‘ఆకివీడు`పై రాష్ర్ట ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు
ప్రజాశక్తి – న్యూఢిల్లీ బ్యూరో : పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో రామాలయం నిర్మాణంపై సుప్రీంకోర్టు స్టేటస్ కో విధించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఆకివీడులో రామాలయ నిర్మాణాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ను సోమవారం నాడు ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ఈ వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ తరపున న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. తుది తీర్పు వచ్చేంతవరకు కొత్తగా నిర్మాణాలు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలన్న శ్రావణ్‌కుమార్ అభ్యర్థనకు ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. ఆ మేరకు ఆదేశాలు ఇస్తూ తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ వివాదానికి సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్న ఆదేశించింది. ఆలయ నిర్మాణంలో నిబంధనల ఉల్లంఘన జరిగిందన్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు పెద్దపేటలో గొంతెనమ్మ దేవాలయం ఉందని స్థానికులు చెబుతున్న చోటే రామాలయ నిర్మాణ పనులను డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు చేపట్టిన సంగతి తెలిసిందే.
ఆయన శంకుస్థాపన కూడా చేశారు. దీనిని వ్యతిరేకిస్తున్న స్థానికులు ఆలయ నిర్మాణాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషిన్లను హైకోర్టు కొట్టివేసింది. తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు కాగా.. అత్యున్నత న్యాయస్థానం స్టేటస్ కో విధించింది. దీంతో రామాలయ నిర్మాణానికి తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. కోర్టు ఉత్తర్వుల అనంతరం న్యాయవాది జడ శ్రావణ కుమార్ మాట్లాడుతూ ఆకివీడులోని వివాదాస్పద ప్రాంతంతో ఎలాంటి మతపరమైన నిర్మాణాలు చేపట్టొద్దని కోర్టు ఆదేశించిందన్నారు. అధికారుల్ని, పోలీసుల్ని చెప్పుచేతల్లో పెట్టుకుని కొన్నేళ్ల నుంచి దళితులకు ఆరాధ్య దైవమైన గొంతెనమ్మ గుడిలో పూజలు చేస్తున్నవారి మనోభావాలు దెబ్బతీస్తూ అక్కడ రామాలయం ఉందని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.









కామెంట్‌లు (0)