test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ కారిడార్

29 మే, 2026

babu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 30, 2026, 12:49 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం


-త్వరితగతిన ప్రభుత్వ భవనాలపై సోలార్ యూనిట్లు
-సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటు చేసి, ఆ మేరకు విద్యుత్ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. 18 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ప్రధాన గ్రిడ్‌కు అనుసంధానించేందుకు సుమారు రూ. 22 వేలకోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్ శాఖపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రీన్ ఎనర్జీలో 160 గిగా వాట్ల ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించుకున్నామని.. దానికి అనుగుణంగా నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఏపీ గ్రీన్ ఎనర్జీ కారిడార్ పూర్తయితే.. రాష్ట్రంలో డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ఈ నెట్‌వర్క్ బాగా ఉపకరిస్తుందని అభిప్రాయపడ్డారు. విద్యుత్ మౌలిక సదుపాయాలు పెరిగితే.. ఆయా రంగాల్లో పెట్టుబడులు కూడా పెద్దయెత్తున వస్తాయని సూచించారు. గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఫేజ్-3 కింద సుమారు 18 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ప్రధాన గ్రిడ్‌కు అనుసంధానించేందుకు కొత్త ట్రాన్స్‌మిషన్ లైన్లు, పూలింగ్ స్టేషన్లను నిర్మించనున్నట్టు వెల్లడించారు. మొత్తంగా 18 గిగావాట్లలో సోలార్ ద్వారా ఉత్పత్తి అయ్యే 11 గిగా వాట్ల విద్యుత్‌ను, అలాగే పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి అయ్యే సుమారు 7 గిగా వాట్ల విద్యుత్‌‌ను ప్రధాన గ్రిడ్‌‌కు అనుసంధానించేలా చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు వివరించారు. ఈ మేరకు 2,261 కిలోమీటర్ల మేర కొత్త ట్రాన్స్ మిషన్ లైన్లు వేయనున్నట్లు, 9,500 మెగా వాట్ల సామర్థ్యంతో 5 భారీ పూలింగ్ స్టేషన్లను నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడించారు. ముదిగుబ్బ, తలుపుల, రామాయపట్నం, పోరుమామిళ్ల, కొప్పాక ప్రాంతాల్లో పూలింగ్ స్టేషన్లు నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా 200 మెగా వాట్ల సామర్థ్యంతో ప్రభుత్వ భవనాల సోలరైజేషన్ ప్రక్రియను మొదలు పెట్టినట్టు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ భవనాల సోలరైజేషన్ ప్రక్రియలో భాగంగా రెస్కో మోడల్ అనుసరిస్తున్నామని అధికారులు తెలిపారు. నెట్ జీరో విధానంలో హెల్తీ క్యాంపస్‌లను తీర్చిదిద్దేలా సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసేందుకు 2,898 హాస్టళ్లు, స్కూళ్లలో గుర్తించినట్టు సిఎం దృష్టికి అధికారులు తెచ్చారు. పిఎం సూర్యఘర్ పథకం అమల్లో రాష్ట్రం 4వ స్థానంలో ఉందని... అగ్రస్థానంలో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సిఎం సూచించారు. 131 ప్రాంతాల్లో 577 ఇవి ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించినట్టు అధికారులు వెల్లడించారు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన 'ప్రవాహ్' సంస్థ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ సహకారంతో, ఇపిడిసిఎల్‌ పరిధిలో విద్యుత్ సాంకేతిక నష్టాలను తగ్గించేలా చర్యలు తీసుకుంటున్న విధానాన్ని అధికారులు ప్రెజెంట్ చేశారు. మే 21న రాష్ట్రంలో

అత్యధికంగా 15,016 మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదైందని చెప్పారు. 2025తో పోలిస్తే ఏప్రిల్–మే 2026 కాలంలో గరిష్ట డిమాండ్ 14.48 శాతం నుంచి 16.77 శాతానికి పెరిగిందని అధికారులు చెప్పారు.

సిఎంను కలిసిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం బృందం

వరల్డ్ ఎకనమిక్ ఫోరం ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయింది. రాష్ట్రంలో ఏర్పాటుచేసిన దేశంలోనే తొలి థీమాటిక్ సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రీయల్ రెవెల్యూషన్ అమలు చేయాల్సిన కార్యాచరణపై ఈ బృందం చర్చించింది. దీనిపై ఎపి ట్రాన్స్ కో-వరల్డ్ ఎకనమిక్ ఫోరంతో గతంలోనే ఒప్పందం కుదిరింది. రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో ప్రపంచ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దాలని ‌సిఎం సూచించారు. వివిధ రకాల విద్యుత్ ఉత్పత్తి మోడళ్లను పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి బెస్ట్ మోడల్ తయారు చేయాలని స్పష్టం చేశారు. విశాఖ డేటా సెంటర్ కారిడార్, గ్రీన్ హైడ్రోజన్ పెట్టుబడులు, పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని ‌సి4ఐఆర్‌ కార్యాచరణతో అనుసంధానం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, సిఎస్‌ సాయిప్రసాద్, విద్యుత్, ట్రాన్స్ కో, జెన్కో, డిస్కంలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్