test1
ఆదివారం, 14 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కార్మికుని చట్టవిరుద్ధ తొలగింపుపై హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

3 గంటల క్రితం

Terminating Workman
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 14, 2026, 01:01 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

సిమ్లా :   కార్మికుల హక్కులను సమర్థిస్తూ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు కీలకమైన తీర్పును వెలువరించింది. మహర్షి మార్కండేయ వైద్య కళాశాలలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఒక ఉద్యోగిని చట్టవిరుద్ధంగా తొలగించడంపై ప్రధాన న్యాయమూర్తి జి. ఎస్. సింధవాలియా, జస్టిస్ బిపిన్ చందర్ నేగిలతో కూడిన డివిజన్ బెంచ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పారిశ్రామిక వివాదాల చట్ట నిబంధనలను ఉల్లంఘిస్తూ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం చెల్లదని స్పష్టం చేసింది. అలాగే గతంలో లేబర్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది.

వివరాల ప్రకారం.. 2012 అక్టోబర్ నుండి మహర్షి మార్కండేయ వైద్య కళాశాలలో సదరు వ్యక్తి సెక్యూరిటీ కార్డుగా నిరంతరాయంగా విధులు నిర్వహిస్తున్నాడు. 2017 మార్చిలో తన తల్లి మరణించడంతో అతను సెలవుపై వెళ్లాడు. తిరిగి విధుల్లో చేరేందుకు వచ్చినపుడు, కళాశాల యాజమాన్యం అతడిని ఉద్యోగంలో చేర్చుకునేందుకు నిరాకరించింది. అతనిని విధుల్లోంచి తొలగించినట్లు యాజమాన్యం స్పష్టం చేసింది. దీనిపై సదరు ఉద్యోగి లేబర్ కోర్టును ఆశ్రయించగా, కోర్టు సెక్యూరిటీ గార్డుకి అనుకూలంగా తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ కళాశాల యాజమాన్యం హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది.

ఆ ఉద్యోగిని కాంట్రాక్టర్ నియమించారని, తమ సంస్థకు చెందిన వాడు కాదని యాజమాన్యం వాదించింది. అతనే స్వచ్ఛందంగా ఉద్యోగాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడని ఆరోపించింది. ఈ వాదనలకు తగిన ఆధారాలను యాజమాన్యం సమర్పించలేకపోయింది.   ఆ ఉద్యోగి తొలగించడానికి ముందు గడిచిన 12 క్యాలెండర్ నెలల కాలంలో 240 రోజుల పాటు పనిచేసినందున పారిశ్రామిక వివాదాల చట్టంలోని సెక్షన్ 25ఎఫ్ నిబంధనలను పాటించడం అత్యవసరమని నిర్థారించింది. అలాగే అతని స్థానంలో మరో ఉద్యోగిని నియమించినందున, ఆ చట్టంలోని సెక్షన్ 25హెచ్ నిబంధనలను కూడా పాటించడం తప్పనిసరి అని కోర్టు గుర్తుచేసింది.

విచారణ సమయంలో కాంట్రాక్టర్ హాజరుకాకపోవడం, సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగ స్థితికి సంబంధించిన ఆధారాలు లేకపోవడంతో, అతనికి అనుకూలంగా లేబర్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. రిజిస్ట్రార్ దాఖలు చేసిన అప్పీల్ ను కొట్టివేసింది. ఉద్యోగుల తొలగింపు విషయంలో కార్మిక చట్టాలను పాటించాల్సిన ఆవశ్యకతను ఈ తీర్పు స్పష్టం చేసింది. కార్మిక చట్టాలను ఖచ్చితంగా గౌరవించాల్సిందేనని ఈ తీర్పు ద్వారా న్యాయస్థానం గట్టి సందేశాన్ని ఇచ్చింది.

Edit

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్