న్యూఢిల్లీ : ప్రస్తుతమున్న పెన్ను - పేపర్ తరహాలో బదులుగా కంప్యూటర్ బేస్డ్ తరహాలో నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించేలా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ)ను ఆదేశించడానికి సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. ఈ దశలో పరీక్ష నిర్వహణా తీరును మార్చడం వల్ల ఆచరణాత్మక ఇబ్బందులు తలెత్తుతాయని వ్యాఖ్యానించింది. పేపర్ లీకయిందనే ఆరోపణల నేపథ్యంలో మే 3న నిర్వహించిన నీట్-యుజి 2026 పరీక్షను మే 12న దేశవ్యాప్తంగా రద్దు చేశారు. సిబిఐ ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టింది. జూన్ 21న తాజా విచారణ జరగాల్సి వుంది. పిటిషనర్ అభ్యర్ధనను జస్టిస్ పి.ఎస్.నరసింహా, జస్టిస్ అరవింద్ కుమార్‌లతో కూడిన బెంచ్ తిరస్కరించింది. జులై వరకు ఈ పిటిషన్ విచారణను వాయిదా వేసింది. ఆర్‌జెడి ఎంఎల్‌ఎ సుధాకర్ సింగ్ వేసిన పిటిషన్‌పై బెంచ్ విచారించింది. సిబిటి తరహాలో పరీక్ష నిర్వహిస్తే పేపర్ లీక్ అయ్యే సమస్య తలెత్తదని పిటిషనర్ వాదించారు. ఇంత తక్కువ కాల వ్యవధిలో పరీక్షను మళ్లీ నిర్వహించడంలో వుండే ఇబ్బందులను ప్రస్తావిస్తూ, వారికి వుండే ఒత్తిడిని దృష్టిలో పెట్టుకుని సిబిటి లాంటి అంశాలను తోసిపుచ్చినట్లు బెంచ్ తెలిపింది. పేపర్ లీకయినప్పటికీ మళ్లీ పెన్ను పేపర్ తరహాలోనే పరీక్ష నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారా అని పిటిషనర్ తరపు న్యాయవాది ప్రశ్నించగా, పరీక్షల నిర్వహణా అధికారులు ఎదుర్కొనే రవాణా పరమైన ఇబ్బందులను కూడా బెంచ్ ప్రస్తావించింది. అయినా పిటిషనర్ పట్టుబడుతుండడంతో తక్షణమే ఈ అంశాన్ని విచారించలేమని కోర్టు తెలిపింది. కోర్టు పాక్షిక పని దినాలు ముగిసిన తర్వాత దీనిని విచారణకు పెట్టాలంటూ ఆదేశాలు జారీ చేసింది. సెలవుల తర్వాత విచారిద్దామని బెంచ్ తెలిపింది. ఎన్‌టిఎ పనితీరులో, పోటీ పరీక్షల నిర్వహణలో విస్తృత సంస్కరణలు తీసుకురావాలని కోరుతూ దాఖలై, పెండింగ్‌లో వున్న పలు పిటిషన్లుతో ఈ పిటిషన్‌ను కూడా కలిపారు.
కంప్యూటర్ బేస్డ్ తరహాలో మళ్లీ 'నీట్`కు సుప్రీం నో !
6 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 02, 2026, 12:43 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)