తిరువనంతపురం: కేరళం మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసాలైన కన్నూర్, తిరువనంతపురంలోని ఇళ్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బుధవారం దాడులు నిర్వహించింది. వివాదాస్పద ఎక్సాలాజిక్-సీఎంఆర్ఎల్ ఉదంతం ముసుగులో ఈడీ సుదీర్ఘ విరామం తర్వాత ఈ దాడులను పునఃప్రారంభించింది. విజయన్ నివాసాలలో పాటు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12 ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. పినరాయి విజయన్ కుమార్తె, ఎక్సాలాజిక్ అధిపతి వీణా విజయన్ నివసిస్తున్న తిరువనంతపురంలోని నివాసంతో పాటు, బేపూర్ ఎమ్మెల్యే మరియు మాజీ మంత్రి పి.ఎ. మహమ్మద్ రియాస్‌కు చెందిన కోజికోడ్‌లోని ఇంట్లో కూడా ఈడీ బృందం సోదాలు నిర్వహిస్తోంది. సీఎంఆర్ఎల్ ప్రమోటర్ల ఇళ్లు మరియు అనుబంధ కార్యాలయాలు కూడా సోదాలు నిర్వహిస్తోంది. సాయుధ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) సిబ్బంది భద్రత మధ్య ఈడీ అధికారులు బుధవారం తెల్లవారుజామున సోదాలు ప్రారంభించారు. తిరువనంతపురంలోని బేకరీ జంక్షన్‌లో విజయన్ ఇటీవల అద్దెకు తీసుకున్న ఇంటితో పాటు పలు ప్రాంగణాలను అధికారులు దిగ్బంధించారు. సోదాలు జరుగుతున్న సమయంలో పినరాయి విజయన్, ఆయన కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నారు.
భయపడం : జాన్ బ్రిట్టాస్
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) కేంద్ర కార్యవర్గ సభ్యుడు, ఎంపీ జాన్ బ్రిట్టాస్ పై ఈడీ దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్టు చేశారు. “రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి, లక్ష్యంగా చేసుకోవడానికి కేంద్ర ఏజెన్సీలను పద్ధతి ప్రకారం దుర్వినియోగం చేయడానికి ఇది మరో ఉదాహరణ. ఇటువంటి కక్షపూరిత చర్యలు నిరంకుశ మనస్తత్వాన్ని బయటపెడతాయి. పినరయి మరియు సిపిఎం ఈ అప్రజాస్వామిక ఎత్తుగడలకు భయపడరు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ప్రజల మద్దతుతో సిపిఎం దృఢంగా పోరాడుతుంది. అరవింద్ కేజ్రీవాల్ విషయంలో చేసినట్లే, ఆయనను లక్ష్యంగా చేసుకోవడానికి ఈడీని కాంగ్రెస్ నాయకత్వం చురుకుగా ప్రోత్సహించిందన్నది స్పష్టం” అని పేర్కొన్నారు.









కామెంట్‌లు (0)