బెంగళూరు : సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన ‘బొద్దింకల జనతా పార్టీ’ (సీజేపీ) పేరుతో మే 24న బెంగళూరులో మానవహారం నిర్వహించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ‘బొద్దింకల జనతా పార్టీ కర్ణాటక’ పేరుతో విడుదలైన పోస్టర్లో టౌన్ హాల్ సమీపంలో శాంతియుత మానవహారం చేపడతామని పేర్కొన్నారు. “బొద్దింకల శక్తి ఆన్లైన్లోనే కాదు, వీధుల్లో కూడా ఉంది” అని పోస్టర్లో పేర్కొనడం చర్చనీయాంశమైంది. అయితే ఈ కార్యక్రమానికి ఎలాంటి అనుమతి ఇవ్వలేదని బెంగళూరు పోలీసులు స్పష్టం చేశారు. మానవహారం నిర్వహించేందుకు ఏ వ్యక్తి, సంస్థ లేదా రాజకీయ పార్టీ నుంచి ఇప్పటివరకు దరఖాస్తు రాలేదని తెలిపారు. టౌన్ హాల్ పరిసరాల్లో అనుమతి లేకుండా గుమికూడవద్దని, సోషల్ మీడియాలో ఈ కార్యక్రమానికి సంబంధించిన సందేశాలను షేర్ చేయవద్దని హెచ్చరించారు.
నిరుద్యోగ యువతను బొద్దింకలతో పోలుస్తూ ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలపై వ్యంగ్యంగా స్పందిస్తూ ‘బొద్దింకల జనతా పార్టీ’ పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభమైంది. ఈ పేరుతో ప్రారంభమైన ఎక్స్ ఖాతా కొద్ది రోజుల్లోనే వైరల్గా మారింది. అనంతరం ఆ ఖాతా నిలిపివేయబడినప్పటికీ, ఇన్స్టాగ్రామ్లో సీజేపీకి భారీ స్థాయిలో ఆదరణ లభించింది. కొద్ది రోజుల్లోనే సీజేపీ ఇన్స్టాగ్రామ్ ఖాతా 1.85 కోట్ల ఫాలోవర్లను సంపాదించి, ప్రధాన రాజకీయ పార్టీల అధికారిక పేజీలను అధిగమించింది. పుణెకు చెందిన అభిజీత్ దీప్కే అనే యువకుడు ఈ ఖాతాను ప్రారంభించారు. ఖాతా నిలిపివేసిన తరువాత తనకు ప్రాణహాని బెదిరింపులు వస్తున్నాయని ఆయన తెలిపారు.









కామెంట్లు (0)