– కాంగ్రెస్, బిజిపి విధానాలతో మరింత దిగజారిన పరిస్థితులు
– నిపుణుల హెచ్చరిక
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన పొదుపు చర్యలు దేశంలో వ్యవసాయ, ఆహార సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తాయనే భయాలను రేకెత్తిస్తున్నాయి. ఇంధనం, వంట నూనెలు, ఎరువులు వంటి నిత్యావసర వస్తువుల వినియోగాన్ని గణనీయంగా తగ్గించాలని ప్రధాని మోడీ దేశ ప్రజలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో ఏ దేశ ప్రధాని కూడా అసమర్థ పాలన, విదేశాంగ విధానంలో ఘోర వైఫల్యాన్ని ఇంత స్పష్టంగా అంగీకరించలేదని పలువురు విశ్లేషిస్తున్నారు.పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంక్షోభం మధ్య విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడానికి “జాతీయ ప్రయోజనం”, “దేశభక్తి” అనే ముసుగులో, ఆయన తనదైన శైలిలో అత్యంత అసంబద్ధమైన ప్రతిపాదనలతో ముందుకు వచ్చారని తెలుస్తోంది. మై గవర్నమెంట్ పోస్టర్‌లో “నేషన్ ఫస్ట్” అనే శీర్షికతో పొదుపు చర్యలను “ప్రధాని మోడీ 7 విజ్ఞప్తులు”గా పేర్కొన్నారు. వీటిలో అత్యంత నిర్లక్ష్యపూరితమైన సూచన ఏమిటంటే, “రసాయన ఎరువులపై ఆధారపడటాన్ని తగ్గించి, సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లాలి” అని. ఇది రైతులు ఇప్పటికే అధిక ఖర్చులు, తగ్గుతున్న రాబడి, అప్పులు, ఆత్మహత్యలకు పాల్పడాల్సిన పరిస్థితి వంటి తీవ్రమైన వ్యవసాయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో వచ్చింది.భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఎరువుల దిగుమతిదారు, రెండవ అతిపెద్ద వినియోగదారుగా ఉంది. అయితే ఎరువుల సంక్షోభానికి కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ (బిజిపి) ప్రభుత్వాల విధానాలే కారణం. ఈ రెండు ప్రభుత్వాలు అవలంభించిన విధానాలు దేశీయ పారిశ్రామిక సామర్థ్యాన్ని, స్వావలంబనను దెబ్బతీశాయి.. సామ్రాజ్యవాద అమెరికాకు భారతదేశం లొంగిపోవడం కూడా వాణిజ్య సంబంధాలపై ఒత్తిడి, బ్లాక్‌మెయిల్, అలాగే ప్రస్తుత ప్రతిష్టంభనలోకి నెట్టింది.
ఎరువుల కొరత..
ప్రధాని నరేంద్ర మోడీ, రైతులు ఎరువుల వినియోగాన్ని 50 శాతం వరకు తగ్గించి, సహజ వ్యవసాయ పద్ధతుల వైపు మారాలని పిలుపునిచ్చారు. అయితే ఈ స్టేట్‌మెంట్ రైతులు ఎదుర్కొంటున్న ఎరువుల కొరత అనే ప్రధాన సమస్యను దాచిపెడుతుంది. విచిత్రంగా, ఒకవైపు ప్రభుత్వం ఎరువుల లభ్యత పటిష్టంగా ఉందని, సరఫరా అవసరానికి మించి ఉందని పేర్కొంటుండగా, మరోవైపు మంత్రిత్వ శాఖ పశ్చిమ ఆసియాలోని ఇటీవలి పరిణామాలతో ఖరీఫ్ కోసం ఎరువుల నిల్వలు 390.54 లక్షల మెట్రిక్ టన్నుల అంచనా అవసరంలో 51 శాతం కంటే ఎక్కువగా ఉన్నాయని పేర్కొనటం గమనార్హం.
అయితే హర్మూజ్ జలసంధి ద్వారా రోజుకు 2 కోట్ల (20 మిలియన్) బ్యారెళ్ల చమురు, అలాగే గణనీయమైన నిష్పత్తిలో ద్రవీకృత సహజ వాయువు (ఎల్‌ఎన్‌జి), ఎరువులు రవాణా అవుతాయి. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతల కారణంగా 15-30 లక్షల (1.5-3 మిలియన్) టన్నుల ఎరువుల వాణిజ్యం అంతరాయం కలిగిందని అంచనా. యూరియా, ఫాస్ఫేట్లు, అమ్మోనియా, పొటాష్, చమురు, ఎల్‌ఎన్‌జి రవాణా అంతా అంతరాయం కలిగింది. ఇరాన్‌తో ఏదైనా వాణిజ్యంపై అమెరికా ప్రతీకార ఆంక్షల భయంతో హర్మూజ్ జలసంధి ద్వారా అవసరమైన ఎరువుల సరఫరాను తీసుకువెళ్లే సరుకు రవాణా నౌకలను భారతదేశం కూడా వదిలివేసిందని తాజా నివేదికలు సూచిస్తున్నాయి.
