- 11వ పాలక మండలి భేటీలో ప్రధాని మోడీ
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, చర్చలు, ఇచ్చిపుచ్చుకోవడం మార్గదర్శకంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. వికసిత్ భారత్ దార్శనికత దిశగా రాష్ట్రాలు తమ ఆలోచనలను పంచుకోవడానికి, కలిసి పనిచేయడానికి వీలు కల్పించే ఒక సహకార వేదికగా నీతి ఆయోగ్ కీలక పాత్ర పోషించగలదని అన్నారు. గురువారం నాడిక్కడ రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశం అనే ఉమ్మడి లక్ష్యాన్ని సాకారం చేసుకోవడంలో కేంద్ర, రాష్ట్రాల సమిష్టి కృషి కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ప్రపంచంలో ప్రస్తుతం అనిశ్చితి, అస్థిరతతో కూడిన పరిస్థితులున్నప్పటికీ, ఇండియా ఆత్మవిశ్వాసంతో, దృఢ సంకల్పంతో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని ఆయన అన్నారు. "సహకార సమాఖ్యవాద స్ఫూర్తితో, దేశ అభివృద్ధి ప్రయాణాన్ని వేగవంతం చేయడానికి మనం కలిసి పనిచేస్తున్నాము" అని పేర్కొన్నారు. ప్రపంచ వాణిజ్యం విషయానికి వస్తే, వృద్ధి, ఎగుమతులకు కొత్త అవకాశాలను సృష్టించేందుకు ఇండియా అనేక దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేసిందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ ఒప్పందాలు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఒక ముఖ్యమైన అవకాశాన్ని అందిస్తున్నాయని, అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తూ, పోటీతత్వాన్ని పెంచుకోవడంతో ప్రపంచ మార్కెట్లకు సిద్ధం కావడానికి ఇవి వీలు కల్పిస్తాయని అన్నారు. నాణ్యమైన విద్య, డిమాండ్‌కు అనుగుణ మైన నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలతో యువత కోసం సరైన వ్యవస్థను సృష్టించాలని ఆయన పిలుపునిచ్చారు. “సాధికారత పొందిన యువతే మన వికసిత భారత్ ప్రస్థానానికి చోదక శక్తిగా ఉంటారు” అని ఆయన పేర్కొన్నారు. విక్షత్ భారత్ దార్శనికతకు మహిళా నాయకత్వంలో అభివృద్ధి ఒక మూలస్తంభమన్నారు. వ్యవసాయం, స్టార్టప్‌ల నుండి సైన్స్, ఆవిష్కరణల వరకు నారీ శక్తి వివిధ రంగాలలో తన వంతు కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు ఎన్.చంద్రబాబు నాయుడు, ఎ.రేవంత్ రెడ్డితో పాటు అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, ఎక్స్-అఫీషియో సభ్యులతో పాటు ప్రత్యేక ఆహ్వానితులుగా కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్, సభ్యులు, ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సిఇఒ) పాల్గొన్నారు. ‘2047 కల్లా వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం అందరికీ సమ్మిళిత అభివృద్ధి ఫలాలు’ను ఈ సంవత్సరం ఇతివృత్తంగా ఎంపిక చేశారు. దేశంలో ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట, గణనీయమైన ఫలితాలను అందించడానికి అవలంబించాల్సిన విధానంపై సమావేశంలో చర్చించారు. అలాగే సమ్మిళిత మానవాభివృద్ధి ప్రాథమిక ప్రణాళికనూ చర్చించారు. ‘‘1. మానవ వనరుల ఆధారంగా, రాబోయే కాలాన్ని దృష్టిలో పెట్టుకొని సన్నద్ధంగా ఉండే నైపుణ్యాలు. 2. ఉత్పాదక ఉపాధికల్పన, పారిశ్రామిక ప్రోత్సాహలు, అభివృద్ధి వికేంద్రీకరణ . 3. ఆరోగ్యం, పోషణ, సంక్షేమం. 4. అందరికీ సమాన అవకాశాలు, ఆత్మగౌరవం’’ వంటి నాలుగు ముఖ్యాంశాల ఆధారంగా చర్చలు జరిపారు. సమావేశంలో దేశవ్యాప్తంగా పారిశ్రామిక, నైపుణ్యాల సాధనను ప్రోత్సహించడంతోపాటు దీర్ఘకాలం పాటు మనుగడ లో ఉండే ఉద్యోగావకాశాలను కల్పించడానికి తీసుకో వాల్సిన చర్యలు గురించి చర్చించారు. పాలన, డిజి టల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డిపిఐ), భాగస్వా మ్యాలు, డేటా ఆధారిత వ్యవస్థలు సహా ప్రధాన సహాయకారి అంశాలను వినియోగించుకుంటూ ఒక కార్యాచరణ నమూనాను రూపొందించడంపై చర్చ జరిగింది.
ప్రతి కుటుంబానికి ఏడు ప్రాథమిక అవసరాల కల్పన : సిఎం చంద్రబాబు
రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఏడు ప్రాథమిక అవసరాలైన ఇళ్లు, తాగునీరు, విద్యుత్, డిజిటల్ కనెక్టివిటీ, పారిశుధ్యం, స్వచ్ఛమైన వంట ఇంధనం, ప్రత్యక్ష నగదు బదిలీలు అందుబాటులో ఉండేలా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. విద్యార్థుల కోసం ఏఐ లెర్నింగ్, క్వాంటం టెక్నాలజీస్, అడ్వాన్స్డ్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ తీసుకువస్తామని పేర్కొన్నారు. నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో సిఎం చంద్రబాబు మాట్లాడుతూ 'వికసిత్ భారత్ 2047' లక్ష్యానికి అనుగుణంగా ‘స్వర్ణాంధ్ర 2047’ ప్రతిష్ఠాత్మక విజన్ ప్లాన్‌ను రూపొందించామన్నారు. పేదరిక నిర్మూలన, భారీస్థాయిలో ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి లక్ష్యాలుగా స్వర్ణాంధ్ర రోడ్‌మ్యాప్ వుందన్నారు. గడిచిన రెండేళ్లలో ఏపీ పారదర్శక విధానాల వల్ల రూ. 23 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులని ఆకర్షించామని వెల్లడించారు. ఆర్టిజిఎస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అవేర్ వంటి ప్రిడిక్టివ్ టూల్స్‌తో ఏపిలో సాంకేతిక పాలన కొనసాగిస్తున్నామని వివరించారు. పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య అనారోగ్యకర పోటీ వద్దని సూచించారు. మౌలిక వసతులు, స్థిరమైన విధానాలపై దృష్టి పెట్టాలని ఆయా రాష్ట్రాలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న 10 శాతం మంది.. వెనుకబడిన 20 శాతం మందిని ఆదుకునేలా వినూత్న ‘పి4-ఎంబికె 10-20’ కార్యక్రమం తీసుకువచ్చినట్లు వివరించారు. ఏపిలో ఆరోగ్య సంరక్షణ, డిజిటల్ హెల్త్ రికార్డుల కోసం ‘ప్రాజెక్ట్ సంజీవని’ అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు 1.5శాతం కంటే తగ్గడంపై సిఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మానవ వనరుల కొరత, వృద్ధాప్య సమస్యలను అధిగమించేందుకు ఏపిలో కొత్త 'పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ' తీసుకువస్తామని వివరించారు. వికసిత్ భారత్ 2047 సాధన కోసం కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్‌తో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు.









కామెంట్లు (0)