ఉభయ తెలుగు రాష్ర్టాల నాటక రంగంలో ఆమె పేరు తెలియని వారుండరు. సినిమాలు, టీవీ షోలు, సీనియళ్లు, వెబ్ సిరీస్ లతో పలు అవకాశాలను అందిపుచ్చుకుని చక్కని నటిగా తనను తాను నిరూపించుకున్నారు. రూ.లక్షల్లో వచ్చే మెకానికల్ ఇంజనీరింగ్ వృత్తిని వదులుకొని తనకు అత్యంత ప్రీతిపాత్రమైన నాటక రంగ వికాసం కోసం నిరంతరం కృషిచేస్తుండటం ఆమె అంకితభావానికి నిదర్శనం. కమ్యూనిటీ థియేటర్ లో వర్కుషాపులు నిర్వహిస్తూ ఔత్సాహికులను ప్రోత్సహిస్తున్నారు. పన్నెండేళ్ల వయస్సులోనే ఈటీవీ నిర్వహించిన డ్యా న్స్ షోలోనే విజేతగా నిలిచి కళారంగంలో ప్రవేశించారమె. సామాజిక సమస్యలపైనా, సాంఘిక దురాచారాలపైనా, ప్రజల్లో చైతన్యాన్ని రగిలించే పాత్రలేవి వచ్చినా అందులో నటించి జీవిస్తారు. సమాజ ఇతివృత్తమైన పాత్రల్లో నటించి అందరిచేతా శభాష్ అని పిలిపించుకుంటున్నారు. ఆమే లహరి గుడివాడ.
గుంటూరుకు చెందిన శ్రీనివాసరావు, మాధవీలతల కుమార్తె లహరి. తండ్రి వ్యాపార రంగంలో ఉండగా, తల్లి గుంటూరులో విద్యారంగంలో పనిచేస్తున్నారు. భర్త రమేష్ ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్‌గా స్థిరపడ్డారు. కుమార్తె షణ్ముక హైస్కూలు విద్యార్థిని. లహరి బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్‌ను వడ్లమూడిలోని విజ్ఞాన్స్ ఇంజనీరింగ్ కాలేజీలోనూ, ఆతర్వాత పీజీ డిప్లమో ఇన్ టూరిజం, ఆ తర్వాత థియేటర్ ఆర్ట్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచి ఆమె అభ్యుదయ భావాలను అలవర్చుకున్నారు. సమాజ చైతన్యానికి కళలు దోహదపడతాయని భావించి రంగస్థలంపై మక్కువ పెంచుకున్నారు. ప్రదర్శనలు ఎక్కడ జరిగినా వెళ్లి వీక్షించి తనను ఆయా పాత్రల్లో ఊహించుకుంటూ ప్రాక్టీస్ చేశారు. అప్పట్లో ‘భలే వాళ్లే వీళ్లు’ హాస్యనాటిక ప్రాక్టీస్ చేస్తుండగా నాయుడు గోపి, గుంటూరు లక్ష్మీ గార్లతో ఏర్పడిన పరిచయంతో నాటక రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత జెమినీ టీవీలో ‘దామిని’ అనే సీరియల్లో చేసిన పాత్రకు ఆమెకు మంచి పేరొచ్చింది. నాటక రంగ ప్రముఖులైన వైఎస్ కృష్ణేశ్వరరావు, ఎన్.రవీంద్రరెడ్డి, షేక్ షఫీ, చెరుకూరి సాంబశివరావు, వరికూటి, జిఎస్.ప్రసాదరెడ్డి, ఎస్.ఎం.బాషా వంటి దర్శకుల వద్ద ఎన్నో నాటకాల్లో విభిన్న పాత్రల్ని అద్భుతంగా పోషించి మెప్పించారు. రంగస్థలం.. బుల్లితెర.. వెండితెరలోనూ ఆమె పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నారు.
పలు వేదికలపై …
ఆమెకు బాగా పేరు తెచ్చిన నాటకాల్లో గుర్తు తెలియని శవం, రెండు నిశ్శబ్దాల మధ్య, కెరటాలు, ఆలితో సరదాగా, చీకటి పువ్వు, ఆస్తికలు, గోవుమాలచ్మి, నాన్నా నేనొచ్చేస్తా.. మొదలైనవి ఉన్నాయి. ‘అల్లూరి సీతారామరాజు` టైటిల్ రోల్ లోనూ నటించి మంచి గుర్తింపు పొందారు. సామాజికచైతన్యం, మహిళాభ్యుదయం, సామాజిక సమస్యలపై గట్టిగా నిలబడే పాత్రల్లో నటించటం ఆమెకు ఎంతో ఇష్టం. అలిపిరికి అల్లంత దూరంలో…, ఓటు వంటి సినిమాల్లోనూ నటించారు. భార్య, కుమార్తె, తల్లి, యువతి, పురుష వేషం … ఇలా ఏ పాత్రలో నటించినా అందులో ఒదిగిపోయి జీవించేలా నటించటం ఆమె ప్రత్యేకత.
