- రఘురామకృష్ణమరాజుపై చర్యలకు డిమాండ్
ప్రజాశక్తి - మంగళగిరి (గుంటూరు జిల్లా) : పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో గత ఆరు దశాబ్దలుగా నివాసం ఉంటున్న దళిత, బలహీనవర్గాల పేదల ఇళ్ల కూల్చివేతలను వెంటనే ఆపాలని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్), చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీలు డిమాండ్ చేశాయి. కూల్చిన పేదల ఇళ్లకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పక్కాగృహాలు నిర్మించాలని, తగిన నష్టపరిహారం ఇవ్వాలని కోరాయి. ఈ మేరకు ఆయా సంఘాల రాష్ట్ర నాయకులు శుక్రవారం గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎపిఐఐసి భవనంలో సిసిఎల్‌ఎ అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు డి రమాదేవి, కార్యదర్శి వి వెంకటేశ్వర్లు, కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి, చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర నాయకులు పి వెంకట్రావు మాట్లాడుతూ ఉండి, పాలకోడేరు, ఆకివీడు, కాళ్ల మండలాల్లో గత 60-70 ఏళ్లుగా ప్రభుత్వ స్థలాలు, కాల్వ గట్లపై పేదలు నివాసం ఏర్పరుచుకొని జీవనం సాగిస్తున్నారని, వారికి ప్రభుత్వం హక్కులు కల్పిస్తూ రోడ్లు, విద్యుత్, తాగునీటి సదుపాయాలూ కల్పించిందన్నారు. ప్రాథమిక ఆధారాలున్న ఇళ్లకు తక్షణమే రిజిస్ట్రేషన్ చేసి అన్ని హక్కులూ కల్పించాలని సిఎం చెబుతుండగా మరోవైపు ఉండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణమరాజు మాత్రం భూస్వాములు, రొయ్యల చెరువుల యజమానుల వద్ద రూ.కోట్ల మామూళ్లు తీసుకుని రోడ్లు విస్తరణ, అభివృద్ధి పేరుతో కలెక్టర్, ఆర్డీవోలకు చెప్పకుండా బుల్డోజర్లతో ఇళ్లను కూల్చివేశారు విమర్శించారు.
ఉండి నియోజకవర్గంలో గత ఏడాది కాలంగా దళిత, బలహీన వర్గాలకు చెందిన 994 ఇళ్లను నేలమట్టం చేసి ఆనవాళ్లు కూడా లేకుండా చేశారన్నారు. కూల్చిన ప్రతి ఇంటికి లెక్క గట్టి పరిహారం చెల్లించాలని, కూల్చిన ప్రతి ఇంటికీ ప్రత్యామ్నాయ స్థలాలు చూపించి పక్కా గృహలు నిర్మించి ఇవ్వాలని, సర్వం కోల్పోయిన ప్రతి కుటుంబానికి పునరావాసం కింద రూ.పది లక్షలు చొప్పున చెల్లించాలని కోరారు. భూస్వాములకు అమ్ముడుపోయి పేదల ఇళ్లను కూల్చి వేయించిన రఘురామకృష్ణమరాజుపై చర్యలు తీసుకోవాలని, ఆ కాలనీల్లో ఏడాది పాటున ఉపాధి హామీ పనులు కల్పించాలి, వారికి ఉచితంగా రేషన్, విద్యుత్, తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.
ఉండి నియోజకవర్గంలో కూల్చిన ఇళ్లకు పరిహారం ఇవ్వాలి
2 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 05, 2026, 11:36 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)