ప్రజాశక్తి-తెనాలి రూరల్ (గుంటూరు) : బాపట్ల జిల్లా నిడుబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులపై రైల్వే పోలీసులు కాల్పులు జరిపిన ఘటన మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. తెనాలి రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలోని నిడుబ్రోలు 377వ మైలు రాయివద్ద ఫుట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసు బృందానికి సిగ్నల్ టాంపరింగ్ కు పాల్పడుతున్న ఇద్దరు అనుమానితులు తారసపడ్డారు. వారిని ఆపేందుకు ప్రయత్నించిన పోలీసులపై వారు రాళ్లు రువ్వారు. దీంతో నరసరావుపేట రైల్వే పోలీస్ ఎస్సై తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు ఆత్మరక్షణార్థం కాల్పులు జరిపారు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున సుమారు 2.30 గంటల సమయంలో నిడుబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలోని హోమ్ సిగ్నల్ పాయింట్ వద్ద చోటుచేసుకుంది. పోలీసులు మొత్తం 10 రౌండ్లు కాల్పులు జరిపినట్లు జి ఆర్పీ ఇంచార్జి ఎస్సై ఎల్ సరస్వతి తెలిపారు. అందులో 4 పిస్టల్ రౌండ్లు, 6 (.303) రౌండ్లు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. అయితే అనుమానితులు చీకటిని ఆసరాగా చేసుకుని సమీపంలోని పొలాల వైపు పారిపోయినట్లు తెలిపారు. ఘటన అనంతరం ఆర్ పి ఎఫ్ బృందం స్థానిక పోలీసులకు సమాచారం అందించగా పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు. సంఘటనా స్థలంలో అనుమానితులు వదిలివెళ్లిన వైర్ కట్టర్, టెస్టర్, ఒక జత గ్లౌజులు స్వాధీనపరచుకున్నట్లు తెలిపారు. ఘటనపై తెనాలి రైల్వే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు సరస్వతి చెప్పారు. డిఎస్ఆర్పి అక్కేశ్వరరావు, గుంటూరు ఎస్ హెచ్ ఓ అంజిబాబు ఘటన స్థలాన్ని పరిశీలించినట్లు సమాచారం తెలిపారు.
రాళ్లు విసిరిన దుండగులు – పోలీసుల కాల్పులు
12 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 12, 2026, 12:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్లు (0)