తిరువనంతపురం: రాజకీయ ప్రత్యర్థులను వేటాడేందుకు కేంద్ర ఏజెన్సీలను ఉపయోగించే బిజెపి ప్రభుత్వ ఫాసిస్టు పద్ధతిలోకి కేరళంలోని యూడీఎఫ్ ప్రభుత్వం కూడా చేరుతోందని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) పేర్కొంది. సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు, అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు పినరయి విజయన్ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలను తీవ్రంగా ఖండించింది. ఈ చర్యలు రాజకీయ కక్షసాధింపులో భాగమని, బిజెపి, కాంగ్రెస్ మధ్య “అపవిత్ర కూటమి”కి నిదర్శనమని పేర్కొంది. భారీ సన్నాహాలతో ఈడీ అధికారులు బుధవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో రహస్యంగా సోదాలు ప్రారంభించారు. తిరువనంతపురంలోని పినరయి విజయన్ అద్దె నివాసం, కన్నూర్‌లోని ఆయన కుటుంబ నివాసంలో ఏకకాలంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. వివాదాస్పద ఎక్సాలాజిక్-సీఎంఆర్ఎల్ ఉదంతం ముసుగులో ఈడీ సుదీర్ఘ విరామం తర్వాత ఈ దాడులను పునఃప్రారంభించిందని పేర్కొంది.
పినరాయి విజయన్ కుమార్తె, ఎక్సాలాజిక్ అధిపతి వీణా విజయన్ నివసిస్తున్న తిరువనంతపురంలోని నివాసంతో పాటు, బేపూర్ ఎమ్మెల్యే మరియు మాజీ మంత్రి పి.ఎ. మహమ్మద్ రియాస్‌కు చెందిన కోజికోడ్‌లోని ఇంట్లో కూడా ఈడీ బృందం సోదాలు నిర్వహిస్తోందని తెలిపింది. కేరళలో పది చోట్ల, బెంగళూరులో రెండు చోట్ల ఏకకాలంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో బీజేపీ, కాంగ్రెస్‌లు సంయుక్తంగా తీసుకున్న రాజకీయ నిర్ణయమే ఈ ఈడీ చర్యకు కారణమని బలమైన సూచనలు ఉన్నాయని సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబీ ఎక్స్ ద్వారా తెలిపారు. ఇలాంటి చర్యలకు పినరాయి విజయన్‌ను గానీ, సిపిఎంను గానీ భయపెట్టలేవని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని, దర్యాప్తు సంస్థలను ఆయుధాలుగా వాడుకుని ప్రతిపక్ష నాయకుడిని హత్య చేయడానికి, వేటాడటానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ప్రజలు దృఢంగా విశ్వసిస్తున్నారని తెలిపారు. ప్రజలను సమీకరించి ఈ రాజకీయ నాటకాలను ఎదుర్కొంటామని ఆయన ప్రకటించారు.









కామెంట్‌లు (0)