న్యూఢిల్లీ : పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ .. అంతర్జాతీయంగా ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. ఈ ఇంధన ధరల ప్రభావం విమానయాన సంస్థలపైనా పడుతోంది. ఈ క్రమంలో విమానయాన సంస్థలు తమ ఫ్లైట్ సర్వీసుల్లో కోతపెట్టే యోచనలో ఉన్నాయి. రోజువారీగా 100 విమాన సర్వీసులను తగ్గించుకోవాలని టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా నిర్ణయం తీసుకుంది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరలు భారీగా పెరగడంతో జూన్ నుంచి మూడు నెలలపాటు పలు అంతర్జాతీయ సర్వీసులను తగ్గించనున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా …. ఎయిరిండియా ఢిల్లీ నుంచి షికాగో, నెవార్క్, సింగపూర్, షాంఘై లాంటి గమ్యస్థానాలకు సర్వీసులను పూర్తిగా నిలిపివేసింది. శాన్ఫ్రాన్సిస్కో, పారిస్, టొరంటోలకు విమానాల సంఖ్యను తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరలు భారీగా పెరుగుతుండటంతో.. షెడ్యూళ్లను తగ్గించడం తప్ప తమకు మరో మార్గం లేదని ఎయిరిండియా సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ పేర్కొన్నారు. పాకిస్థాన్ గగనతలం మూసివేసి ఉండటంవల్ల యూరప్, ఉత్తర అమెరికాకు వెళ్లే ఎయిరిండియా విమానాలు సుదీర్ఘ మార్గాల్లో ప్రయాణించాల్సి వస్తోందన్నారు. అందువల్ల ఇంధన వినియోగం, సిబ్బంది ఖర్చులు విపరీతంగా పెరిగాయని, విమానాలపై నిర్వహణ ఖర్చును కూడా రాబట్టుకోలేకపోతున్నామని తెలిపారు. ధరలు ఇదే విధంగా పెరిగితే మరిన్ని సర్వీసులపై కోత విధించాల్సి వస్తుందని ఎయిరిండియా సీఈవో వెల్లడించారు.
భగ్గుమంటోన్న ఇంధన ధలు – ఎయిరిండియా విమాన సర్వీసులు తగ్గింపు
13 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 13, 2026, 01:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్లు (0)