– జర్మనీ నుంచి ఉపసంహరణపై ట్రంప్ నిర్ణయం
వాషింగ్టన్: పోలాండ్‌కు మరో 5,000 మంది సైనికులను పంపనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. పోలాండ్ అధ్యక్షుడు కరోల్ నవ్‌రోకీతో తనకు ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ ‘ట్రూత్ సోషల్’లో రాశారు. ఇటీవల పోలాండ్‌కు 4,000 మంది సైనికులను పంపే ప్రతిపాదనను పెంటగాన్ రద్దు చేసిన వారం రోజుల్లోనే ట్రంప్ ఈ కొత్త ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. గత ఏడాది జరిగిన పోలాండ్ అధ్యక్ష ఎన్నికల్లో కూడా ట్రంప్, నవ్‌రోకీకి బహిరంగ మద్దతు తెలిపారు. దీంతో అమెరికా, జర్మనీ మధ్య విభేదాలు మరింత పెరగనున్నాయి. ఇటీవల ‘అమెరికా ఫస్ట్’ విధానంలో భాగంగా యూరప్‌లోని అమెరికా సైనికుల సంఖ్యను తగ్గించే దిశగా వైట్‌హౌస్ చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో జర్మనీ నుంచి 5,000 మంది అమెరికా సైనికులను ఉపసంహరించుకుంటున్నట్లు ఈ నెల ప్రారంభంలో ప్రకటించింది. అంతేకాకుండా ఇరాన్ యుద్ధ అంశంపై ట్రంప్ మరియు జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ మధ్య తీవ్ర వాగ్వాదాలు చోటుచేసుకున్న అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. ఇరాన్ చర్చల్లో అమెరికా అవమానానికి గురైందన్న మెర్జ్ వ్యాఖ్యలను ట్రంప్ తీవ్రంగా విమర్శించారు. అయితే జర్మనీ నుంచి ఉపసంహరించుకునే సైనికులను పోలాండ్‌కు బదిలీ చేస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు.
ఇక హోర్ముజ్ జలసంధి వివాదంలో ఇరాన్‌పై ఒత్తిడి తీసుకురావడంలో నాటో మిత్రదేశాలు చురుకుదనం చూపడం లేదని ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అంశంపై చర్చించేందుకు నాటో విదేశాంగ మంత్రులు శుక్రవారం స్వీడన్‌లో సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో హాజరుకానున్నారు.నాటో దేశాలు రక్షణ ఖర్చులను సమానంగా పంచుకోవాలని అమెరికా డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. నాటో మిత్రదేశాల వైఖరిపై ట్రంప్ తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారని మార్కో రూబియో పేర్కొన్నారు.









కామెంట్‌లు (0)