mh ad
గురువారం, 18 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు

2 రోజుల క్రితం

paper mill
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 16, 2026, 01:06 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • 50వ రోజూ కొనసాగిన కార్మికుల సమ్మె

​​ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : కడియంలోని ఎపి పేపరు మిల్లు యాజమాన్యం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తోంది. దీంతో, కార్మికులు సమ్మెను కొనసాగిస్తున్నారు. సోమవారం నాటికి సమ్మె 50వ రోజుకు చేరుకుంది. ఈ పేపర్ మిల్లులో పర్మినెంట్ కార్మికులు 420 మంది, కాంట్రాక్ట్ కార్మికులు 850 మంది ఉన్నారు. వీరందరికీ వేతన ఒప్పందం ముగిసి మూడున్నర సంవత్సరాలు దాటింది. గత అగ్రిమెంట్ అనంతరం మిగిలిన కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాల్సి ఉండగా, ఆ దిశగా యాజమాన్యం చర్యలు తీసుకోలేదు. అప్‌గ్రేడేషన్ పెండింగ్‌‌లో ఉం‌చింది. ఈ సమస్యలపై మార్చి 27న కాంట్రాక్టు కార్మికులు ఆందోళన బాట పట్టారు. వీరికి పర్మినెంట్ కార్మికులు కూడా సంఘీభావం తెలిపారు. ఇది సహించని యాజమాన్యం మార్చి 29న 59 కాంట్రాక్టు కార్మికులను, 11 మంది పర్మినెంట్ కార్మికులను విధుల నుంచి తొలగించింది. అంతేకాకుండా ఎలాంటి నోటీసులూ ఇవ్వకుండా మే ఒకటో తేదీ రాత్రి పది గంటలకు లాకౌట్‌ ప్రకటించింది. గడిచిన 50 రోజుల్లో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో సుమారు పదిసార్లు యాజమాన్యంతో చర్చలు జరిగాయి. తాజాగా ఈ నెల పదిన జరిగిన చర్చల్లో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌... ‌ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని తేల్చి చెప్పారు. 24 గంటల్లో తమ నిర్ణయాన్ని తెలియజేస్తామని యాజమాన్యం ప్రతినిధులు అక్కడ నుంచి వెళ్లి పోయారు. ఐదు రోజులైనా నేటికీ వారి నుంచి స్పందన లేదు. ఎట్టకేలకు లాకౌట్‌‌ను యాజమాన్యం ఎత్తివేసింది కానీ, ఇతర సమస్యలపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. దీంతో, కార్మికులు సమ్మెను కొనసాగిస్తున్నారు.

వెంటనే విధుల్లోకి తీసుకోవాలి ఈ మిల్లులో 24 ఏళ్లుగా పని చేస్తున్నాను. అనేక సమస్యల మధ్య ఇక్కడ విధులు నిర్వహిస్తున్నాం. ఈ నెలలో ప్రతి పర్మినెంటు కార్మికునికీ ఎడ్యుకేషనల్‌ అలవెన్స్‌‌ రూ.13 వేలు చొప్పున చెల్లించాలి. ఈ నెల వేతనాలు కూడా ఇంకా చెల్లించలేదు. కుటుంబ పోషణ కష్టతరంగా మారింది. యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి సరైంది కాదు. తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి.

  • ​ఐ.శివకుమార్‌, పర్మినెంట్‌ ‌కార్మికుడు, ఎపి పేపరు మిల్లు, కడియం యూనిట్‌

 

యాజమాన్యం నిరంకుశ వైఖరి వీడాలి కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్య నిరంకుశ వైఖరి సరైంది కాదు. 28 రోజుల లాకౌట్‌ ‌చట్ట వ్యతిరేకమని కార్మిక శాఖ అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. కార్మికుల సస్పెన్షన్‌‌పై యాజమాన్యం నిరంకుశ పోకడ నేటికీ కొనసాగుతోంది. జిల్లా మంత్రి, ఎంఎల్ఎలు, కార్మిక శాఖ మంత్రి, జిల్లా ఉన్నతా ధికారులు పేపరు మిల్లు యాజమాన్య వైఖరిని తప్పుపడుతున్నప్పటికీ యాజమాన్యం అడ్డదా రులు తొక్కేందుకు యత్నించడం శోచనీయం. ఇప్పటికైనా యాజమాన్యం నిరంకుశ వైఖరి విడనాడి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి.

-టి.అరుణ్‌, సిఐటియు ఉపాధ్యక్షులు, తూర్పుగోదావరి జిల్లా

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్