mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఏపీలో కనీస వేతనాలు వెంటనే పెంచాలి

25 మే, 2026

citu ap
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 25, 2026, 09:06 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-విజయవాడ : రాష్ట్రంలో కనీస వేతనాలు వెంటనే పెంచాలని ఏపీ సిఐటియు డిమాండ్ చేసింది. ఈ మేరకు సిఐటియు అధ్యక్షులు, ప్రధాన కార్యదర్సులు సి.హెచ్.నరసింగరావు, ఏ.వి.నాగేశ్వరరావు పత్రికా ప్రకటనను విడుదల చేశారు. 50 లక్షల మంది కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం 2006-07 తర్వాత కనీస వేతనాలను పెంచలేదని తెలిపారు. ఐదు సంవత్సరానికోసారి కనీస వేతనాల చట్టం ప్రకారం వేతనాలు పెంచాలని, కానీ రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాలను పెంచితే యాజమాన్యాలకు లాభాలు తగ్గిపోతాయని కనీస వేతనాలను పెంచలేదన్నారు. షెడ్యూల్డ్ పరిశ్రమల్లోని కార్మికులకు కోట్లాది రూపాయలు నష్టం కలిగించిందని, 2012, 2017, 2022లో కనీస వేతనాలను పెంచకుండా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారుల ప్రయోజనం కోసమే పని చేశాయన్నారు. మన పక్కనే ఉన్న తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలు ఐదు సంవత్సరాల కోసారి వేతనాలు పెంచుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి కార్మికుల ప్రయోజనం పట్టదని, ఎప్పుడు కూడా పెట్టుబడిదారులకు ఏమి లబ్ది చేకూర్చాలని మాత్రమే ఆలోచిస్తున్నదని తెలిపారు.
ఐదు సంవత్సరాలకోసారి వేతనాలు పెంచినట్లయితే కనీస స్థాయిలో ఈ పాటికి రూ. 19 వేల నుండి రూ. 22 వేల వరకూ వచ్చి ఉండేవని, నైపుణ్య స్థాయిని బట్టి మరింతగా వేతనాలు పెరిగి ఉండేవన్నారు. మన పక్కనే ఉన్న తెలంగాణా రాష్ట్రం కూడా వేతనాలను అరకొరగా రూ. 14 వేల నుండి రూ. 20 వేల వరకు పెంచిందని, కర్నాటక ప్రభుత్వం మే 23న పెంచిన వేతనాల స్థాయి సంతృప్తికరంగా ఉందన్నారు. అక్కడి కార్మికుల వేతనాలు రూ. 20,350 నుండి రూ. 32,145 వరకు పెరిగాయన్నారు. కేరళలో గత వామపక్ష ప్రభుత్వం గతంలోనే దేశంలోనే అత్యధికంగా కనీస వేతనాలను పెంచిందన్నారు.
షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్స్‌లోని 50 లక్షల మంది కార్మికులకు మరియు ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్న స్కీమ్ వర్కర్లకు భారత కార్మిక మహాసభ సిఫార్శులు మరియు 1992 సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా కనీస స్థాయిలో వేతనాన్ని నెలకు రూ. 26 వేలకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిఐటియు ఏపి కమిటీ డిమాండ్ చేసింది. వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, సంస్థల్లోని ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రారంభ వేతనం నెలకు రూ.26 వేలు చేయాలని సిఐటియు ఏపి కమిటీ డిమాండ్ చేసింది. న్యాయమైన ఈ కనీస వేతనాల సాధనకు కార్మికులంతా పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్