ఆరు జిల్లాల్లో ఆరంజ్ అలర్ట్
తిరువనంతపురం : నైరుతి రుతుపవనాలు గురువారం కేరళను తాకాయి. సాధారణంగా రుతుపవనాలు వచ్చే తేదీ జూన్ 1 కంటే మూడు రోజులు ఆలస్యంగా, భారత వాతావరణ విభాగం అంచనా వేసిన దానికంటే నాలుగు రోజులు ఆలస్యంగా ఈ రుతుపవనాలు కేరళను తాకాయి. రాబోయే రెండు మూడు రోజుల్లో సెంట్రల్ అరేబియా సముద్రం, బంగాళాఖాతం, గోవా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాలు, కర్ణాటకలో మరికొన్ని ప్రాంతాలు, తమిళనాడులో మిగిలిన ప్రాంతాల్లో రుతుపవనాలు మరింతగా విస్తరించడానికి పరిస్థితులు చాలా అనుకూలంగా వున్నాయని భారత వాతావరణ విభాగం పేర్కొంది. కేరళలో ఆరు జిల్లాలకు ఆరంజ్ అలర్ట్‌ను ప్రకటించింది. మే 26కల్లా రుతుపవనాలు వస్తాయని మే 15న ఐఎండి తొలుత అంచనా వేసింది. సాధారణంగా నాలుగు రోజులు అటూ ఇటూగా ఉండే ఈ అంచనాలు ఈసారి తప్పాయి. 2015 తర్వాత ఐఎండి తాను పెట్టుకున్న అంచనాలను నిర్దేశిత దోష పరిమితిని మించి తప్పడం ఇదే తొలిసారి. గత రెండు రోజులుగా ఆగ్నేయ ఆరేబియా సముద్రంపై మేఘాలు దట్టంగా ఆవరించి వున్నాయి. సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులోపశ్చిమ దిశగా గాలులు బలంగా వీస్తున్నాయి. ఇవన్నీ రుతుపవనాల రాకకు అనుకూలం. ఆ రెండు రోజుల్లోనే కేరళలో విస్తృతంగా వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల భారీ వర్షపాతం కూడా నమోదైంది. ఈసారి రుతుపవనాలు రాకపై ఎల్‌నినో ప్రభావం అధికంగా వుంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఎల్‌నినో బలపడినందున ఈ ప్రభావంపై ఆందోళన చెందింది. రుతుపవనాలకు కీలక సమయమైన, ఖరీఫ్ సాగుకు అనువైన జులై, ఆగస్టు మాసాలకు ఎల్‌నినో పరిస్థితులు వృద్ధి చెందే అవకాశం దాదాపు 80శాతంగా వుందని ప్రపంచ వాతావరణ సంస్థ పేర్కొంది.









కామెంట్‌లు (0)