test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వామపక్ష, లౌకిక ప్రతిపక్ష పార్టీల ఐక్యత అవశ్యం

25 మే, 2026

ma baby
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 26, 2026, 12:25 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

- బెంగాల్‌లో సిపిఎం, వామ‌ప‌క్షాలు పున‌రాగ‌మ‌నం
- సిపిఎం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎంఎ బేబీ

ప్ర‌జాశ‌క్తి-న్యూఢిల్లీ బ్యూరో : ​దేశంలో ఇటీవల పెరుగుతున్న మిత‌వాద‌ శ‌క్తుల‌ను ప్రతిఘటించడానికి లౌకిక ప్రతిపక్ష పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉందని సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ అన్నారు. మూడు రోజుల పాటు జ‌రిగిన సిపిఎం కేంద్ర క‌మిటీ స‌మావేశాల అనంత‌రం సోమ‌వారం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. దురదృష్టవశాత్తు, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ అనేక ఇతర ప్రతిపక్ష పార్టీల పట్ల శత్రు వైఖరిని ప్ర‌ద‌ర్శిస్తోంద‌ని, అసెంబ్లీ ఎన్నికల ప్రచార దశలో కేరళలో సిపిఎం, బిజెపిల‌ మధ్య అవగాహన ఉందన్న పచ్చి అబద్ధాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడితో సహా సీనియర్ నాయకులు ప్ర‌చారం చేశార‌ని విమ‌ర్శించారు. ఈ వైఖరిని సిపిఎం ఖండిస్తోంద‌ని, బిజెపి, సంఘ్ పరివార్‌లతో నేరుగా తలపడుతున్న పార్టీ సిపిఎం అని అన్నారు. రాజకీయాలపై కొద్దిపాటి అవగాహన ఉన్నవారికి కూడా ఇది అర్థమవుతుంద‌ని, కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగా సిపిఎం నాయకులపై వ్యక్తిగత దూష‌ణ‌ల‌కు కూడా పాల్పడింద‌ని అన్నారు. బిజెపితో పోరాడటంలో కాంగ్రెస్ పెద్ద పాత్ర పోషించగలద‌ని, కానీ తాత్కాలిక ఎన్నికల ప్రయోజనాల కోసం, కాంగ్రెస్ ఈ పెద్ద రాజకీయ కర్తవ్యాన్ని మరచిపోతోంద‌ని పేర్కొన్నారు. కొన్నిసార్లు అసెంబ్లీ ఎన్నికలలో ఇండియా బ్లాక్‌లోని పార్టీలు ఒకదానితో ఒకటి పోటీపడతాయ‌ని, దీనిని స్నేహపూర్వక పోటీ చూడటానికి బదులుగా, కాంగ్రెస్ పూర్తిగా దిగజారిన ప్రచారాలకు తెర‌లేపుతుంద‌ని విమ‌ర్శించారు. ప్రతిపక్ష పార్టీలు ఐక్యంగా ఉన్న గత లోక్‌సభ ఎన్నికలలో బిజెపికి ఎదురుదెబ్బ తగిలింద‌ని, బిజెపికి వ్యతిరేకంగా వీలైనన్ని ఎక్కువ నియోజకవర్గాలలో ఒకే ప్రతిపక్ష అభ్యర్థిని నిలబెట్టడానికి ప్రయత్నాలు చేయాల‌ని అన్నారు. సుమారు నాలుగు వందల నియోజకవర్గాల్లో ఇది సాధ్యమవుతుందని ఎంఎ బేబీ పేర్కొన్నారు. బిజెపి తొలిసారిగా బెంగాల్‌తో సహా ఈశాన్య రాష్ట్రాలన్నింటినీ తన నియంత్రణలోకి తెచ్చుకుందని పేర్కొన్నారు. బిజెపి, ఎన్నికల సంఘంతో సహా రాజ్యాంగ సంస్థలను ఒక్కొక్కటిగా తన నియంత్రణలోకి తీసుకుంటూ తన ప్రభావాన్ని విస్తరిస్తోంద‌ని విమ‌ర్శించారు. ఎన్నికల సంఘం ఏకపక్షంగా నిర్వహించిన ఎస్ఐఆర్ బీహార్, బెంగాల్‌లలో వారి విజయానికి దారితీసింద‌ని, నియోజకవర్గాల పునర్విభజనతో అస్సాంలో అధికారాన్ని నిలబెట్టుకుంద‌ని అన్నారు. నియోజకవర్గాల పునర్విభజనతో జమ్మూ కాశ్మీర్‌లో కూడా లాభాలు పొందింద‌ని గుర్తు చేశారు.