ఎల్ఎస్ఆర్ థియేటర్ ఆర్ట్స్‌లో నిపుణురాలిగా…
లహరి … ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఎంఎ థియేటర్ ఆర్ట్స్ కోర్సును మెంటార్ ఎల్.వి.నాగభూషణ్ పర్యవేక్షణలో పూర్తిచేశారు. తను చదివిన థియేటర్ ఆర్ట్స్ కోర్సుకు మన విద్యా వ్యవస్థను అనుసంధానం చేసి వర్కుషాపులు నిర్వహిస్తున్నారు. అప్లైడ్ థియేటర్ ఇన్ ఉమెన్ ఎంపవర్మంట్ పేరుతో ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటుగా ఉత్తరప్రదేశ్, కర్నాటకలో కొంతమంది స్నేహితుల సహకారంతో ఇప్పటికే కొన్ని వర్కుషాపులు నిర్వహించారు. అప్పటికప్పుడు ఫెర్ఫార్మెన్స్ ఇవ్వటంలోనూ ఆమె దిట్ట. ప్లే బ్యాక్ థియేటర్ కొత్త కాన్సెప్ట్‌పై ఇంటరాక్టివ్ కార్యక్రమాలను చేపడుతున్నారు. పలు వినోద కార్యక్రమాలకు కూడా ఆమె నేతృత్వం వహించి స్టాండ్ అప్ కామెడీ షోలు కూడా చేస్తూ అబ్బురపరుస్తున్నారు. ఇటీవల ఆమె సొంతంగా లెర్నింగ్ స్టాండర్స్ ఆఫ్ రిసోర్స్ సెంటర్ ఫర్ థియేటర్ (ఎల్ఎస్ఆర్) పేరుతో ఓ అసోసియేషన్ ఏర్పాటు చేసి నాటక రంగ కళలో ఔత్సాహికులకు శిక్షణ ఇస్తున్నారు. అఫ్లైడ్ థియేటర్ టెక్నిక్స్‌ను తెలియజేస్తున్నారు. ప్లే బ్యాక్ థియేటర్ ఇంటరాక్టివ్ టెక్నిక్స్ ద్వారా ఉమెన్ ఎంపవర్మెంట్, టీనేజ్ టెంప్టేషన్స్పై కూడా పలు ప్రదర్శనలు ఇచ్చారు.
వేలాది ప్రదర్శనలు
లహరి ఇప్పటివరకూ 150కి పైగా సాంఘిక, చారిత్రక, పౌరాణిక నాటికలు, నాటక ప్రదర్శనలు ఇచ్చారు. 3000లకు పైగా ప్రదర్శనల్లో పాల్గొన్నారు. 900కి పైగా పురస్కారాలు అందుకున్నారు. కందుకూరి, నంది, గరుడ, అశ్వం, హనుమ, సింధూర వంటి అవార్డులను స్వీకరించారు. మహానటి, నట శిరోమణి బిరుదులు స్వీకరించారు. ‘ది గ్రేట్ తెలుగు లాఫ్టర్ ఛాలెంజ్` పోగ్రాంలో ఫైనలిస్టుగా నిలిచి సినీనటుడు బహ్మానందం చేతుల మీదుగా పురస్కారాన్ని స్వీకరించారు. వివాహ భోజనంబు వెబ్ సిరీస్‌లో ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది. 2005 నుంచి 2009 యూత్ ఫెస్టివల్స్ నిర్వహణలో భాగస్వామ్యమై 15 జాతీయ పురస్కారాలను అందుకున్నారు. మైం సోలో నేషనల్, ఫోక్ సోలో సెకండ్ బెస్ట్ నేషనల్ అవార్డులు ఆమె ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. నానో టెక్నాలజీపై 2018లో ఆమె సమర్పించిన పరిశోధనా పత్రానికి కన్సొలేషన్ బహుమతి లభించింది.

ప్రదర్శన రూపంలో పాఠాల బోధన : – లహరి గుడివాడ, నాటక రంగ కళాకారిణి
సంగీతం, నాట్యం వంటి కళలతోపాటుగా నాటక రంగానికి కూడా ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకు రావాలన్నదే నా లక్ష్యం. నాటక రంగంలో కొత్త పక్రియలకు శ్రీకారం చుట్టా. నేటి తరానికి అవగాహన కల్పించటంతోపాటుగా వారికి ఉపాధి అవకాశాలు లభించేలా కృషిచేస్తున్నా. అప్లయిడ్ థియేటర్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా చదువులో వెనుకబడిన, బాగా వెనుక బడిన విద్యార్థులకు సైన్స్, సోషల్ స్టడీస్, తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషల్లో కష్టమనిపించే పాఠ్యాంశాలను ప్రదర్శనకు అనుకూలంగా తయారు చేయిస్తున్నా. పాఠాలను సులభతరంగా మార్చి వారితోనే చెప్పించటం ద్వారా వారు మెరుగ్గా రాణిస్తున్నారు.
– యడవల్లి శ్రీనివాసరావు
















