడి సరుకుపై అంతర్గత విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులపై ఈ చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు అధికారులను సస్పెన్షన్ చేసిన యాజమాన్యం శనివారం మరో ఏడుగురు అధికారులపై చర్యలు తీసుకుంది. దీంతో, సస్పెన్షన్ కు గురైన వారి సంఖ్య 22కు చేరింది. మరి కొందరిపైనా రానున్న రెండు, మూడు రోజుల్లో చర్యలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ప్లాంట్ లోని ఎస్ఎంఎస్-1లో ఈ నెల ఎనిమిదిన జరిగిన ప్రమాదంలో ఇప్పటి వరకూ పది మంది ప్రాణాలు కోల్పోగా, నలుగురు తీవ్ర గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో నాసిరకం ముడిసరుకుపై చర్చ నడుస్తోంది.

 

గాయపడ్డ 
మరో కార్మికుడు మృతి

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఈ నెల ఎనిమిదిన జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నగరంలోని సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కార్మికుడు జి.సూరిబాబు శనివారం మృతి చెందారు. దీంతో, ప్రమాద మృతుల సంఖ్య పదికి చేరింది. పెదగంట్యాడ మండలం సీతానగరం గ్రామానికి చెందిన సూరిబాబుకు భార్య వరలక్ష్మి, కుమారుడు లోకేష్, కుమార్తె ప్రమీల ఉన్నారు. కుటుంబానికి ప్రధాన ఆధారంగా ఉన్న సూరిబాబు మృతితో వారి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ వార్త తెలిసిన వెంటనే సీతానగరం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

 

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్