test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఖరీఫ్ వేళ… నకిలీ విత్తనాల గోల ..!

11 మే, 2026

ఖరీఫ్ వేళ… నకిలీ విత్తనాల గోల ..!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 11, 2026, 02:48 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-ఆత్మకూరు (అనంతపురం) : జిల్లాలో రైతుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారింది. ఒకవైపు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడుతుంటే మరోవైపు నకిలీ విత్తనాల సమస్య మరింత జటిలంగా మారింది. ఖరీఫ్ కు ముందు చాలా కంపెనీలు వచ్చి రైతులకు విత్తనాలు ఇచ్చి వెళుతుంటాయి. అయితే ఆ విత్తనాలు నాసిరకమైనవిగా ఉంటున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరానికి సగంపైగా పంట ఉండటం లేదని నిత్యం అధికారుల ముందు తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. విత్తనాల కంపెనీల సిబ్బందిని అడిగితే పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట సాగుకు ముందు నగరంలో ఆఫీస్ ఓపెన్ చేయడం వాళ్ళ బిజినెస్ అయిపోయాక మొఖం చాటేస్తున్నారు. 20 నుండి 30 కంపెననీలు రైతుల చుట్టూ తిరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. జిల్లాలో ప్రధాన పంటలుగా పత్తి, వేరుశనగ, కంది, మొక్కజొన్న, వరి, ఉల్లి, మిర్చి 4 లక్షల హెక్టార్లలో సాగుచేస్తున్నారు. జులై నెల మధ్య వరకు దాదాపు 2 లక్షల హెక్టర్ల పంట సాగులోకి రాగా, ఆగస్టు చివరికల్లా 4 లక్షల హెక్టర్ల పంట సాగుకు సిద్ధం అవుతుంది. 2024 నుండి 2025 మధ్యలో దాదాపు 1 లక్ష ఎకరాల పంట నకిలీ విత్తనాల పాలైంది.

నష్టపోయిన రైతులను పట్టించుకోని అధికారులు, పాలకులు ….
ప్రతీ సంవత్సరం నకిలీ విత్తనాల ఎఫెక్ట్ తో ఇబ్బందిపడుతున్న రైతులను ఇటు అధికారులు, అటు ప్రభుత్వాలు పట్టించుకోవడం మానేశారు. కంపెనీల ప్రతినిధులకు రైతులు ఎన్ని సార్లు తమ గోడు వెళ్ళబోసుకున్నా ఫలితం లేకుండా పోతుంది. దీంతో రైతులు గత్యంతరం లేక ధర్నాలు, నిరసనలు చేసి కాలం వెళ్లదీస్తున్నారు. ప్రస్తుతం రైతులు సేద్యానికి పొలాలను సిద్ధం చేస్తున్నారు. ఈ సమయంలో నకిలీ గ్యాంగ్ గ్రామాలకు చేరి నకిలీ విత్తనాలను అమ్ముతున్నారు.

విత్తనాల మాఫియా
నకిలీ విత్తనాల మాఫియా జిల్లాలో పెరిగిపోతుంది. గతంలో కేవలం జిల్లా కేంద్రంలో మాత్రమే ఉన్న ఈ మాఫియా ప్రస్తుతం ఆత్మకూరు కూడేరు రాప్తాడు కనగానపల్లి అనంతపురం రూరల్ మండలం వంటి ప్రాంతాలకు పాకిపోయింది. ఉమ్మడి జిల్లా నుండి ప్రతీ సంవత్సరం దాదాపు రూ.5 నుండి రూ.10 కోట్ల మేర వ్యాపారం చేసుకుంటున్నారు. విత్తనాల యజమానులు స్థానిక రాజకీయ నాయకులతో కుమ్మక్కు అవుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాయకుల కనుసన్నల్లో ఈ వ్యవహారం జరుగుతుందడంతో అధికారులు మంకెందుకులే అన్నట్టు వెళ్లిపోతున్నారని చర్చ జరుగుతుంది.

2023 నుండి ఇదే తీరు ….
నకిలీ విత్తనాల వల్ల ప్రతీ సంవత్సరం అధిక సంఖ్యలో పంట నష్టమవుతుంది. 2023 లో దాదాపు 20 లక్షల హెక్టర్ల పంట నష్టపోగా, 2025 లో పంట నష్టం అంచన 25 లక్షల హెక్టర్లకు చేరింది. 2026లో దీని అంచనా దాదాపు 30 లక్షలకు చేరింది. కేవలం 10 లక్షల హెక్టర్ల పంట మాత్రమే ఈ నకిలీ విత్తనాల నుండి బయటపడిందని అంచనా.

ఎకరానికి సగం పంట నష్టపోతున్నాం : కూలి.దామోదర్ రెడ్డి రైతు
నకిలీ విత్తనాల సమస్య జిల్లా వ్యాప్తంగా అధికంగా ఉంది. ప్రతి సంవత్సరం నకిలీ విత్తనాల వల్ల ఎకరంలో సగం పంట నష్టపోతుంది. వంట చేతికి వచ్చే సమయానికి పెట్టుబడి డబ్బులు కూడా చేతికి రావడం లేదు. వ్యవసాయం చేయాలంటే రైతులకు కష్టాలు తప్పడం లేదు.

అధికారులు చొరవ తీసుకోవాలి :- కందుల పుల్లారెడ్డి రైతు
నకిలీ విత్తనాల వల్ల రైతులు చాలా నష్టపోతున్నారు. ఖరీఫ్ రబీ సమయంలో అధికారులు నగిలి విత్తనాల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎప్పటికప్పుడు కంపెనీలపై పర్యవేక్షణ చేయాలి. లేకపోతే అప్పుల బాధతో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్