ప్రజాశక్తి - అనంతపురం : ప్రసిద్ధ అభ్యుదయ కవి అడిగోపుల వెంకటరత్నం పేరుమీద ఆయన కుటుంబ సభ్యులు నెలకొల్పిన “అడిగోపుల సాహిత్య ప్రతిభా పురస్కారం - 2026”కు సుప్రసిద్ధ అభ్యుదయ సాహిత్య విమర్శకులు ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి ఎంపికయ్యారు. జూలై నెల రెండవ వారంలో తిరుపతిలో జరగనున్న ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ఆయనకు అందజేయనున్నట్లు ఆస్ట్రేలియా నుంచి “తెలుగు సందడి” సాహిత్య, సాంస్కృతిక వ్యవహారాల సంచాలకుడు అడిగోపుల శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎం.ఏ తెలుగు, పీహెచ్.డి (1970-77) చేశారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, యోగి వేమన విశ్వవిద్యాలయాలలో 38 ఏళ్లు తెలుగు అధ్యాపకుడిగా పని చేశారు. 102 విమర్శ, పరిశోధన, కవిత్వ, సంపాదక పుస్తకాలు ప్రచురించారు. 45 మంది పరిశోధకులకు పర్యవేక్షకులుగా వ్యవహరించారు. కేంద్ర సాహిత్య అకాడమీ జనరల్ కౌన్సిల్ సభ్యుడిగా, నేషనల్ బుక్ ట్రస్ట్ తెలుగు సలహా మండలి సభ్యుడిగా, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం సభ్యుడిగా పని చేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారంతో పాటు 23 పురస్కారాలు అందుకున్నారు. 30 గ్రంథాలతో అభ్యుదయ కవిత్వాన్ని సమృద్ధి చేసిన “అడిగోపుల వెంకటరత్నం స్మారక పురస్కారం”ను తెలుగు సాహిత్య విమర్శను విస్తృతపరచిన ఆచార్య రాచపాళెంకు అందజేయడం సముచితంగా భావిస్తున్నామని అడిగోపుల శ్రీకాంత్ పేర్కొన్నారు.
రాచపాళెంకు అడిగోపుల పురస్కారం
19 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 19, 2026, 11:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)