​బెంగాల్‌లో పుంజుకుంటున్న వామపక్షాలు..
బెంగాల్‌లో సిపిఎం, వామపక్షాలు పునరాగమన బాటలో ఉన్నాయని బేబి అన్నారు. ప‌శ్చిమ బెంగాల్‌లో ఇటీవ‌లి రీపోలింగ్ జరిగిన ఫల్తా ఎన్నికల ఫలితాలే సిపిఎం, వామపక్షాలు పుంజుకుంటున్నాయ‌న‌డానికి నిద‌ర్శ‌న‌మ‌ని అన్నారు. తృణమూల్ నాలుగో స్థానానికి పరిమితమైన ఈ ఎన్నికల్లో సిపిఎం నలభై వేలకు పైగా ఓట్లతో రెండో స్థానంలో నిలిచింద‌న్నారు. బెంగాల్‌లో బిజెపి, సంఘ్ పరివార్‌ల మతతత్వ ఎత్తుగడలను ఎదుర్కోవడంలో సిపిఎం ఒక ప్రధాన శక్తిగా ఎదుగుతోంద‌ని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలు కూడా మంచి ప్రదర్శన కనబరిచాయ‌ని, సిపిఎం యువ నాయకులు ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నార‌ని అన్నారు. బిమన్ బసు వంటి సీనియర్ నాయకులు కూడా ఉత్సాహంగా ఎన్నికల కార్యకలాపాల్లో పాల్గొన్నార‌ని గుర్తు చేశారు. ఐదేళ్ల విరామం తరువాత‌ బెంగాల్ అసెంబ్లీలో వామపక్షాలకు ప్రాతినిధ్యం లభించింద‌ని, అనేక నియోజకవర్గాల్లో వామపక్షాలు మంచి ప్రదర్శన కనబరిచాయ‌ని పేర్కొన్నారు. వామపక్ష కూటమి కూడా బలపడింద‌ని, బెంగాల్‌లో త్వరలో వామపక్షాలు ప్రధాన ప్రతిపక్ష పాత్రను చేపట్టనున్నాయ‌ని తెలిపారు.
​తమిళనాడులో సిపిఎం రెండు సీట్లను గెలుచుకుంద‌ని, పుదుచ్చేరిలోని మాహే నియోజకవర్గంలో సిపిఎం ప్ర‌తినిధి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారని అన్నారు. అస్సాంలో ఒక సిట్టింగ్ సీటును కోల్పోయింద‌ని, అక్కడ బిజెపికి అనుకూలంగా నియోజకవర్గ పునర్వ్యవస్థీకరణ జరగడం ఒక ఎదురుదెబ్బ అని అన్నారు. కేరళలో వామపక్షాలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింద‌ని, దీనిపై చాలా క్షుణ్ణమైన పరిశీలన జరుగుతోంద‌ని అన్నారు. ఈ ఎదురుదెబ్బకు గల కారణాలను అర్థం చేసుకోవడానికి క్షేత్రస్థాయి నుండి కమిటీలు సమావేశమవుతున్నాయ‌ని పేర్కొన్నారు.
కేరళలో ఐదు లక్షల పార్టీ సభ్యులు, నలభై వేల యూనిట్లు ఉన్నాయ‌ని, అన్ని యూనిట్లలో స్వేచ్ఛాయుత చర్చ జరుగుతుంద‌ని తెలిపారు. జూన్ 5 నుంచి 8 వరకు తిరువనంతపురంలో సమావేశమయ్యే రాష్ట్ర కార్య‌ద‌ర్శివ‌ర్గం, రాష్ట్ర కమిటీ వివిధ యూనిట్లు లేవనెత్తిన అభిప్రాయాలను వివరంగా చర్చిస్తాయ‌ని అన్నారు. ఈ చర్చల ఆధారంగా, బలహీనతలను గుర్తించి, పార్టీ విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి దిద్దుబాటు చర్యలు తీసుకుంటారు.
​బెంగాల్, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరిలలో కూడా ఇదే విధమైన ప్రక్రియ జరుగుతుంద‌ని అన్నారు. బెంగాల్‌లో, అన్ని పార్టీ యూనిట్లు సమావేశమై తమ అభిప్రాయాలను రాష్ట్ర కమిటీకి సమర్పిస్తాయ‌ని, జూన్ నెలాఖరులోగా సమీక్ష పూర్తవుతుంద‌ని తెలిపారు. బెంగాల్‌లో చోటుచేసుకున్న కొత్త రాజకీయ మార్పుల నేపథ్యంలో ప్రత్యేక ప్లీనం నిర్వహించాలని రాష్ట్ర క‌మిటీ నిర్ణయించింద‌ని అన్నారు. రాష్ట్ర స్థాయిలో చర్చలు పూర్తిచేశాక, జూన్ నెలాఖరులోగా పొలిట్ బ్యూరో సమావేశమవుతుంద‌ని తెలిపారు. కేంద్ర కమిటీ ముందు ఉంచేందుకు ఒక స‌మ‌గ్ర నివేదికను సిద్ధం చేస్తామ‌ని, సాధారణంగా, కేంద్ర కమిటీ ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశమవుతుంద‌ని, అయితే, ప్రస్తుత ప్రత్యేక పరిస్థితుల్లో, ఎన్నికల ఫలితాలపై సమగ్ర సమీక్ష నిర్వహించేందుకు జూలై మధ్యలోనే కేంద్ర కమిటీ సమావేశం జరగనుంద‌ని తెలిపారు. గుర్తించిన లోపాలకు సంబంధించిన దిద్దుబాటు చర్యలను పైనుంచి కింది వరకు తక్షణమే అమలు చేస్తామని ఎంఎ బేబీ తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్