వ్యవసాయ సంక్షోభం వస్తుందా?
ప్రధాని పొదుపు చర్యలను వరి, మొక్కజొన్న, సోయాబీన్, వివిధ పప్పుధాన్యాలు, పత్తి వంటి ముఖ్యమైన పంటల ఖరీఫ్ సాగు ప్రారంభమయ్యే ముందు ప్రకటించారు. యూరియా, డై-అమ్మోనియం-ఫాస్ఫేట్ (డిఎపి) సకాలంలో లభించకపోతే, దిగుబడులు గణనీయంగా తగ్గుతాయి, దీనివల్ల వ్యవసాయ సంక్షోభం పెరుగుతుంది, ఆహార ధరలు పెరుగుతాయి, ఆహార సార్వభౌమత్వం తీవ్రంగా దెబ్బతింటుందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు
వాస్తవానికి, ఎరువుల వినియోగంపై అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, అధిక వినియోగం కాకుండా, పోషకాల వినియోగం సిఫార్సు చేసిన స్థాయిలతో పోలిస్తే కీలక ఎరువుల వాస్తవ వినియోగంలో కొరత ఉంది. ఈ కొరత ముఖ్యంగా భాస్వరం (పి), పొటాషియం (కె) వినియోగానికి సంబంధించి ఉంది. 2024–25లో పొటాషిక్ ఎరువుల (కె) వాస్తవ వినియోగం 2,384 వేల టన్నులుగా ఉంది, ఇది 6,675 వేల టన్నుల అత్యంత ఇటీవలి సాధారణ లేదా సిఫార్సు చేసిన వినియోగం కంటే దాదాపు 64 శాతం తక్కువ. అదేవిధంగా, ఫాస్ఫాటిక్ ఎరువుల (పి) వినియోగం సిఫార్సు చేయబడిన స్థాయి కంటే 11 శాతం తక్కువగా ఉంది. అనేక రాష్ట్రాలలో నత్రజని ఎరువుల (ఎన్) విషయంలో కూడా కొరత ఉంది.
సేంద్రీయ వ్యవసాయం బూటకం..
రాబోయే ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన నిల్వలను మరింతగా సమకూర్చుకోవడం బదులుగా ‘జీరో బడ్జెట్ సహజ వ్యవసాయం’ వైపు మళ్లాలని రైతులకు ప్రధాని పిలుపునివ్వడం ఆయన నిర్లక్ష్యానికి పరాకాష్ట . ఇది విపత్తులు సంభవించే కాలం. ఇప్పటికే అవలంబిస్తున్న విధానాలతో ఉన్న పోషకాల అసమతుల్యతను మరింత తీవ్రతరం చేస్తుంది, ఇది నేల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది, పంట దిగుబడులను తగ్గిస్తుంది. శ్రీలంక గత అనుభవాలు, భారతదేశం 100 శాతం సేంద్రీయ వ్యవసాయ రాష్ట్రంగా ప్రకటించిన సిక్కిం నుండి వచ్చిన నివేదికలు ముఖ్యమైన పాఠాలను అందిస్తున్నాయి. శ్రీలంక సేంద్రీయ వ్యవసాయానికి మారడం రసాయన ఎరువులను భర్తీ చేయడానికి తగిన జీవపదార్థ వనరులు లేదా జీవ-ఎరువులను ఉత్పత్తి చేసే సామర్థ్యం లేకుండా పోయింది. పంట పెరుగుదలకు అవసరమైన పోషకాల తీవ్ర కొరత నివేదించింది, ఉత్పాదకత గణనీయంగా తగ్గింది. వ్యవసాయ షాక్ రైతులను ప్రమాదకరమైన పరిస్థితిలోకి నెట్టింది, ఆహార దిగుమతులు పెరిగాయి, ధరలు పెరిగాయి. ఇది క్రమంగా ఆర్థిక పతనం, చివరకు రాజకీయ మార్పుకు దారి తీసిన సంగతి తెలిసిందే.
ప్రధాని పొదుపు చర్యలకు పిలుపు రైతుల ఆత్మహత్యలు నిరాటంకంగా కొనసాగుతున్న సమయంలో, లోటు వర్షపాతం, ఇంధన కొరత, సాగు నీటిపారుదల కొరత తీవ్రమైన సమయంలో ఆయన పిలుపునివ్వడం గమనార్హం. అయితే ఈ పొదుపు చర్యలు పెద్ద కార్పొరేట్ కంపెనీల కోసం కాదని, ఇప్పటికే కష్టాల్లో ఉన్న శ్రామిక ప్రజల కోసమేనని, ఈ విధానాలను తిప్పికొట్టేందుకు కార్మికులు, రైతులు ఐక్యం కావాల్సి అవసరం ఎంతైనా ఉందని పలువురు భావిస్తున్నారు.








కామెంట్‌లు (0)