ప్రజాశక్తి-వీకోట (చిత్తూరు) : భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో పుంగనూరులో నిర్వహించనున్న జాబ్ మేళా కార్యక్రమాన్ని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర యూత్ కో కన్వీనర్ పూల ప్రేమ్ కుమార్ పిలుపునిచ్చారు. మండల కేంద్రమైన వీకోటలో ఆదివారం వారు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ బిసివై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 18న పుంగనూరు ఆర్ సి వై ఎస్టేట్ లో పెద్ద ఎత్తున జాబ్ మేళా ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పార్టీ ఆవిర్భావం నుండి రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలకు అనేక విధాల తోడ్పాటు అందిస్తూ తనదైన శైలిలో పార్టీ తరఫున వివిధ కార్యక్రమాలు చేపట్టి ప్రజలలో నిలిచిన నేత బోడె రామచంద్ర యాదవ్ అన్నారు. అదే స్ఫూర్తితో ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి నుండి ఉన్నత చదువులు చదివిన నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టినట్లు వారు తెలిపారు. ఆసక్తి కలిగిన యువతీ యువకులు తమ పేర్లను బిసివైపార్టీ. ఆర్గ/ బిసివైజాబ్స్ (bcyparty.org/bcyjobs) లింకు నందు రిజిస్టర్ చేసుకోవాలన్నారు. దాదాపు 200 కంపెనీలకు పైగా ఈ జాబ్ మేళాలో యువతకు ఉపాధి కల్పించేందుకు హాజరు అవుతున్నట్లు వారు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు అదేరోజు సాయంత్రం నాలుగు గంటలకు నియామక పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు. వీరి వెంట బి సి వై పార్టీ చిత్తూరు జిల్లా యూత్ కన్వీనర్ అరుణ్ కుమార్ వడియార్ తో పాటు పార్టీ సభ్యులు పాల్గొన్నారు.
జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి : బిసివై పార్టీ రాష్ట్ర యూత్ కో కన్వీనర్ పూల ప్రేమ్ కుమార్
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 14, 2026, 04:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)